నింగి నేల హద్దులుగా నివాసం

ప్రధాన నగరంలో ఆకాశహర్మ్యాలు.. శివార్లలో గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లు, విల్లాలు.. అవుటర్‌ బయట లేఅవుట్లు..  ప్రాంతీయ వలయ రహదారి ఆవల ఫామ్‌ ల్యాండ్లతో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పరిధి నగరంలో మరింతగా పెరిగింది. ఆకాశమే హద్దుగా అన్నట్లుగా పశ్చిమ హైదరాబాద్‌లో 50 అంతస్తుల వరకు నిటారుగా గృహ సముదాయాలు వెలుస్తున్నాయి. స్థలాల వెంచర్లేమో అవుటర్‌ దాటి 50 కిలోమీటర్లు వరకు విస్తరించాయి. అందుబాటు ధరల్లో ఇళ్లు మొదలు అత్యంత ఖరీదైన నివాసాల వరకు ప్రస్తుతం నగరంలో నిర్మాణంలో ఉన్నాయి.

Updated : 13 Nov 2021 06:09 IST

మరింతగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ విస్తరణ

ఈనాడు, హైదరాబాద్‌

ప్రధాన నగరంలో ఆకాశహర్మ్యాలు.. శివార్లలో గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లు, విల్లాలు.. అవుటర్‌ బయట లేఅవుట్లు..  ప్రాంతీయ వలయ రహదారి ఆవల ఫామ్‌ ల్యాండ్లతో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పరిధి నగరంలో మరింతగా పెరిగింది. ఆకాశమే హద్దుగా అన్నట్లుగా పశ్చిమ హైదరాబాద్‌లో 50 అంతస్తుల వరకు నిటారుగా గృహ సముదాయాలు వెలుస్తున్నాయి. స్థలాల వెంచర్లేమో అవుటర్‌ దాటి 50 కిలోమీటర్లు వరకు విస్తరించాయి. అందుబాటు ధరల్లో ఇళ్లు మొదలు అత్యంత ఖరీదైన నివాసాల వరకు ప్రస్తుతం నగరంలో నిర్మాణంలో ఉన్నాయి.

కొవిడ్‌ తర్వాత వేగంగా కోలుకున్న స్థిరాస్తి మార్కెట్లలో హైదరాబాద్‌ ఒకటి. స్థిరాస్తుల ధరలు పడిపోతాయని మొదట్లో భావించారు. ఇళ్ల ధరలు తగ్గకున్నా.. భూముల ధరలు తగ్గే అవకాశం ఉందని స్థిరాస్తి రంగంలోని వారు అంచనా వేశారు. కొవిడ్‌ భయాలు తగ్గే వరకు స్తబ్ధుగా ఉన్న మార్కెట్‌.. ఆ తర్వాత అందరి అంచనాలను తారుమారు చేస్తూ వేగంగా పూర్వ స్థాయికి చేరుకుంది.  ఎవరూ ఊహించని స్థాయిలో భూముల ధరలు పెరిగాయి. దీంతో మరిన్ని పెట్టుబడులు ఈ రంగంలోకి వచ్చాయి. నగరంలో మెరుగైన మౌలిక వసతులు ఉండటం, మరికొన్ని పురోగతి, ప్రణాళిక దశలో ఉండటంతో హైదరాబాద్‌ వృద్ధిపై విశ్వాసం మరింత పెరిగింది. దీంతో ఇతర ప్రాంతాలు, ఎన్‌ఆర్‌ఐలు భారీగా పెట్టుబడి పెడుతున్నారు. బ్యాంకుల్లో వడ్డీరేట్లు తగ్గడంతో ఎక్కువ మంది స్థిరాస్తుల్లో మదుపు చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. కొవిడ్‌ తర్వాత ఇంటి అవసరం పెరగడంతో  ఇళ్లు లేని వారు కొత్త ఇంటిని కొనడం, ఇప్పటికే ఉన్నవారు మరింత విశాలమైన ఇంటికోసం చూడటంతో మార్కెట్‌ పరుగులు పెట్టింది. డిమాండ్‌ సైతం భారీగా పెరిగింది.

పెద్ద ఎత్తున మొదలయ్యాయి..

కొవిడ్‌ తర్వాత డిమాండ్‌ బాగా ఉండటంతో అపార్ట్‌మెంట్‌, విల్లాల ప్రాజెక్టులు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. అప్పటివరకు వాయిదా పడిన నిర్మాణాలు మొదలెట్టారు. బహుళ అంతస్తుల ప్రాజెక్టులు చాలావరకు 2023-24 నాటికి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి. వ్యాపార వర్గాలు, ఐటీ సంస్థల్లోని ఉన్నతోద్యోగులను లక్ష్యంగా చేసుకుని అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టులు చేపట్టారు. ఐటీ కారిడార్‌ చుట్టుపక్కలనే ఇవి ఎక్కువగా వస్తున్నాయి. ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి, ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ఆకాశహర్మ్యాలను చేపట్టారు. గచ్చిబౌలి, కోకాపేట, నానక్‌రాంగూడ, నార్సింగి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నిర్మాణాలు వస్తున్నాయి.  ఐటీకి చేరువలో ఉన్న బాచుపల్లి దాటేసి అవుటర్‌ వరకు భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. 15 నుంచి 50 అంతస్తుల వరకు కడుతున్నారు. ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, పోచారం వైపు క్రమేణా ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. పశ్చిమం నుంచి  ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. విశాలమైన ఇళ్ల కోసం, ఎక్కువ మంది కొత్త ఇళ్ల వైపు చూస్తున్నారని బిల్డర్లు అంటున్నారు.

ప్రాంతీయ వలయ రహదారి వరకు..

స్థలాల లేఅవుట్లు అవుటర్‌ రింగ్‌ రోడ్డు- ప్రాంతీయ వలయ రహదారి మధ్యలో ప్రస్తుతం అధికంగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు ఇక్కడే వస్తున్నాయి. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతి పొందిన లేఅవుట్లు ఉన్నాయి. భవిష్యత్తు దృష్ట్యా స్థలాలపై పెట్టుబడి పెడుతున్నారు. పెద్ద సంస్థలు విల్లా లేఅవుట్‌ ప్రాజెక్టులను తీసుకొస్తున్నాయి. సామాన్యుల నుంచి శ్రీమంతుల వరకు వారి బడ్జెట్‌ను బట్టి ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రాంతీయ వలయ రహదారి దాటేసి మరో 50 కిలోమీటర్ల వరకు ఫామ్‌ ల్యాండ్ల వ్యాపారం జరుగుతోంది. అవసరాలు, భవిష్యత్తు దృష్ట్యా తమకు నచ్చిన వాటిలో కొనుగోలు చేస్తున్నారు. అన్నివర్గాలకు తగ్గ స్థిరాస్తులు హైదరాబాద్‌ మార్కెట్లో అందుబాటులో ఉండటం కలిసొచ్చే విషయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.


శివార్లలో..

శివార్లలో అవుటర్‌కు అటుఇటూ పెద్ద సంఖ్యలో విల్లాల నిర్మాణం చేపట్టారు. పటాన్‌చెరు, మేడ్చల్‌, తుక్కుగూడ, శంషాబాద్‌, బొంగ్లూరు, ఘట్‌కేసర్‌ చుట్టుపక్కల ఇవి వచ్చాయి. గచ్చిబౌలి నుంచి శంకర్‌పల్లి, పటాన్‌చెరు మార్గంలో పెద్ద సంఖ్యలో విల్లాలు వస్తున్నాయి. చాలావరకు అనుమతుల దశలో ఉన్నాయి. సిటీకి మూడువైపులా ఉన్న బండ్లగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వస్తున్నాయి. తుర్కయంజాల్‌, సిటీ మధ్యలో అత్తాపూర్‌ వంటిచోట్ల కూడా వీటి నిర్మాణం చేపట్టారు. అవుటర్‌ వరకు నగరం విస్తరించిన చోట బహుళ అంతస్తుల భవనాలు వస్తున్నాయి. జనావాసాలకు దూరంగా ఉన్న చోట విల్లాలు చేపడుతున్నారు. బడా సంస్థలు టౌన్‌షిప్పులను చేపట్టాయి. వ్యక్తిగత ఇళ్ల కొనుగోళ్లు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని