Updated : 17 Sep 2022 10:10 IST

‘మేనేజ్‌ స్పేస్‌’ చాలంటున్న ఐటీ సంస్థలు

కొవిడ్‌ తర్వాత లీజింగ్‌లో మార్పులు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ తర్వాత ఇంటి నుంచి పనికి పరిమితమైన ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉద్యోగులను ఆకట్టుకునేలా కార్యాలయాల ప్రాంగణాలను సృజనాత్మకంగా తీర్చిదిద్దుతున్నాయి. కొవిడ్‌ ముందున్న వాటిని సమూలంగా మార్పులు చేస్తున్నాయి. అయినా ఐటీ కార్యాలయాల్లో ఇప్పటికీ 30 నుంచి 35 శాతం మించి ఉద్యోగులు రావడం లేదు. మిగతావారంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. హైబ్రీడ్‌ పని విధానం ప్రస్తుతం నడుస్తోంది. ఎంతమంది కార్యాలయాలకు వస్తారో, ఎప్పటికి వస్తారో స్పష్టత లేకపోవడంతో ఐటీ కంపెనీలు కొత్తగా ‘మేనేజ్‌ స్పేస్‌’ కావాలంటున్నాయి. వీరి అవసరాలను తీర్చేందుకు నిర్మాణ సంస్థల నుంచి కో వర్కింగ్‌ స్పేస్‌ సంస్థలు ఏ గ్రేడ్‌ కార్యాలయాలను లీజుకు తీసుకుంటున్నాయి.

ఏంటీ కాన్సెప్ట్‌?.. వంద మంది ఉద్యోగులు పనిచేసే సంస్థ ఇదివరకైతే ఆ మేరకు భారీ విస్తీర్ణం కలిగిన కార్యాలయాన్ని దీర్ఘకాలానికి లీజుకు తీసుకునేది. ఇప్పుడు మేనేజ్‌ స్పేస్‌ చాలంటున్నారు. కో వర్కింగ్‌ స్పేస్‌ సంస్థల నుంచి తమకు కావాల్సిన విస్తీర్ణాన్ని మేనేజ్‌ స్పేస్‌గా తీసుకుంటున్నారు. ఉద్యోగులు ప్లగ్‌ అండ్‌ ప్లే పద్ధతిలో వచ్చి పనిచేసి వెళతారు. ఒక్కో సీటుకు నెలకు ఇంత చొప్పున నిర్ణీత మొత్తం సంస్థలకు చెల్లిస్తారు. హైదరాబాద్‌లో ఒక సీటుకు ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి రూ.8వేల నుంచి 14వేల వరకు వసూలు చేస్తున్నారు. మరికొంతకాలం హైబ్రిడ్‌ విధానమే కొనసాగుతుంది అంటున్న అంచనాల నేపథ్యంలో పెద్ద సంస్థలు మేనేజ్‌ స్పేస్‌ను కోరుకుంటున్నాయి. ఒకవేళ ఉద్యోగుల సంఖ్య పెరిగినా ఆ మేరకు అదనపు సీట్ల సామర్థ్యం అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఢోకా ఉండదని చెబుతున్నారు.

ఇదీ తేడా...

కో వర్కింగ్‌ స్పేస్‌లో ఎక్కువగా అంకుర సంస్థలు, చిన్న సంస్థలు పది సీట్లు, ఇరవై సీట్లను అద్దెకు తీసుకుంటుంటాయి. వేర్వేరు రంగాల సంస్థలు ఒకేచోట పనిచేస్తుంటాయి. ఒకేచోట అయినా ఎవరి డెస్క్‌ వారికి ఉంటుంది. చాలా సంస్థలు స్వల్పకాలం మాత్రమే వీటిలో పనిచేస్తుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త సంస్థలు చేరుతుంటాయి. ఒకే ప్రాంగణంలో పది నుంచి ఇరవై సంస్థలు పనిచేస్తుంటాయి. నెట్‌వర్కింగ్‌ను షేర్‌ చేసుకుంటుంటారు. వీరందరికి కెఫెటేరియా, ప్లే ఏరియా వంటివన్ని ఉమ్మడిగా ఉంటాయి. వీటిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. నెట్‌వర్కింగ్‌ షేరింగ్‌తో డాటా లీకేజీ సమస్యలు ఉంటాయి. గోప్యత తక్కువే. ఇదివరకే డిజైన్‌ చేసిన కార్యాలయాన్నే ఎంచుకోవాల్సి ఉంటుంది.

* మేనేజ్‌ స్పేస్‌ను సాధారణంగా పెద్ద సంస్థలు తీసుకుంటుంటాయి. ఎక్కువ సీట్లు కావాల్సి ఉంటుంది కాబట్టి వారికి కావాల్సినట్లుగా కార్యాలయాన్ని డిజైన్‌ చేయించుకుంటున్నాయి. దీర్ఘకాలం లీజు సమస్యలు పెట్టుకోకుండా తాత్కాలికంగా వీటిలో ఉద్యోగులకు సీట్లను కేటాయిస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల రాక, అదనంగా ఉద్యోగుల నియామకం వంటి సందర్భాల్లో అత్యవసరాల్లోనూ మేనేజ్‌ స్పేస్‌ వైపు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. కరెంట్‌బిల్లులు, హౌస్‌ కీపింగ్‌తో సహా ప్రతిదీ థర్డ్‌పార్టీ చూసుకుంటుంది కాబట్టి కంపెనీ దృష్టి పూర్తిగా ప్రాజెక్టులపై ఉంటుందని కోవర్కింగ్‌ స్పేస్‌ నిర్వాహకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts