Updated : 01 Jan 2022 04:49 IST

పురోగమనమే!

స్థిరాస్తి రంగంలో గత ఏడాది అసాధారణ వృద్ధి కనిపించింది. కొన్ని నెలలుగా దూకుడు మీద ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున రియల్‌ కార్యకలాపాలు ఆరు ఫ్లాట్లు, మూడు విల్లాల మాదిరి సాగాయి. కొవిడ్‌ ముందుతో పోలిస్తే 2021లో క్రయ విక్రయాలు అధికంగా నమోదయ్యాయి. గృహ రుణ వడ్డీరేట్లు తక్కువగా ఉండటం కలిసి వచ్చింది. మార్కెట్‌ బాగుండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటూ కొన్ని అనారోగ్యకర వ్యాపార పోకడలు రియల్‌ ఎస్టేట్‌లో కనిపించాయి. కొత్త సంవత్సరంలోనూ స్థిరాస్తి రంగం మరింత పురోగమిస్తుందని.. భూముల ధరలు నిలకడగా ఉంటాయని రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు అంచనా వేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుండటం, స్థిరమైన ప్రభుత్వం, ధరణి, టీఎస్‌ ఐపాస్‌, బీసాస్‌ వంటి సంస్కరణలతో సులభతర వ్యాపార అవకాశాలు పెరగడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. కొవిడ్‌ పరిస్థితుల్లోనూ పలు సంస్థలు, పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు గత త్రైమాసికంలో వచ్చినన్ని పెట్టుబడులు ఎప్పుడూ రాలేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. సంస్థల రాకతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా, ఐటీ, ఫార్మా రంగాలు కొవిడ్‌ తర్వాత మరింత వృద్ధి చెందడంతో దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ త్వరగా కోలుకుని పురోగమించింది. టీఎస్‌ బీపాస్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆరునెలల వ్యవధిలో 60వేల నిర్మాణాలకు అనుమతులు పొందారు.  ఇంతగా డిమాండ్‌ పెరగడానికి కరోనా వైరస్‌ నేర్పిన గుణపాఠాలతో సొంతిల్లు ఉండాలనే భావన పెరగడంతో అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు, శివార్లలో విల్లాలు, స్థలాలు కొనుగోళ్లు పెరిగాయి. కొత్త సంవత్సరంలోనూ ఇదే ఒరవడి కొనసాగుతోందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రాంతీయంతో మరింత చలనం  : తెలంగాణకు మరో మణిహారం లాంటి ప్రాంతీయ వలయ రహదారి సిటీ శివారు చుట్టుపక్కల 340 కి.మీ. పరిధిలో వలయాకారంగా వస్తుండటం.. ఎనిమిది జాతీయ, రాష్ట్రాల రహదారుల అనుసంధానంతో కొత్త జిల్లా కేంద్రాల భవిష్యత్తు మారుబోతోంది. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరితో పాటూ మహబూబ్‌నగర్‌, నల్గొండ, నాగర్‌కర్నూలు జిల్లాల వరకు సానుకూలత ఏర్పడింది.


ధరల్లో  పెరుగుదల..
నిర్మాణ సామగ్రి స్టీలు, సిమెంట్‌, విద్యుత్తు పరికరాలు, యూపీవీసీ ధరలు పెరగడంతో ఇళ్ల ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు సొంతిల్లు కొంత భారంగా మారింది. రూ.45 లక్షలుగా ఉన్న అందుబాటు ధరల ఇళ్లు కాస్త రూ.50-60లక్షలకు పెరిగాయి. భూముల ధరలు కొన్ని ప్రాంతాల్లో  రెండు మూడేళ్లలో రెట్టింపు కావడంతో ఆ ప్రభావం ఇళ్లపై పడింది. ఇంతలా పెరగడం మంచిది కాదని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. పెరిగిన భూముల ధరలు తగ్గే అవకాశాలు లేవు కాబట్టి కొత్త సంవత్సరంలో సొంతిల్లు కొనుగోలు చేయాలంటే ఈ మేరకు ఆర్థికంగా సిద్ధం కావాల్సిందేనని డెవలపర్లు అంటున్నారు.

సరఫరా  పెరుగుతుంది..
2018 రెరా వచ్చినప్పటి నుంచి 2021 డిసెంబరు నాటికి 1.95 లక్షల యూనిట్లు రిజిస్టర్‌ అయ్యాయి. వీటిలో కొన్ని పూర్తికాగా.. మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయి.  ఇంకొన్ని ప్రారంభం కావాల్సి ఉంది. ఇటీవల వరకు ఏటా 20-30వేల మధ్య ఇళ్లు హైదరాబాద్‌లో నిర్మిస్తే.. గత ఏడాది ఈ సంఖ్య 50వేలకు చేరినట్లు పరిశ్రమల ప్రతినిధులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ప్రారంభించడం, అందునా ఆకాశ హర్మ్యాలు కావడంతో ఒక్కోచోట రెండు మూడువేల యూనిట్లు వస్తున్నాయి. దీంతో డిమాండ్‌ కంటే సరఫరా అధికంగా ఉండే అవకాశం ఉందనే ఆందోళనలో పరిశ్రమ ఉంది. అమ్ముడుపోకుండా మిగిలిన ఇళ్లు(ఇన్వెంటరీ) పెరుగుతాయని క్రెడాయ్‌ ప్రతినిధులు చెబుతున్నారు. దీన్ని తాము ఒక అవకాశంగా చూస్తున్నామని.. మార్కెట్‌ పరిధి మరింతగా విస్తరిస్తోందని అంటున్నారు.


నిలకడగా ఉండొచ్చు..

తెలంగాణలో గత చరిత్ర తీసుకుంటే భూముల ధరలు పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఇటీవల వరకు అమాంతం పెరిగిన మాదిరి మాత్రం 2022లో పెరగకపోవచ్చు. ధరలు నిలకడగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ఇక అందుబాటు ఇళ్ల విషయానికి వస్తే కేంద్రం ఐదేళ్ల కిందట రూ.45లక్షల లోపు ధరల్లో ఉన్నవాటిని అందుబాటు ఇళ్లుగా పేర్కొంది. విస్తీర్ణం పరంగా 60 చదరపు మీటర్ల వంటి పరిమితులు ఉన్నాయి. భూములు, ముడి సరకుల ధరలు ఐదేళ్లలో చాలా పెరిగాయి. దీంతో ప్రస్తుతం ఆ ధర రూ.60 లక్షలకు చేరింది. కేంద్రం మాత్రం పరిమితి పెంచలేదు. ఇప్పటికే పలు మార్లు కేంద్ర ప్రభుత్వానికి క్రెడాయ్‌ విజ్ఞప్తి చేసింది. ప్రోత్సాహకాలు అందిస్తే మరింత మంది బిల్డర్లు అందుబాటు ఇళ్లు కట్టేందుకు ముందుకు వస్తారు.

-పి.రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌


స్థిరత్వం  వస్తుంది..

గత ఏడాది కొవిడ్‌ రెండో వేవ్‌తో కొద్దిరోజులు పరిశ్రమ ఒడిదొడుకులు ఎదుర్కొంది. తర్వాత వేగంగా కోలుకుంది. మొత్తంగా 2021 రియల్‌ ఎస్టేట్‌కు సానుకూలంగా గడిచింది. మార్కెట్‌ బాగుండటంతో కొన్ని అనైతిక వ్యాపార పోకడలు హైదరాబాద్‌ మార్కెట్‌లో కనిపించాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు స్థిరాస్తి సంఘాల తరఫున మేము, ప్రభుత్వం సైతం చర్యలు చేపట్టింది. కొత్త సంవత్సరంలో రెరా పటిష్ఠంగా మారుతుందని భావిస్తున్నాం. మార్కెట్‌లో స్థిరత్వం వస్తుందని అంచనా వేస్తున్నాం. ప్రతిపాదిత ప్రాంతీయ వలయ రహదారిని పరిశ్రమలకు గ్రోత్‌ ఇంజిన్‌గా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ భూములను ఆ మేరకు పరిశ్రమల పార్కులకు కేటాయించి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి బాటలు వేయాలి.

-జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌  

 

- ఈనాడు, హైదరాబాద్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని