ప్రభుత్వం, ప్రైవేటు పోటాపోటీ!

స్థిరాస్తి సంస్థలు కొత్త పోటీని ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నాయి. లేఅవుట్లలో ఇప్పటివరకు ప్రైవేటు సంస్థలదే ఆధిపత్యం. ఒక సంస్థతో మరోటి పోటీ పడి వెంచర్లు వేసేవి. ఇప్పుడివి ప్రభుత్వ సంస్థ హెచ్‌ఎండీఏతో పోటీపడుతున్నాయి.

Updated : 12 Mar 2022 06:06 IST

ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి సంస్థలు కొత్త పోటీని ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నాయి. లేఅవుట్లలో ఇప్పటివరకు ప్రైవేటు సంస్థలదే ఆధిపత్యం. ఒక సంస్థతో మరోటి పోటీ పడి వెంచర్లు వేసేవి. ఇప్పుడివి ప్రభుత్వ సంస్థ హెచ్‌ఎండీఏతో పోటీపడుతున్నాయి. ఇంతకాలం అనుమతులు ఇచ్చే సంస్థగా చూస్తున్న హెచ్‌ఎండీఏను ఇప్పుడు పోటీదారుగా చూస్తున్నాయి. సహజంగానే హెచ్‌ఎండీఏ వెంచర్లలోని స్థలాలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. భూముల వివాదాలు ఉండవని.. క్లియర్‌ టైటిల్‌ ఉంటుందనేది కొనుగోలుదారుల భావన. అందుకే వీటిని వేలం వేయగానే హాట్‌కేకుల్లా కొనుగోలు చేస్తుంటారు. హెచ్‌ఎండీఏతో పోటీని తట్టుకుని మార్కెట్లో నిలబడేందుకు విభిన్న థీమ్‌లతో ప్రైవేటు సంస్థలు మార్కెట్లోకి వస్తున్నాయి. మరికొన్ని సంస్థలైతే ఎక్కడ హెచ్‌ఎండీఏ వెంచర్‌ వేస్తే అక్కడ కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థ వెంచర్‌తో ఆ ప్రాంతానికి గుర్తింపు పెరగడంతో తమ ప్రాజెక్టులోని స్థలాలకు డిమాండ్‌ ఉంటుందనేది డెవలపర్ల ఎత్తుగడ.

స్థిరాస్తి మార్కెట్‌లో సానుకూలత కనిపిస్తుండటంతో హెచ్‌ఎండీఏ భారీ ఎత్తున ల్యాండ్‌ పూలింగ్‌కు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో ఇప్పటికే భూసమీకరణకు సంబంధించిన భూములను గుర్తించింది. తొర్రూర్‌లో 117 ఎకరాల్లో 223 ప్లాట్లు, బహదూర్‌పల్లిలో 40 ఎకరాల్లో 101 ప్లాట్లను విక్రయించనుంది. ఇందుకోసం నిర్వహించిన ప్రీబిడ్డింగ్‌ వేలానికి కొనుగోలుదారుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ నెల 14 నుంచి వీటిని ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు. ప్రభుత్వ భూములకు కొరత ఉన్నందున వ్యవసాయేతర భూములను రైతులనుంచి సమీకరించి లేఅవుట్లు అభివృద్ధి చేస్తున్నారు. ల్యాండ్‌పూలింగ్‌ పద్ధతిలో వీటిని చేపడుతున్నారు. ప్రైవేటు సంస్థలు రైతుల నుంచి కొనుగోలు చేసి ఎక్కువగా వెంచర్లు వేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో డెవలప్‌మెంట్‌కు తీసుకుని ప్రాజెక్టులను చేస్తుంటారు. హెచ్‌ఎండీఏ భూములు తీసుకుని అభివృద్ధి చేసిన స్థలాలను ఇస్తుండటంతో సహజంగానే రైతులు వీరివైపు మొగ్గుతున్నారు. దీంతో ప్రైవేటు సంస్థలకు భూముల కొనుగోలు క్లిష్టంగా మారింది. ఇదివరకు చౌకలో కొనేవారు. ఇప్పుడు  ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇరు సంస్థలు భూముల కోసం అవుటర్‌ రింగ్‌ రోడ్డు దాటిన తర్వాత భవిష్యత్తులో నిర్మాణం కానున్న రీజనల్‌ రింగురోడ్డు మధ్యలో లేఅవుట్లు ఉండేలా పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి. భారీ ఆదాయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.

వేలంతో ధరలకు రెక్కలు

హెచ్‌ఎండీఏ వేలంలో స్థలాలను విక్రయిస్తుండటంతో ఇది ధరల పెరుగుదలకు కారణం అవుతోందని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు అంటున్నాయి. వేలంలో అధిక ధరకు అమ్మిన స్థలం ధరే ఆ ప్రాంతంలో స్థిరపడి పోతుంది. అంతకు తక్కువ ఎవరూ భూములు అమ్మడానికి సిద్ధపడటం లేదు. ఈ పరిణామం రైతులకు మేలు చేస్తున్నా.. స్థలాలు కొనేవారికి ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ‘ప్రభుత్వం సైతం రియల్‌ ఎస్టేట్‌ చేస్తుంది. ఆదాయం కోసం హెచ్‌ఎండీఏ  లేఅవుట్లు వేసి స్థలాలను విక్రయిస్తుంది. కచ్చితంగా ఇది మాకు పోటీనే’ అని స్థిరాస్తి సంఘాల ప్రతినిధి ఒకరు ‘ఈనాడు’తో అన్నారు.

నగరం చుట్టుపక్కలే ఎక్కువ

కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కొత్త లేఅవుట్ల అనుమతుల కోసం స్థిరాస్తి సంస్థలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ చుట్టూ వందల సంఖ్యలో కొత్త కొత్త లేఅవుట్లు వస్తున్నాయి. పది ఎకరాలు ఆపైన లేఅవుట్ల కోసం నెలకు 120-150 వరకు దరఖాస్తులు వస్తున్నాయి.  

* నగరంలో ఆస్తి కొనాలంటే ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతోంది. అదే శివార్లలో అనుకున్న బడ్జెట్‌లో ఆస్తి లభిస్తుండటంతో చాలామంది అటువైపు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడి పరంగానూ శివార్లలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుండటం మరో సానుకూల అంశం.

* హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌, సంగారెడ్డి, సిద్ధిపేట్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల వరకు దాదాపు 7200 చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్‌ఎండీఏ విస్తరించి ఉంది. నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర అవుటర్‌ రింగ్‌రోడ్డు విస్తరించి ఉంది. దీనికి నగరం నుంచి అనుసంధానం కోసం ప్రభుత్వం రేడియల్‌, లింకు, గ్రిడ్‌ రోడ్లు నిర్మిస్తోంది. హైదరాబాద్‌ చుట్టు పక్కల స్థిరాస్తి మార్కెట్‌ వేగంగా విస్తరించడానికి ఇది కూడా దోహదం చేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని