ప్రథమార్ధంలో ఫర్వాలేదు

గృహ నిర్మాణ మార్కెట్‌తో పోలిస్తే కార్యాలయాల నిర్మాణాల జోరు ఈ ఏడాది ప్రథమార్ధంలో కనిపించింది. దేశంలోని అన్ని నగరాల కంటే అత్యధికంగా హైదరాబాద్‌లోనే కొత్త కార్యాలయ భవనాల స్థలం అందుబాటులోకి వచ్చిందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ

Updated : 13 Aug 2022 05:52 IST

కార్యాలయ భవనాల లీజింగ్‌ ఆశాజనకం 

ఈనాడు, హైదరాబాద్‌

గృహ నిర్మాణ మార్కెట్‌తో పోలిస్తే కార్యాలయాల నిర్మాణాల జోరు ఈ ఏడాది ప్రథమార్ధంలో కనిపించింది. దేశంలోని అన్ని నగరాల కంటే అత్యధికంగా హైదరాబాద్‌లోనే కొత్త కార్యాలయ భవనాల స్థలం అందుబాటులోకి వచ్చిందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ వెస్టియన్‌ తాజా నివేదికలో పేర్కొంది.

* 2022 ప్రథమార్ధం జనవరి నుంచి జూన్‌ వరకు 44 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కార్యాలయాల భవనాలు లీజింగ్‌కు తీసుకున్నారు. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 72 శాతం అధికం.

* ఎప్పటిలాగే మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ్, నానక్‌రాంగూడలో కార్యాలయాల  ఏర్పాటుకు ఎక్కువ సంస్థలు ముందుకొచ్చాయి. గ్రేడ్‌ ‘ఏ’ కార్యాలయాల్లో 90 శాతం ఇక్కడ ఉండటం కూడా ఒక కారణంగా ఉంది. ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలతో పాటూ ఇతర సంస్థలు సైతం తమ కార్యాలయాలను పశ్చిమ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఇష్టపడుతున్నాయి.

* నిర్మాణ పనులు సైతం ఊపందుకున్నాయి. తొలి ఆరునెలల్లో కొత్తగా పూర్తైన కార్యాలయాల నిర్మాణాల విస్తీర్ణం 68 లక్షల చ.అ. వరకు ఉంది. దేశంలో రియల్‌ ఎస్టేట్‌ పరంగా అగ్రగామిగా ఉన్న ఏడు నగరాల్లో కంటే అత్యధికంగా హైదరాబాద్‌లోనే నిర్మాణాలు పూర్తయ్యాయి.

* కొత్త భవనాల అందుబాటు పెరగడంతో ఈ ఏడాది ప్రథమార్థంలో కార్యాలయాల ఖాళీలు 15 శాతానికి పెరిగాయి.

* మరో 3.2 కోట్ల చ.అ. విస్తీర్ణంలో కార్యాలయాల నిర్మాణాలు ప్రణాళిక దశలో ఉన్నాయి. కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు మరికొన్నాళ్లు ఇదే తరహా డిమాండ్‌ ఉంటుందని అంచనా.

* పశ్చిమ హైదరాబాద్‌ కార్యాలయాల భవనాల నిర్మాణాలు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. కోకాపేట, పుప్పాలగూడ వైపు భవనాలు వస్తున్నాయి.

* కార్యాలయాలు నిర్మాణాలు, లీజింగ్‌ ఆశాజనకంగా ఉండటంతో గృహ నిర్మాణ మార్కెట్‌ సైతం మున్ముందు పుంజుకుంటుందని బిల్డర్లు అంచనా వేస్తున్నారు.

* ఐటీ మాత్రమే కాకుండా ఇతర రంగాలు ముఖ్యంగా లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమల ఏర్పాటుకు ఆసియాలోనే హైదరాబాద్‌ అనువైన ప్రదేశంగా ఉంది. గ్లోబల్‌ కంపెనీలకు గమ్యస్థానం కానుంది. పరిశోధనలకు ఆస్కారం ఉంది. కంపెనీల డేటా కేంద్రాల ఏర్పాటుకు అనుకూలమైన భౌతిక వాతావరణం ఉంది. విస్తృతమైన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌ మానవ వనరుల లభ్యత పుష్కలంగా ఉంది.  ఈ  రంగాల్లో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే అంతర్జాతీయ సంస్థలతో భవనాల లీజింగ్‌కు డిమాండ్‌ ఉండనుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని