నలువైపులా ఇళ్ల నిర్మాణాలు

మార్కెట్‌ స్తబ్దుగా ఉన్నా ఇళ్ల ధరల్లో పెరుగుదల మాత్రం కొనసాగుతోంది. ఏడాది కాలంలో ఇళ్ల ధరల్లో 9 శాతం పెరుగుదల ఉందని రిజిస్ట్రేషన్ల ఆధారంగా జిల్లాల వారీగా నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా విశ్లేషించింది. అయినా ఇళ్ల కొనుగోళ్లు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తోంది. ఉద్యోగ భద్రత.. పెరుగుతున్న కుటుంబ ఆదాయం.. దాచుకున్న పొదుపు సొమ్ముతో కలిపి ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నివేదికలో పేర్కొంది.

Updated : 10 Sep 2022 06:52 IST

ఈనాడు, హైదరాబాద్‌

మార్కెట్‌ స్తబ్దుగా ఉన్నా ఇళ్ల ధరల్లో పెరుగుదల మాత్రం కొనసాగుతోంది. ఏడాది కాలంలో ఇళ్ల ధరల్లో 9 శాతం పెరుగుదల ఉందని రిజిస్ట్రేషన్ల ఆధారంగా జిల్లాల వారీగా నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా విశ్లేషించింది. అయినా ఇళ్ల కొనుగోళ్లు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తోంది. ఉద్యోగ భద్రత.. పెరుగుతున్న కుటుంబ ఆదాయం.. దాచుకున్న పొదుపు సొమ్ముతో కలిపి ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నివేదికలో పేర్కొంది.

హైదరాబాద్‌ రాజధాని ప్రాంతంలోనే ఎక్కువగా ఇళ్ల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. హైదరాబాద్‌ జిల్లా, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు రాజధాని పరిధిలోకి వస్తుంటాయి. ఇక్కడ ప్రస్తుతం పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.. సగటున ఏటా 60వేల ఇళ్ల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. మార్కెట్‌ను బట్టి వీటిలో హెచ్చుతగ్గులు సహజం.

సంగారెడ్డి జిల్లాలో..
హైదరాబాద్‌ నగరం పశ్చిమం వైపు వేగంగా విస్తరిస్తోంది.  పటాన్‌చెరు, తెల్లాపూర్‌ వంటి ప్రాంతాలు సంగారెడ్డి జిల్లాలో ఉన్నా.. సిటీ పరిధిలోనే ఉన్నాయి.

* ఐటీ కారిడార్‌కు చేరువగా ఉండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. ఉండేందుకు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు, భవిష్యత్తు అవసరాల కోసం స్థలాలు కొనుగోలు చేస్తున్నారు.

* తెల్లాపూర్‌ వంటి ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాలు నిర్మాణంలో ఉన్నాయి.

* ఇళ్ల ధరలు అందుబాటులో ఉండటంతో ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు.

* నాలుగు జిల్లాల్లో చూస్తే  ఈ జిల్లాలోనే  ధరల పెరుగుదల అధికంగా ఉంది. ఏకంగా 38 శాతం పెరిగాయి.
సగటు చదరపు అడుగు ధర రూ.2988గా ఉంది.

* సిటీ ఇళ్ల రిజిస్ట్రేషన్లలో ఈ జిల్లా వాటా గత ఏడాది 6 శాతం ఉండగా.. ఏడాది కాలంలో 3 శాతానికి తగ్గింది. 

మేడ్చల్‌ జిల్లాలో...
పశ్చిమ హైదరాబాద్‌ కొంత భాగం, తూర్పు హైదరాబాద్‌ కొంత భాగం, ఉత్తర హైదరాబాద్‌ ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది.

* పశ్చిమ హైదరాబాద్‌ పరిధిలోకి వచ్చే కూకట్‌పల్లి చుట్టుపక్కల ఇప్పటికే పెద్ద ఎత్తున ఆవాసాలు వచ్చాయి.

* సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌, శామీర్‌పేట మార్గంలోని ఉత్తర హైదరాబాద్‌, తూర్పు హైదరాబాద్‌ ఉప్పల్‌ వైపు నిర్మాణాలు వస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతివాసులకు ఇక్కడ సొంతింటి ధరలు అందుబాటులో ఉన్నాయి.

* సకల సౌకర్యాలతో కూడిన పలు ఆకాశహర్మ్యాలు, గేటెడ్‌ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు సైతం ఈ ప్రాంతాల్లో వస్తున్నాయి.

* ఏడాది కాలంలో ధరల పెరుగుదల 17 శాతంగా ఉంది. సగటు చదరపు అడుగు ధర రూ.2980గా నమోదైంది.

* ఇళ్ల రిజిస్ట్రేషన్ల పరంగా అత్యధికంగా 44 శాతం వాటా ఈ జిల్లా నుంచే. గత ఏడాది 39 శాతంగా ఉండేది.

రంగారెడ్డి జిల్లాలో..
ఐటీ కేంద్రంగా ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఐటీ కేంద్రంగానే 80 శాతం రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ కార్యకలాపాలు సాగుతుంటాయి. పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతంలోని గచ్చిబౌలి చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. పని ప్రదేశానికి చేరువగా ఉండాలనుకునేవారు ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు.

* ఈ జిల్లా పరిధి దక్షిణ హైదరాబాద్‌, తూర్పు హైదరాబాద్‌లోనూ కొంత విస్తరించి ఉంది. ఐటీ కేంద్రానికి దూరమైనా.. ఇళ్ల ధరలు అందుబాటులో ఉంటాయని ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు.

* జిల్లా పరిధి సైతం ఎక్కువ. చాలా భూములు అందుబాటులో ఉన్నాయి. నిర్మాణాలు సైతం ఎక్కువే. దీంతో ఇక్కడ ధరల పెరుగుదల 2 శాతమే నమోదైంది. సగటు చదరపు అడుగు ధర రూ.4005 ఉంది.

* ప్రాంతాన్ని బట్టి చదరపు అడుగు రూ.3వేల నుంచి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో రూ.9వేల వరకు పలుకుతున్నాయి.

* గత ఏడాదితో పోలిస్తే ఇళ్ల లావాదేవీల వాటా స్వల్పంగా తగ్గింది. 41 శాతం నుంచి 38 శాతానికి వచ్చింది.

హైదరాబాద్‌ జిల్లాలో..

* ప్రధాన నగరం హైదరాబాద్‌ జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి స్థలాల కొరత ఉంది.

* పాత వ్యక్తిగత గృహాలను కూల్చి వాటి స్థానంలో కొత్తగా ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్లు కడుతున్నారు.

* ఎకరాల్లో భూముల లభ్యత తక్కువగా ఉంది. సంస్థలు ఎవరైనా విక్రయిస్తుంటే బిల్డర్లు కొనుగోలు చేసి అక్కడ ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారు.

* ఎంతోకాలంగా వివాదంలో ఉండి పరిష్కారమైన భూములను సైతం చేజిక్కించుకుని ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు.

* బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో అపార్ట్‌మెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ చదరపు అడుగు రూ.10వేల పైనే పలుకుతోంది. రూ.12వేల నుంచి రూ.20వేల ధరల్లోనూ ప్రాజెక్టులు ఉన్నాయి.

* ఇతర అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో చదరపు అడుగు రూ.ఆరేడువేల ధరల్లో ఉన్నాయి.

* జిల్లాల్లో సగటు చదరపు అడుగు ధర రూ.4336గా(రిజిస్ట్రేషన్ల విలువ) ఉంది. ఏడాది కాలంగా 18 శాతం ధరలు పెరిగాయి.

* సిటీ మొత్తం విక్రయాల్లో 14 శాతం వాటా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని