Published : 26 Mar 2022 01:06 IST

పనికి.. వెలుగుకు లేదు విరామం

అలుపు లేకుండా ఆకాశానికి కార్మికుల నిచ్చెనలు

నగరంలో రాత్రింబవళ్లు నిర్మాణ పనులు

నగరంలో ఆకాశహర్మ్యాల భవంతులు పెద్ద ఎత్తున నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో రాత్రిపగలు తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి. కొవిడ్‌తో, కూలీల కొరతతో గత రెండేళ్లలో పనులు ఆలస్యం కావడంతో మూడు షిఫ్టుల్లో పనిచేస్తే తప్ప గడువులోపు నిర్మాణాలు పూర్తి చేయడం కష్టం. దీంతో అందివచ్చిన సాంకేతికతతో విద్యుత్తు వెలుగుల నడుమ రాత్రిపూట చకచకా పూర్తి చేస్తున్నారు. వేసవి రావడంతో రాత్రిపూట పనులను ముమ్మురం చేశారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని నిర్మాణాలకు, క్రేన్లకు విద్యుత్తు దీపాలు అమర్చడంతో ఆయా ప్రాంతాలు దూరం నుంచి చూసేవారికి సరికొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌ 

ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల రాకతో నగరంలో పగలు మాదిరే రాత్రిపూట ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు.  ఇదివరకు వీరంతా కార్యాలయాల్లో విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం ఎక్కువ మంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ఐటీ కారిడార్‌కు వెళితే 24 గంటలు నిర్విరామంగా పనిచేసే కార్యాలయాలు కనిపిస్తుంటాయి. రాత్రిపూట ఆయా కార్యాలయాల్లో వెలుగులు చూస్తేనే అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో అర్థం అవుతుంది. నిజానికి కార్యాలయం లోపలికి వెళితే పగలు, రాత్రికి పెద్ద తేడా తెలియదు. ఇదే పద్ధతిలో ప్రస్తుతం నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారు. పెద్ద భవంతుల పనుల్లో ఒక్కో షిప్టులో వెయ్యి మంది వరకు విధుల్లో ఉన్న సంస్థలు ఉన్నాయి.

ఆకాశహర్మ్యాల్లోనే అధికంగా..

ప్రస్తుతం సిటీలో పాతిక అంతస్తులపైన భవనాలు భారీ సంఖ్యలో నిర్మాణంలో ఉన్నాయి. గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేట, కొండాపూర్‌, గండిపేట, తెల్లాపూర్‌, బాచుపల్లి, కూకట్‌పల్లి, పంజాగుట్ట వరకు వేర్వేరు దశల్లో పలు భవనాల పనులు జరుగుతున్నాయి. వీటిని పూర్తి చేయాలంటే మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది. కొవిడ్‌ వంటి ఆటంకాలు ఎదురైతే మరింత జాప్యం అయ్యే సూచనలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని వేగంగా పూర్తి చేసేందుకు ఉన్న అవకాశాలను నిర్మాణదారులు ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఎత్తైన భవనాలన్నింటిలోనూ మేవాన్‌ సాంకేతికత వినియోగిస్తున్నారు. ఇందులో గోడలను సైతం కాంక్రీట్‌తోనే కడుతుండటంతో ఈ పనులు సైతం రాత్రిపూట నడుస్తున్నాయి. భారీ భవంతులు నిర్మించే చోటనే బ్యాచింగ్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రాత్రింబవళ్లు కార్మికులు విధుల్లో ఉంటున్నారు. టవర్‌ క్రేన్లకు అమర్చిన విద్యుత్తు దీపాల వెలుగుల్లో  పనులు చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా, చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన తర్వాతే పనులు చేయిస్తున్నామని నిర్మాణదారులు అంటున్నారు.

త్వరగా పూర్తిచేసేందుకు..

ఏడు అంతస్తుల్లో నిర్మిస్తున్న సచివాలయ పనులను వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వం గడువు నిర్దేశించింది. దీంతో ఇక్కడ రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయి. పంజాగుట్టలో మరో ఎత్తైన భవనం పనులు వేగంగా జరుగుతున్నాయి. గచ్చిబౌలిలో పలు కార్యాలయాల భవనాల్లో 24 గంటలూ పనులు చేస్తున్నారు. మూడు షిఫ్టుల్లో పనిచేస్తే కాని వీటిని త్వరగా పూర్తిచేయలేరు. దీంతో పగలు మాదిరి వెలుగు ఉండేలా విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేసి గోడలు, విద్యుత్తు పనులన్నీ చేస్తున్నారు. ఇటీవల ప్రీ కాస్టింగ్‌ నిర్మాణాల సంఖ్య పెరిగింది. నెలల గడువు లోపలే పూర్తి చేసేందుకు రాత్రి సైతం కృషి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులే ఎక్కువగా రాత్రి విధుల్లో ఉంటున్నారు.


నగరంలో చేస్తున్నారు

- సీహెచ్‌.రాంచంద్రారెడ్డి, ఛైర్మన్‌, తెలంగాణ క్రెడాయ్‌

రాత్రి 10 గంటల తర్వాతనే సామగ్రి తరలించే వాహనాలకు నగరంలోకి అనుమతి ఉంటుంది. కాబట్టి సిటీలో భారీ భవంతుల్లో రాత్రిపూట పనులు జరుగుతుంటాయి. స్లాబ్‌ మొదలు.. ఇటీవల గోడలు, ఎలక్ట్రిక్‌ పనుల వరకు చేస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో పగటిపూట వేడిలో ఎక్కువ గంటలు పనిచేయలేరు. అందుకే ఎక్కువగా రాత్రిపూట జరుగుతుంటాయి. జనావాసాలకు దూరంగా నిర్మాణాలు ఉంటే ఫర్వాలేదు. లేకపోతే స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తాయి. కాబట్టి రాత్రి పది తర్వాత పనికి ముందస్తు అనుమతి తీసుకుని చేస్తుంటారు. సాధారణంగా మూడేళ్లలో పనిని రెండేళ్లలో పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు, ప్రాజెక్టు  పనులు ఆలస్యంగా నడుస్తున్నప్పుడు రాత్రి పనులకు మొగ్గు చూపుతుంటారు. ఇతర నగరాలతో పోల్చితే ఇప్పటికీ మన దగ్గర రాత్రిపూట నిర్మాణ పనులు తక్కువే.Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని