Updated : 05 Mar 2022 06:44 IST

కొనాలన్నా.. కట్టాలన్నా ఇల్లాలే

ఈనాడు, హైదరాబాద్‌: సొంతింటి కల సాకారంలో ఇల్లాలి చొరవ కీలకం. స్థలం కొనుగోలు మొదలు ఇల్లు కట్టుకోవడం, కట్టిన ఫ్లాట్‌ కొనుగోలు వరకు నిర్ణయాలు ఇంటి పెద్దవే అయినా వాటి వెనకుండి నడిపించేది ఇల్లాలే.  అద్దె ఇంట్లో, ఉమ్మడి కుటుంబంలో కంటే తమ సొంత ఇంట్లో ఉండాలని ఆమె బలంగా కోరుకుంటోంది. కుటుంబ నిర్మాణంలో మాత్రమే కాదు గృహ నిర్మాణంలోనూ గృహిణే ఆధారం. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు.. నిర్మాణదారులు మాత్రం ఇంటికి రూపం ఇల్లాలే అంటున్నారు.

నగరంలో కట్టిన ఇల్లు కొనేవారితో పాటు సొంతంగా కట్టుకునేవారూ అధికంగానే ఉంటారు.  పూర్తిగా వారే దగ్గరుండి కొందరు కట్టించుకుంటుంటే.. మరికొందరు నమ్మకస్తుడైన గుత్తేదారుకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో స్థలం ఎంపిక దగ్గర్నుంచి ఇంటి నిర్మాణ సామగ్రి వరకు ఒకదాని వెంట ఒకటి ఎంపిక చేసుకుంటూ వెళ్లాలి. వీటి గురించి ఇంటి పెద్దలు తమ భాగస్వాములకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదట ఒంటరిగా వెళ్లి స్థిరాస్తిని చూసినా.. ఆమె ఆమోదంతోనే కొనుగోలు వరకు వెళుతున్నారు. వంటిల్లు, పిల్లల గదులు ఎలా ఉండాలి? ఇంటీరియర్‌ వరకు వారి అభిరుచులకు పెద్దపీట వేస్తున్నారు. వారి అవసరాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.

వీటిలోనే కొనమంటారు

స్థిరాస్తుల ఎంపికలో అన్నీ సక్రమంగా ఉన్నవాటినే కొనుగోలు చేయమని..అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోవద్దని ఇల్లాలు పదే పదే సూచిస్తుంది. అదే వారి స్థిరాస్తికి శ్రీరామరక్ష.

* స్థలాల కొనుగోలులో అనుమతులున్న లేఅవుట్లలో ఎంపికకే మొగ్గు చూపిస్తుంది.  
* ఇతర్రతా స్థలాలు కొనుగోలు చేస్తుంటే అక్కడ ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నారో లేదో వాకబు చేయాలని సూచిస్తుంది.
* ఇంటి నిర్మాణానికి ఉపయోగించే సామగ్రి ఎంపిక ఇతరులకు వదిలేయకుండా స్వయంగా దగ్గరుండి చూసుకోవడం మేలు అని పదేపదే చెబుతుంది. దీంతో ఖర్చు తగ్గుతుంది అనేది ఆమె ఆలోచన.
* నిర్మాణ సామగ్రిలో చాలావరకు స్థిరమైన ధరలు ఉండవు. ఎంత బేరమాడ గలిగితే అంత ప్రయోజనం. ఆ మేరకు ఇంటి నిర్మాణ వ్యయం  అయితే మరో వస్తువు కొనవచ్చు అనేది ఇల్లాలి అభిప్రాయం.
* నాణ్యత లేని పరికరాల ధర తగ్గించినా కొనుగోలు చేయవద్దు అనేది ఆమె సూచన.


ప్రతి పైసా ఇంటికోసమే..

ఉద్యోగం చేసే మహిళలైనా.. ఇంటి పట్టున ఉండే గృహిణి అయినా కలల గృహం కట్టుకునేందుకు, కొనుక్కునేందుకు దాచుకున్న ప్రతి పైసా, మురిపెంగా దాచుకున్న ఆభరణాలను ఇచ్చేందుకు వెనకాడరు. సిటీలో ఇల్లు కట్టాలంటే వచ్చే ఆదాయం దుబారా చేయకుండా పొదుపు చేస్తేనే సాధ్యం అవుతుంది. ఈ విషయంలో ఇల్లాలి తోడ్పాటు చాలా ఉంటుందని ఇటీవల సొంతింటి కల నెరవేర్చుకున్న రాము అన్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని