ఉత్తరంలో గృహోదయం!

ఐటీ కారిడార్‌ కొలువైన పశ్చిమ హైదరాబాద్‌ కాకుండా నివాసాలకు ప్రత్యామ్నాయ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి? శివార్లలో ఎక్కడో విసిరేసినట్లుగా కాకుండా సిటీలో నివాస అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఉత్తర హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున గృహ నిర్మాణ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని.. ఇక్కడ ధరలు సైతం అందుబాటులో ఉన్నాయని నిర్మాణ సంఘాలు చెబుతున్నాయి.

Published : 15 Oct 2022 02:28 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఐటీ కారిడార్‌ కొలువైన పశ్చిమ హైదరాబాద్‌ కాకుండా నివాసాలకు ప్రత్యామ్నాయ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి? శివార్లలో ఎక్కడో విసిరేసినట్లుగా కాకుండా సిటీలో నివాస అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఉత్తర హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున గృహ నిర్మాణ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని.. ఇక్కడ ధరలు సైతం అందుబాటులో ఉన్నాయని నిర్మాణ సంఘాలు చెబుతున్నాయి. చుట్టూ పచ్చదనంతో ప్రశాంతమైన వాతావరణం.. నగరంతో అనుసంధానం.. చేరువలో విద్య, వైద్య, మాల్స్‌ వంటి సామాజిక మౌలిక వసతులకు లోటు లేదని చెబుతున్నారు.

హైదరాబాద్‌ అభివృద్ధి మొత్తం ఒకవైపే కనిపిస్తోంది. మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి దాటి కోకాపేట వైపు విస్తరిస్తోంది. గృహ నిర్మాణ ప్రాజెక్టులు 80 శాతం వరకు ఇక్కడ వస్తున్నాయి. వేల ఇళ్లు కడుతున్నారు. ఐటీ ఉపాధికి చేరువలో ఉండాలని సిటీలోని ఇతర ప్రాంతాల్లోని వారు సైతం ఇటువైపు వస్తున్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మాల్స్, పబ్స్‌ వంటి సోషల్‌ ఇన్‌ఫ్రాతో ఈప్రాంతం ఆకర్షణీయంగా మారింది. అయితే ఇప్పటికే ఇక్కడ పరిమితికి మించి నిర్మాణాలు రావడంతో ట్రాఫిక్‌ రద్దీ సమస్యగా ఉంది. మంచినీరు, మురుగునీటి వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. ఒకవైపు అభివృద్ధి సిటీకి నష్టదాయకం కావడంతో ఇతర ప్రాంతాల్లో అభివృద్ధిని చేపట్టాలని రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు ఎంతోకాలంగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. పశ్చిమ ప్రాంతానికి ప్రత్యామ్నాయంగా ఉత్తర ప్రాంతాన్ని ప్రోత్సహిస్తున్నాయి. చాలా సానుకూలతలు ఉన్నాయని చెబుతున్నాయి.

కొంపల్లి వైపు..

ఉత్తర హైదరాబాద్‌ ప్రాంతంలోకి బొల్లారం, కొంపల్లి, మేడ్చల్, షాపూర్‌నగర్‌ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వస్తాయి. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి అరగంట లోపు చేరుకునే ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. ప్యారడైజ్‌ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు మెట్రో సౌకర్యం ఉంది. మరోవైపు ఆయా ప్రాంతాలకు మౌలాలి, బాలానగర్, సుచిత్ర జంక్షన్‌ వరకు అనుసంధానం మెరుగ్గా ఉంది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి. మధ్యలో ఆర్మీ కేంద్రాలు ఉన్న చోట రహదారులు ఇరుకుగా ఉన్నా ఆ తర్వాత విశాలమైన రహదారులు ఉన్నాయి. ఎంఎంటీఎస్‌ రవాణా త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. ఓఆర్‌ఆర్, జాతీయ, రాష్ట్ర రహదారుల అనుసంధానం మెరుగ్గా ఉంది. పేరున్న పాఠశాలలు, ఆసుపత్రులు, మాల్స్‌ ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. నివాసానికి పూర్తి అనువైన ప్రదేశంగా ఉంది.

మున్ముందు...

ఈ ప్రాంతం భవిష్యత్తులో మరింత వృద్ధికి అవకాశం ఉందని అంచనాలున్నాయి. ప్రభుత్వం మేడ్చల్‌ వద్ద కండ్లకోయలో ఐటీ పార్క్‌ను ప్రకటించింది. నిర్మాణం పూర్తైతే ఇక్కడ 100 కంపెనీల వరకు వచ్చే అవకాశం ఉందని..ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జీనోమ్‌ వ్యాలీ, ఫార్మా సంస్థలు ఉన్నాయి. మొదటి నుంచి వేర్‌హౌసింగ్‌ కేంద్రంగా ఈప్రాంతం ఉంది. మున్ముందు ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయి. వీరందరికి గృహ నివాసం కావాల్సిందే.

ఎక్కువగా..

ఉత్తర తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్‌ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఇళ్లు కొనుగోలు చేస్తుంటారు. విద్య, ఉపాధి కోసం సిటీకి ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఏటా వస్తుంటారు. వీరితో పాటూ ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నివాసం ఉండటానికి పెద్ద ఎత్తున గేటెడ్‌ కమ్యూనిటీలు అందుబాటులో ఉన్నాయి. మూడువేలపైన ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ధరలు సైతం ఇక్కడ చదరపు అడుగు రూ.ఐదారువేల లోపే ఉన్నాయి. ఇంకా తక్కువలో దొరుకుతున్న ప్రాంతాలు సైతం ఉన్నాయి.


సగం ధరకే ఇక్కడ దొరుకుతున్నాయ్‌..

హైదరాబాద్‌ నగరం సౌభాగ్యంగా ఉండాలంటే అన్నివైపులా అభివృద్ధి చెందాలి. నగర ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. సిటీలో మొదట గేటెడ్‌ కమ్యూనిటీలు హైదరాబాద్‌ ఉత్తరంలోనే పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ 3వేల వరకు ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. నివాసానికి పూర్తి అనువైన ప్రాంతమిది. సోషల్‌ ఇన్‌ఫ్రాకు లోటులేదు. కండ్లకోయలో ఐటీ పార్క్‌తో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రోత్సహించేందుకు కొంపల్లిలో వచ్చేనెల 5,6 తేదీల్లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాం. పశ్చిమ హైదరాబాద్‌లో రూ.పదివేల నుంచి 12వేల వరకు చదరపు అడుగు ధర ఉంటే.. ఇక్కడ రూ.ఐదారువేలల్లోనే ధరలు ఉన్నాయి.

- వి.రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, క్రెడాయ్‌ హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని