Updated : 23 Apr 2022 05:55 IST

33 ప్రాజెక్టులు.. 3.8 కోట్ల చదరపు అడుగులు

ధరిత్రీ దినోత్సవం సందర్భంగా హరిత నిర్మాణాలు చేపట్టేందుకు ఐజీబీసీలో నమోదు

ఈనాడు, హైదరాబాద్‌

సంప్రదాయ భవనాలతో నీరు, విద్యుత్తు వాడకం అధికంగా ఉంటోంది. నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున సామగ్రి వృథా అవుతోంది. గృహాలు, కార్యాలయాలు, రహదారుల నిర్మాణ సమయంలో చెట్లు కొట్టేయాల్సి వస్తోంది. ఇవన్నీ పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుత తరం సహజ వనరులను మూడునాలుగు రెట్లు అధికంగా వినియోగిస్తోంది. కర్బన ఉద్గారాలు పెరిగి, భూతాపంతో వాతావరణ మార్పులకు దారితీసి ధరిత్రికి పెను భారంగా మారుతున్నాయి. హరిత భవనాల నిర్మాణాలతో చాలా వరకు ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చు అంటున్నారు వక్తలు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా  ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని సీఐఐ గ్రీన్‌ బిజినెస్‌ కేంద్రంలో శుక్రవారం గ్రీన్‌ క్రూసేడర్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. హరిత నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకొచ్చిన 33 సంస్థల ప్రతినిధులను ఈసందర్భంగా సత్కరించారు. వీరు 3.8 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలను పర్యావరణహితంగా చేపట్టేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విశిష్ఠ అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఎన్‌హెచ్‌, సీఆర్‌ఎఫ్‌, బిల్డింగ్స్‌) ఐ.గణపతిరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ కొత్త సచివాలయం, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌,  జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయాలను హరిత భవనాలుగా చేపట్టి ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఐజీబీసీ సర్టిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసినా.. ఇప్పటికీ ఇంకా అందలేదని త్వరగా ఇవ్వాలని ఐజీబీసీని కోరారు. లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని చెప్పారు. రెరా కార్యదర్శి, డీటీసీపీ డైరెక్టర్‌ కె.విద్యాధర్‌ మాట్లాడుతూ.. హరిత భవనాలతో నీరు, విద్యుత్తు 30 శాతం ఆదా అవుతుందని చెప్పారు. రెరా, ఇతర నిబంధనల్లో ఐజీబీసీని చేర్చడానికి వేర్వేరు రాష్ట్రాల్లోని విధానాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. నిర్మాణాల సమయంలో సిమెంట్‌, స్టీల్‌, ఇతర నిర్మాణ సామగ్రి పెద్ద ఎత్తున వృథా అవుతోందని న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ బిక్షపతి అన్నారు. ఇక్కడ సొమ్ములు వృథా కావడం కాదని.. విద్యుత్తు వంటి వనరులు వృథా అవుతున్నాయని గుర్తించాలన్నారు. పదేళ్లుగా హరిత ప్రాజెక్టుల పోకడ మొదలైందన్నారు. సమావేశంలో క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్‌రెడ్డి, సీఐఐ-ఐజీబీసీ ప్రిన్స్‌పల్‌ కౌన్సిలర్‌ ఎం.ఆనంద్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.ఎస్‌.వెంకటగిరి పాల్గొన్నారు.


వాటికి రెరాలో సత్వరం అనుమతివ్వాలి 

 సి.శేఖర్‌రెడ్డి, ఛైర్మన్‌, హైదరాబాద్‌ ఛాప్టర్‌, ఐజీబీసీ

ఐజీబీసీ రేటింగ్‌ కలిగిన హరిత నిర్మాణ ప్రాజెక్టులకు రెరాలో సత్వరం అనుమతి జారీ చేసేలా ప్రోత్సాహకాలను అందించాలి. ఒక్కరోజులోనే అనుమతి ఇచ్చేలా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. జీహెచ్‌ఎంసీ, డీటీసీపీలోనూ ప్రోత్సాహం ఉంటే మరింత ఎక్కువ మంది డెవలపర్లు హరిత నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకొస్తారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ రెరా ప్రాజెక్టులకు ఫాస్ట్‌ట్రాక్‌లో అనుమతులు ఇస్తోంది. రాష్ట్రంలోనూ పరిశీలించాలి. ఎక్కువ సంఖ్యలో హరిత ప్రాజెక్టులను చేపట్టేందుకు క్రెడాయ్‌ వంటి స్థిరాస్తి సంఘాలు చొరవ చూపాలి. ప్రణాళిక దశలోనే ఐజీబీసీకి దరఖాస్తు చేసుకుంటే అదనపు వ్యయమేమీ ఉండదు. కొంత అదనపు ఖర్చుతో సిల్వర్‌ రేటింగ్‌ పొందవచ్చు.  పర్యావరణహితమైన మూడువేల పైగా గ్రీన్‌ప్రొ ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పెద్ద సంఖ్యలో నిర్మాణదారులు ముందుకొస్తే సంప్రదాయ సామగ్రి కంటే హరిత ఉత్పత్తులతోనే ఖర్చు తగ్గుతుంది. పర్యావరణహిత ఉత్పత్తులతో ధరిత్రిని కాపాడినవారం అవుతాం.


ఆరోగ్యంగా ఉండేందుకు..  

ఎం.విజయసాయి, ఛైర్మన్‌, అమరావతి ఛాప్టర్‌, ఐజీబీసీ

పాత రోజుల్లో ఇళ్లలో వెంటిలేటర్లు ఉండేవి. ఇంట్లోని వేడిగాలి బయటికి వెళ్లేది. ఏసీల రాకతో వెంటిలేటర్లు లేకుండాపోయాయి.  పూర్వ రోజుల్లో మన ఇళ్లన్నీ హరిత భవనాలుగానే ఉండేవి. మధ్యలో వాటిని విస్మరించాం.  మన ఆరోగ్యం, ధరిత్రిని కాపాడుకునేందుకు హరిత భవనాల వైపు మొగ్గాల్సిన అవసరం ఉంది. వాణిజ్య భవనాలు పెద్ద ఎత్తున గ్రీన్‌ ప్రాజెక్టులుగా చేపడుతున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం మనం రెండో స్థానంలో ఉన్నాం.  త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటాం. ఐజీబీసీకి సంబంధించి ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉంది. స్థానిక నిర్మాణదారులు, కొనుగోలుదారులు అవగాహన పెంపొందించుకునేందుకు  చేరువలోనే సేవలు అందుబాటులో ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి.


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని