Updated : 14 May 2022 04:29 IST

వడివడిగా వనస్థలిపురం వైపు

ఈనాడు, హైదరాబాద్‌

మెట్రోతో మెరుగైన ప్రజారవాణా.. ఒకవైపు విజయవాడ జాతీయ రహదారి.. మరోవైపు సాగర్‌ హైవే.. ఓఆర్‌ఆర్‌తో ప్రధాన రహదారులతో అనుసంధానం..ఫ్లైఓవర్లు, అండర్‌పాసులతో తొలగిన ట్రాఫిక్‌ ఇక్కట్లు.. చేరువలో మల్టీఫ్లెక్స్‌లు, షాపింగ్‌ మాల్స్‌... అన్నింటికీ మించి బడ్జెట్‌ ధరల్లో వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌, గేటెడ్‌ కమ్యూనిటీలో విల్లాలు లభిస్తుండటంతో తూర్పు హైదరాబాద్‌ను అందుబాటు ధరల స్థిరాస్తి మార్కెట్‌గా భావిస్తున్నారు. నివాసయోగ్యమైన ప్రాంతంగా స్థిరాస్తులను కొనుగోలు చేస్తున్నారు.

హైదరాబాద్‌ తూర్పులో ప్రధానంగా ఎల్బీనగర్‌ కేంద్రంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విజయవాడ, సాగర్‌ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు  సామాన్య, మధ్యతరగతి వాసులకు సొంతింటి కల నెరవేర్చుకునే ప్రాంతాలుగా మారాయి. ఒకప్పుడు గ్రామాలుగా, ఎవరూ పెద్దగా ఆసక్తి చూపని ఈ ప్రాంతాల్లో..  రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనతో నివాసకేంద్రాలుగా, చిరునామాగా మారుతున్నాయి. డిమాండ్‌ పెరగడంతో కొవిడ్‌ తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్ల నిర్మాణం మొదలైంది. ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, కర్మన్‌ఘాట్‌, బీఎన్‌రెడ్డి ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు కడుతున్నారు. ప్రధాన రహదారికి చేరువలో ఎక్కువగా అపార్ట్‌మెంట్లు వస్తున్నాయి. హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట, తుర్కయంజాల్‌, సాహెబ్‌నగర్‌, బ్రాహ్మణపల్లి ప్రాంతాల్లో వ్యక్తిగత గృహాలు విల్లాలు వస్తున్నాయి.'

గేటెడ్‌ వైపు మొగ్గు

ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలు చాలా తక్కువ. చెప్పుకోతగ్గ ప్రాజెక్టులు బండ్లగూడ, వనస్థలిపురంలో రెండు ఉండేవి. ఇప్పుడు వీటికి డిమాండ్‌ పెరగడంతో పెద్ద ప్రాజెక్టులు, పేరున్న సంస్థలన్నీ గేటెడ్‌ కమ్యూనిటీ ఆవాసాలనే నిర్మిస్తున్నాయి. కొందరు అపార్ట్‌మెంట్లు కడుతుంటే.. మరికొందరు విల్లాల ప్రాజెక్టులు చేపడుతున్నారు.  చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తున్నవారు అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహాల వైపు మొగ్గుచూపుతుంటే.. సిటీలో చాలాకాలంగా ఉంటూ.. ఇప్పటికే ఇళ్లు ఉన్నవారు.. మారిన జీవనశైలికి తగ్గట్టుగా కొత్త ఇళ్ల కోసం చూస్తున్నారు. వైద్యులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు సైతం వాటినే కోరుకుంటున్నారు. ‘అపార్ట్‌మెంట్ల మార్కెట్‌ ప్రస్తుతం నెమ్మదించినా.. విల్లాల్లో విక్రయాలు బాగున్నాయి. ఇప్పటికీ నెలకు 30 నుంచి 45 విల్లా యూనిట్లు విక్రయిస్తున్నాం’ అని ఏపీఆర్‌ గ్రూప్‌ ఎం.డి. ఆవుల కృష్ణారెడ్డి అన్నారు.

అనుకూలతలు

పేరున్న పాఠశాలలు  ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుకునే విధంగా విశాలమైన ప్రాంగణాల్లో విద్యాసంస్థలు నడిపిస్తున్నారు. ఇంటర్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలు చేరువలోనే ఉన్నాయి.

సమీపంలో రామోజీ ఫిల్మ్‌సిటీ, వండర్‌లా వంటి వినోద, విహార, పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి   అరగంటలో విమానాశ్రయం చేరుకోవచ్చు.

ఉపాధి కేంద్రాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.. టీసీఎస్‌ అతిపెద్ద క్యాంపస్‌ ఆదిభట్లలో ఉంది. చేరువలోనే రంగారెడ్డి కొత్త కలెక్టరేట్‌ ప్రారంభం కాబోతుంది. ఏరో సెజ్‌లో కొత్త పరిశ్రమలు మరిన్ని వస్తున్నాయి.

విజయవాడ, సాగర్‌ జాతీయ రహదారి కావడంతో రవాణాపరంగా ఏ సమయంలోనైనా గమ్యస్థానం చేరుకోవచ్చు అన్న భరోసా ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందాయి.

జాతీయ రహదారులను కలుపుతూ ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, అవుటర్‌ రింగ్‌రోడ్డు అనుసంధానం మెరుగ్గా ఉండటంతో ఈ ప్రాంతం వేగంగా వృద్ధి చెందుతోంది.

ఎల్‌బీనగర్‌ వరకు మెట్రోరైలు సదుపాయం ఉండటంతో సిటీలోని ఏ ప్రాంతానికైనా వేగంగా చేరుకునే సౌలభ్యం ఏర్పడింది. హైటెక్‌ సిటీ, మియాపూర్‌ వరకు ఎక్కడికైనా మెట్రోలో ట్రాఫిక్‌ ఇక్కట్లు లేకుండా వెళ్లొచ్చు. దీంతో  ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ కేంద్రంగా 20 కి.మీ. వరకు స్థిరాస్తి మార్కెట్‌ విస్తరించింది.

ఎల్‌బీనగర్‌లో ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌లు పూర్తికావడంతో రహదారిపై ట్రాఫిక్‌ ఇక్కట్లు తొలగిపోయాయి. వీటన్నింటితో ప్రస్తుతం ఈ ప్రాంతం నివాసాలకు అనుకూలంగా మారింది. భవిష్యత్తు వృద్ధికి అవకాశం ఉన్న మార్గంగా నిర్మాణదారులు చెబుతున్నారు. 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని