స్థలం కొనే ముందు వాస్తు జాగ్రత్తలు

ఇల్లు వాస్తు ప్రకారం కట్టారా లేదా అని చాలామంది చూస్తుంటారు. ఉందంటేనే కొనేందుకు ముందడుగు వేస్తారు. ఇల్లే కాదు స్థలం కొనుగోలులోనూ వాస్తుకు ప్రాధాన్యం ఇస్తారు. తూర్పు దిక్కునే కావాలంటారు....

Updated : 18 Jun 2022 11:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇల్లు వాస్తు ప్రకారం కట్టారా లేదా అని చాలామంది చూస్తుంటారు. ఉందంటేనే కొనేందుకు ముందడుగు వేస్తారు. ఇల్లే కాదు స్థలం కొనుగోలులోనూ వాస్తుకు ప్రాధాన్యం ఇస్తారు. తూర్పు దిక్కునే కావాలంటారు. మిగతా దిక్కుల్లోని స్థలాల మాటేమిటి? వీటిని కొనేముందు వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు ప్రముఖ వాస్తు నిపుణులు పి.కృష్ణాదిశేషు.
ఇల్లు కట్టుకోవడానికి ముందు స్థలం వాస్తుశాస్త్రానికి అనుగుణంగా ఉండాలనేది ప్రాథమిక సూత్రం. స్థలం ఉత్తరం దిక్కుని చూస్తూ నాలుగు మూలలు నాలుగు దిక్కులకు ఉండాలి

* మూలలు తగ్గడం, పెరగడం లాంటి స్థలాలు శాస్త్రరీత్యా సరికావు.
* స్థలానికి ఎదురుగా వీధిపోటుగాని, వీధి శూలగాని ఉండకూడదు. ఇవి రెండు ఒకటేనని కొందరి అభిప్రాయం. వాస్తవానికి కానేకాదు.  
* రహదారి కొంచెం దూరం వెళ్లి ఆగిపోయి అక్కడ ఇల్లు, ఇంటి స్థలం అడ్డుగా ఉండి దారి ముందుకెళ్లలేకపోతే దాన్ని వీధిపోటు అంటారు.
* ఇంటి స్థలం ఎదురుగా వచ్చే రహదారి అక్కడితో ఆగకుండా స్థలం పక్కనుంచి అటు ఇటు వెళితే వీధి శూల అంటారు.
* తూర్పు ఆగ్నేయం, ఉత్తరవాయువ్యం, పడమర నైరుతి, దక్షిణ నైరుతి ఎదురుగా వీధిపోటు, వీధి శూల ఉండరాదు.
లోతట్టులో ఉండరాదు..
నిజానికి కొన్ని దిక్కులు మేలు చేస్తాయని చెప్పడానికి శాస్త్రీయమైన ఆధారాలు అంతగా కనిపించవు. నివాసం, స్థలం ఉన్న ప్రాంతాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ప్రతి అంశాన్ని వాస్తుతో ముడిపెట్టకుండా నేల స్వభావం, పూర్వాపరాలు, సాంకేతికత సమస్యలు తెలుసుకోవడం ద్వారా కూడా నిర్ణయం తీసుకోవచ్చు.
*ఇల్లు కట్టుకోవడానికి కొనుగోలు చేసే స్థలం లోతట్టు ప్రాంతం కాకూడదు. కాలువలు, చెరువుల దగ్గరలో ఉంటే భారీ వర్షాలతో మునక తప్పదు. ఇలాంటి ప్రాంతాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని  ఇల్లు కట్టుకున్నా.. వరద వచ్చిన ప్రతిసారీ సమస్యగానే ఉంటుంది.
* శ్మశానాలకు దగ్గర కూడా స్థలాలు జీవితంపై వైరాగ్యం, నిరాశ, నిస్పృహకు దారితీసే ప్రమాదం ఉంది.
* ప్రమాదకర పరిశ్రమలున్న ప్రాంతాల చేరువలో స్థలాల ఎంపిక సరైన నిర్ణయం కాదు. అక్కడే పీల్చేగాలి, భూమిలో చేరే నీరు కలుషితమై ఉంటుంది. అక్కడ నివాసం అనారోగ్యంతో ఆవస్థలు పడే ప్రమాదం ఉంటుంది.
* స్థలం కొనుగోలు చేసేటప్పుడు అక్కడ నీటి లభ్యత సౌకర్యం ఉందో లేదో చూసుకోవాలి. బోరు బావి ఈశాన్యంలో ఉండాలి. ఈశాన్యం పల్లంగా ఉండటం, ఆయా స్థలాల్లో నీరు కచ్చితంగా పడుతుందని విశ్వాసం. నమ్మకం కంటే శాస్త్రరీత్యా ఎక్కడ నీరు పడుతుందో పరీక్షింపజేసి బోరు వేయించుకోవాలి.
ఇంటి విషయానికి వస్తే..
* ఇంటి సింహద్వారం తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పడమర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం వాస్తురీత్యా శుభాన్నిస్తాయి.
* తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం.. ఈ నాలుగు దిక్కులలో సింహద్వారం అనుకూలమే. అయితే తూర్పుఆగ్నేయం, ఉత్తరవాయువ్యం మూలలో సింహద్వార ఏర్పాట్లు ఉండకూడదు. పడమర నైరుతి, దక్షిణ నైరుతిలోనూ సింహద్వారంతో ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లే.
* అపార్ట్‌మెంట్ల విషయానికి వస్తే సింహద్వారాలు మూలలకు, దిక్కులకు శాస్త్రరీత్యా సమ్మతమే గానీ ఒకదానికొకటి ఎదురుగా ఉండటం ఇరుకుటుంబాలకు ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారంగా వాస్తును పాటిస్తూ ఒక ఫ్లాట్‌కు మూలకు... ఎదురు ఫ్లాట్‌ దిక్కులో(మధ్యలో) సింహద్వారం ఏర్పాట్లు చేసుకోవచ్చు.
* వంటగది వ్యక్తిగత ఇళ్లలోనైనా, ఫ్లాట్లలోనైనా ఆగ్నేయ మూల, వాయువ్య మూల ఏర్పాటు మేలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని