హెచ్‌ఎండీఏ లేఅవుట్లపై ఆసక్తి

ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఎప్పుడు లేఅవుట్లు వేసినా...అవి హాట్‌కేకుల్లా అమ్ముడు పోతుంటాయి. పెట్టిన ప్రతి పైసాకు రాబడి అదే

Updated : 26 Feb 2022 05:00 IST

తొర్రూర్‌ ప్రీబిడ్‌ సమావేశానికి జనం తాకిడి

బహదూర్‌పల్లి ప్లాట్ల వేలానికీ స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఎప్పుడు లేఅవుట్లు వేసినా...అవి హాట్‌కేకుల్లా అమ్ముడు పోతుంటాయి. పెట్టిన ప్రతి పైసాకు రాబడి అదే స్థాయిలో ఉంటుంది. గతంలో వేసిన వెంచర్లు ఇందుకు ఉదాహరణ. ఇటీవల కోకోపేటలో హెచ్‌ఎండీఏ భూముల అమ్మకానికి ఏ స్థాయిలో స్పందన వచ్చిందో తెలిసిందే. వీటి అమ్మకం ద్వారా రూ.వందల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. గతంలో ఉప్పల్‌ భగాయత్‌లో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లకు వేలం వేసినా అదే స్థాయిలో స్పందన వచ్చింది. జనం ఎగబడి మరీ వీటిని కొనుగోలు చేశారు. తాజాగా నగరానికి సమీపంలోని తొర్రూర్‌, బహదూర్‌పల్లి లేఅవుట్లలో ప్లాట్లు వేలం వేసేందుకు ఇప్పటికే హెచ్‌ఎండీఏ సమాయత్తమవుతోంది. మార్చి రెండు, మూడో వారంలో ఈ-వేలం ద్వారా అమ్మకాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా ఈ రెండు చోట్ల ఏర్పాటు చేసిన ప్రీబిడ్‌ సమావేశానికి జనం నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా శనివారం తొర్రూర్‌లో ఏర్పాటు చేసిన ప్రీబిడ్‌ సమావేశానికి దాదాపు 300 మంది హాజరయ్యారు. వారి సందేహలను హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఇతర అధికారులు నివృత్తి చేశారు. ముఖ్యంగా ఒకే చోట 1000 ప్లాట్లతో రూపుదిద్దుకుంటున్న తొర్రూర్‌ లేఅవుట్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. 117 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో దీనిని హెచ్‌ఎండీఏ సిద్ధం చేస్తోంది. ఈ లేఅవుట్‌ను బహుళ వినియోగ జోన్‌ కింద ప్రకటించారు. నివాసంతోపాటు వాణిజ్య సముదాయాలు నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఇక్కడ తొలి విడతలో 30 ఎకరాల్లో 223 ప్లాట్లను అభివృద్ధి చేసింది. బహదూర్‌పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో 101 ప్లాట్లను సిద్ధం చేశారు. ఆన్‌లైన్‌లో వేలంలో పాల్గొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రెండు లేఅవుట్లల్లో అంతర్గత రహదారులు, పుట్‌పాత్‌లు, పచ్చదనం, విద్యుత్తు సబ్‌స్టేషన్లు, విద్యుత్తు లైన్లు, వీధి దీపాలు, మురుగు పారుదల వ్యవస్థ, తాగునీటి సదుపాయాలను వచ్చే రెండేళ్లలో హెచ్‌ఎండీఏ పూర్తి చేస్తుందని చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి తెలిపారు. హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో ప్లాట్లను దక్కించుకున్న వారికి రుణాలు మంజూరు చేసేందుకు వీలుగా ఓవర్‌సీస్‌ బ్యాంకు(ఐవోబీ), కోటక్‌ మహేంద్ర బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ప్రీబిడ్‌ సమావేశంలో పాల్గొన్న ప్రజలకు బ్యాంకు అధికారులు రుణ సదుపాయంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ కార్యదర్శి చంద్రయ, ఓఎస్డీ రాంకిషన్‌, చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి గంగాధర్‌, ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, హెచ్‌ఎండీఏ ఎస్‌ఈ పరంజ్యోతి, ఈఈ అప్పాపావు తదితరులు హాజరయ్యారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని