Updated : 06 Nov 2021 06:02 IST

స్కై విల్లాలు

ఆకాశ హర్మ్యాల్లో నయా పోకడ
ఈనాడు, హైదరాబాద్‌

త్యంత విలాసవంతమైన నివాసాలకు హైదరాబాద్‌ రియాల్టీ చిరునామాగా మారుతోంది. ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తున్న హర్మ్యాలతో పాటే కొత్త పోకడలను నిర్మాణ రంగం పరిచయం చేస్తోంది. స్కైవిల్లాల నిర్మాణం ఇప్పుడు హైదరాబాద్‌ మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌. నలభై, యాభై అంతస్తులపైన వీటిని చేపడుతున్నారు. అత్యంత విశాలంగా..అన్ని హంగులతో కడుతున్నట్లు బిల్డర్లు చెబుతున్నారు. స్కైవిల్లా ఒక్కోటి తక్కువలో తక్కువ రూ.5కోట్ల నుంచి మొదలై రూ.25 కోట్ల పైనే ధరలు ఉన్నాయి.

కొవిడ్‌ అనంతరం హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్లో విల్లాలకు డిమాండ్‌ పెరిగింది. ఓఆర్‌ఆర్‌తో రవాణాకు పెద్ద సమస్య లేకపోవడంతో శివార్లలో విల్లాలను ఎక్కువగా కొనుగోలు చేశారు. చుట్టూ ఆహ్లాదకర పరిసరాలు, ప్రశాంత వాతావరణం, క్లబ్‌హౌస్‌లో సకల సౌకర్యాలతో వీటి వైపు మొగ్గు చూపారు.  స్థిరాస్తి ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడి దృష్ట్యా కూడా పెద్ద సంఖ్యలో కొన్నారు. సిటీకి దూరంగా ఉంటున్నామనే భావన కొందరిలో ఉండటం.. రెండు మూడు అంతస్తుల వల్ల కుటుంబం ఒకచోట కాకుండా ఒక్కొక్కరూ ఒక్కో అంతస్తులో ఉండటం, పెద్దలు మోకాళ్ల నొప్పులతో లిఫ్ట్‌లు పెట్టుకోవాల్సి రావడం వంటి ప్రతికూలతలు వీటిలో ఉన్నాయి.  స్కైవిల్లాలను ఎక్కువగా ఒకటే అంతస్తులో చేపడుతున్నారు. కుటుంబంలో అందరూ ఒకే చోట ఉండడం, వ్యక్తిగత ఇల్లు మాదిరి ముందు విశాలమైన స్థలంలో లాన్‌, వెనకాల బ్యాక్‌యార్డ్‌ మాదిరి కూర్చుని సేద తీరేందుకు వీలుగా డెక్‌ సదుపాయాలు ఉండటం వీటి ప్రత్యేకత. ఇతరులకు ప్రవేశం ఉండదు. అత్యంతఎత్తు నుంచి నగరాన్ని వీక్షించవచ్చు. కాలుష్యం ఉండదు. శుభ్రమైన గాలిని, సూర్యోదయాన్ని ఆస్వాదించవచ్చు. సాధారణ ఫ్లోర్‌ కంటే ఎత్తు కాస్త ఎక్కువగా ఉంటుంది. హోం థియేటర్‌, జిమ్‌, పనివాళ్లకు ప్రత్యేకగదులు ఉంటాయి. వ్యాపారవేత్తలు, ఐటీ, ఇతర సంస్థల్లో ఉన్నతోద్యోగులు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు.

ఆరు వేల నుంచి 17వేల వరకు..

సాధారణంగా 3 వేల చదరపు అడుగులు అంటే 4 పడక గదులతో విశాలమైన ఇల్లు వస్తుంది. స్కైవిల్లాలు ఒక్కోటి ఆరేడు వేల చ.అ. విస్తీర్ణంలో మరింత విశాలంగా కడుతున్నారు.  ఒక్కో అంతస్తులో ఒకటి, రెండు విల్లాలే ఉంటాయి.  కొన్ని సంస్థలు మూడు వేల చ.అ. విస్తీర్ణంలోనూ స్కైవిల్లాలు కడుతున్నాయి. నానక్‌రాంగూడలో 50 అంతస్తులపైన కట్టబోతున్న ఒక సంస్థ గరిష్ఠంగా 17 వేల చ.అ. విస్తీర్ణంలోనూ ఆఫర్‌ చేస్తోంది.

భూముల ధరలు పెరగడం కూడా..

ఐటీ కారిడార్‌లో భూముల ధరలు పెరగడం కూడా స్కైవిల్లాలు రావడానికి  ఒక కారణమని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కోకాపేట వంటి ప్రాంతాల్లో ఎకరా భూమి ధర రూ.40-50 కోట్ల వరకు పలుకుతుండటంతో స్థలం కొనుగోలు చేసి విల్లా కట్టుకోవడం కష్టమని..  స్కైవిల్లా అయితే అదే ప్రాంతంలో ఎక్కువ మంది కొనేందుకు మొగ్గు చూపుతారని బిల్డర్లు అంటున్నారు. భూముల ధరలు బాగా పెరిగిన చోటనే ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. వాటిపైన స్కైవిల్లాలు చేపడుతున్నారు.  

రెట్టింపు ఖరీదు..

స్కైవిల్లాల్లో ముందువైపు ఖాళీ స్థలం ఎక్కువగా వదులుతారు. వెనకవైపు బ్యాక్‌యార్డ్‌ మాదిరి డెక్‌, ఈత కొలను వంటి సదుపాయాలు వీటిలో ఉంటాయి. బిల్టప్‌ ఏరియా కంటే ఖాళీగా వదిలిన విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని.. అన్నింటికీ కలిపి ధర కాబట్టి రెట్టింపు చెబుతున్నామని ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. వీటిలో ప్రారంభ ధరలు చ.అ. రూ.12వేల నుంచి రూ.25వేల వరకు ఉన్నాయి.


టీడీఆర్‌తో - సీహెచ్‌ రాంచంద్రారెడ్డి, ఛైర్మన్‌, క్రెడాయ్‌ తెలంగాణ

జీవో 86కి ముందు ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఏ) ఆంక్షలు ఉన్నప్పుడు హైదరాబాద్‌లో పెంట్‌హౌస్‌లు కట్టేవారు. వీటిని కొన్నవారే చివరి అంతస్తును పూర్తిగా వాడుకునేలా ఉండటంతో అప్పట్లో బాగా కొనేవారు. ఇప్పుడు టీడీఆర్‌తో స్కైవిల్లాలకు వెళుతున్నారు. అదనపు అంతస్తులకు అనుమతి ఉండటంతో బహుళ అంతస్తుల భవనాలు.. ప్రత్యేకించి ఆకాశహర్మ్యాల్లో వీటిని కట్టడానికి ముందుకొస్తున్నారు. ఇవి బెంగళూరు, ముంబయిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మన దగ్గర విలాసవంతమైన నివాసాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపడంతో ఈ తరహా విశాలమైన నివాసాలు వస్తున్నాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని