విశ్వనగరానికి బృహత్‌ ప్రణాళిక

అంతర్జాతీయ నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్‌ మహానగర ప్రణాళికాయుత అభివృద్ధికి 18 నెలల్లో కొత్త మాస్టర్‌ప్లాన్‌ తీసుకురానున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అంతర్జాతీయ కన్సల్టెంట్లతో ప్రణాళిక రూపకల్పనకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

Published : 30 Apr 2022 02:09 IST

అంతర్జాతీయ కన్సల్టెంట్లతో 18 నెలల్లో రూపకల్పన

141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 2023  మార్చి నాటికి

క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

బిల్డర్లు స్వీయ నియంత్రణ పాటించకపోతే ఆంక్షలు తప్పవు

ఈనాడు, హైదరాబాద్‌

అంతర్జాతీయ నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్‌ మహానగర ప్రణాళికాయుత అభివృద్ధికి 18 నెలల్లో కొత్త మాస్టర్‌ప్లాన్‌ తీసుకురానున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అంతర్జాతీయ కన్సల్టెంట్లతో ప్రణాళిక రూపకల్పనకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. క్రెడాయ్‌ హైదరాబాద్‌ 11వ ప్రాపర్టీ షోని శుక్రవారం హైటెక్స్‌లో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో ఉన్న ఐదు మాస్టర్‌ ప్లాన్లను ఏకీకృతం చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. వాటిలో తప్పులు దొర్లాయని.. ఈసారి అలాంటి వాటికి అవకాశం లేకుండా భాగస్వాములతో సంప్రదింపులు జరిపి రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. జీవో 111 తొలగించడంతో ఆ ప్రాంతాన్ని మాస్టర్‌ప్లాన్‌లో భాగం చేయనున్నట్లు చెప్పారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌ పర్యావరణహితంగా ఉంటుందన్నారు.  తెలంగాణ అంటే హైదరాబాద్‌ మాత్రమే కాదని.. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోనూ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మాస్టర్‌ప్లాన్లను తీసుకొస్తున్నట్లు చెప్పారు.

జీవో ఎత్తివేతపై..
జీవో 111 ఎత్తివేతపై విమర్శలు చేస్తున్నవారు అసలు ఆ జీవో ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 1996లో హైదరాబాద్‌ నగరానికి 27 శాతం నీటిని జంట జలాశయాల నుంచి సరఫరా చేసేవారని.. గోదావరి, కృష్ణా జలాల తరలింపుతో ఇప్పుడు వీటిపై ఆధారపడటం లేదన్నారు. అదే సమయంలో జంట జలాశయాలు మరో ట్యాంక్‌బండ్‌ కాకుండా చర్యలు ఉంటాయని, ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. నిర్మాణ సంఘాల ప్రతినిధులు లిఖిత పూర్వకంగా తమ సూచనలను అందజేయవచ్చు అన్నారు.

అలా చేస్తే ఎఫ్‌ఎస్‌ఏపై పరిమితులు
ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్న బిల్డర్లు ఎకరా విస్తీర్ణంలో 6 లక్షల నుంచి 10 లక్షల చ.అ. విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారని.. దురాశకు పోవద్దని మంత్రి కేటీఆర్‌ బిల్డర్లకు హితవు పలికారు. కట్టే ముందు ఆ మేరకు అక్కడ మౌలిక వసతులు ఉన్నాయో లేవో చూడాలని.. నగరానికి నష్టం కలిగించే పనులు చేయవద్దని..  స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. యూడీఎస్‌ పేరుతో లేనివి ఉన్నట్లు చూపి విక్రయించొద్దని కోరారు. స్వీయ నియంత్రణ పాటించేలా నిర్మాణ సంఘాలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఇష్టారీతిగా కడితే మాత్రం ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ) ఆంక్షలు విధించాల్సి వస్తుందని చెప్పారు. చిన్న బిల్డర్లు నష్టపోకూడదనే ఆంక్షలు విధించడం లేదని గుర్తు చేశారు. స్టీలు, సిమెంట్‌ కంపెనీలు కుమ్మక్కై ధరలు పెంచుతున్నాయని..నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నగరం చుట్టూ విస్తరించాలి
గచ్చిబౌలి, కోకాపేట, కొల్లూరు కాకుండా ఇతర ప్రాంతాల వైపు ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ బిల్డర్లకు సూచించారు. ఒక్క ఐటీని కాకుండా ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు, జీనోమ్‌ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ల వంటివి సిటీ చుట్టుపక్కల ఏర్పాటు చేశామని అక్కడ నివాసాలు కట్టేందుకు ముందుకు రావాలన్నారు.


స్థానిక కార్మికుల కోసం శిక్షణ కేంద్రం..

నిర్మాణ రంగంలో స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించేలా నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. క్రెడాయ్‌ హైదరాబాద్‌ వంటి సంఘాలు ముందుకు రావాలని కోరారు. నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి తదితర ప్రాంతాల నుంచి కార్మికులు గల్ఫ్‌ దేశాలకు వలస పోతున్నారని.. వేరే రాష్ట్రాల కార్మికులు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పారు. నిర్మాణ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం న్యాక్‌ ఉన్నా అది ఆర్‌ అండ్‌ బీ సంస్థగా మారిందన్నారు. శిక్షణ అనంతరం  ఉపాధి లభిస్తుందనే భరోసా ఉంటేనే కార్మికులు సైతం ముందుకు వస్తారని ఆ దిశగా  ఆలోచించాలని నిర్మాణ సంఘాలను మంత్రి కేటీఆర్‌ కోరారు. ధరణిలో సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని చెప్పారు.


నేడు, రేపు ప్రదర్శన

హైటెక్స్‌లో శుక్రవారం మొదలైన ప్రాపర్టీ షో శని, ఆదివారాల్లోనూ ఉంటుంది. రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులనే ప్రదర్శనకు పెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా యాప్‌ను ఆవిష్కరించారు. 15వేల ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాల్లో తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు అని తెలిపారు. సిటీలో ప్రముఖ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టుల్లోని 70 శాతం గృహాలను ప్రాపర్టీ షోలో ప్రదర్శిస్తున్నారని.. కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశమని క్రెడాయ్‌ తెలంగాణ ఛైర్మన్‌ సి.హెచ్‌.రాంచంద్రారెడ్డి అన్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని