రేపటి సిరులు ఎక్కడ?

నగరానికి వరసగా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఒక్కోటిగా ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాయి. సహజంగానే కొత్త ప్రాజెక్ట్‌ వస్తోందంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది. ఏ ప్రాంతంలో వస్తుంది? అవుటర్‌ బయటనా? ప్రాంతీయ వలయ రహదారి అవతలనా? సిటీకి ఎంతదూరం? ఇంకా బోలెడు లెక్కలు వేస్తుంటారు. అంతగా ఆసక్తి కనబరచడానికి కారణం లేకపోలేదు. ఆయా ప్రాంతంలో స్థిరాస్తి రంగం వృద్ధికి ఈ ప్రాజెక్ట్‌లే ఊతం.

Updated : 05 Feb 2022 04:47 IST

ఈనాడు, హైదరాబాద్‌

నగరానికి వరసగా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఒక్కోటిగా ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాయి. సహజంగానే కొత్త ప్రాజెక్ట్‌ వస్తోందంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది. ఏ ప్రాంతంలో వస్తుంది? అవుటర్‌ బయటనా? ప్రాంతీయ వలయ రహదారి అవతలనా? సిటీకి ఎంతదూరం? ఇంకా బోలెడు లెక్కలు వేస్తుంటారు. అంతగా ఆసక్తి కనబరచడానికి కారణం లేకపోలేదు. ఆయా ప్రాంతంలో స్థిరాస్తి రంగం వృద్ధికి ఈ ప్రాజెక్ట్‌లే ఊతం.

నగర అభివృద్ధికి సంబంధించి పలు మౌలిక ప్రాజెక్టులను  ప్రభుత్వం ఒక్కోటి పూర్తి చేసుకుంటూ వస్తోంది. రాబోయే రెండేళ్లలో పూర్తిచేసేందుకు మరికొన్నింటికి వరసగా శంకుస్థాపనలు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్‌వేలు వేర్వేరు ప్రాంతాల్లో పురోగతిలో ఉన్నాయి. నగరంలో ఈ తరహా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లకు పెద్దపీట వేయడం ద్వారా మెరుగైన రవాణా ఏర్పడుతుంది. శివార్లకు అనుసంధానం పెరిగి సొంతింటి కల నెరవేర్చుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి. ముందుచూపుతో ఆయాచోట్ల స్థలం, సొంతిల్లు కొనుగోలుతో భవిష్యత్తుకు బాట వేసుకోవచ్చు అని గతానుభవాలు సూచిస్తున్నాయి.

ఎక్కడెక్కడ వస్తున్నాయి?

రాష్ట్రంలో ఐదేళ్లలో వేర్వేరు ప్రాజెక్ట్‌లు ఎక్కడ రాబోతున్నాయి? కేవలం ప్రకటనకే పరిమితమా? ఆచరణలో అడుగులు పడుతున్నాయా? పూర్తయ్యేందుకు ఎంతకాలం పడుతుందనే అంచనాతో స్థలం, ఇల్లు, ఫ్లాటు కొనుగోలుపై నిర్ణయం తీసుకోవచ్చు. ఎక్కడ కొనుగోలు చేసినా విలువ పెరుగుతుంది.. అయితే ఎంతకాలంలో వృద్ధిని ఆశిస్తున్నారనేది ఇక్కడ కీలకం. దాన్ని బట్టి స్థిరాస్తిని కొనుగోలు చేసే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని ఈ రంగంలో అనుభవజ్ఞులు సూచిస్తున్నారు.

* అవుటర్‌ బయట నలువైపులా వేర్వేరు నగరాలు రాబోతున్నాయి. వీటిలో ఫార్మాసిటీ, నిమ్జ్‌ ఆచరణలోకి వస్తున్నాయి. భూసేకరణ దశలో ఉన్నాయి.
* బాహ్య వలయ రహదారి బయట 330 కి.మీ. మేర పలు పట్టాలను కలుపుతూ ప్రాంతీయ వలయ రహదారి రాబోతుంది. జాతీయ రహదారిగా నిర్మించేందుకు ఇప్పటికే కేంద్రం తొలిదశకు అంగీకరించింది. సంగారెడ్డి నుంచి చౌటప్పల్‌ వరకు మొదటి దశ వస్తోంది.
* బాహ్య వలయ రహదారి లోపల పలు ప్రాంతాలకు సరైన కనెక్టివిటీ లేదు. వీటిని కలుపుతూ రేడియల్‌ రోడ్లు  నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల ఇటీవల పూర్తయ్యాయి. ఇవన్నీ 100 అడుగుల రహదారులు. అంత పెద్ద రహదారి వస్తే ఆ ప్రాంతం రూపురేఖలు ఎలా మారుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.
* మెట్రో రెండో దశని ప్రాధాన్య క్రమంలో విమానాశ్రయానికి విస్తరించబోతున్నారు. మరిన్ని రూట్లలోనూ రెండోదశ డీపీఆర్‌ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. పట్టాలెక్కడమే తరువాయి.
* సిటీ చుట్టూ ఉన్న జాతీయ రహదారుల విస్తరణ, ఆలయాల అభివృద్ధి, సమగ్ర రహదారుల అభివృద్ధి పథకంలో పలు ప్రాజెక్ట్‌లు వేర్వేరు ప్రాంతాల్లో రాబోతున్నాయి.
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిటీ బయట లాజిస్టిక్‌ హబ్‌లు, రైల్వే టెర్మినల్స్‌ ఏర్పాటు ఆలోచనలు ఉన్నాయి. వీటికోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
* సిటీ బయట ప్రైవేటు కంపెనీలు డాటా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాయి. అన్నివైపులా ఐటీ పార్క్‌లకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని