Published : 29 Oct 2022 03:21 IST

అక్కడ అమ్మి.. ఇక్కడ కొంటున్నారు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో మూడు పడక గదుల ఇల్లు కావాలంటే కోటిన్నర రూపాయలు వెచ్చించాల్సిందే.  ఈ ధరలు క్రమంగా పెరుగుతూనే వెళుతున్నాయి. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఫ్లాట్ల ధరలే ఇలా ఉంటే ఆరు నుంచి ఎనిమిదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీమియం ఫ్లాట్లను ఆరు నుంచి పది కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారు. 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కడుతున్న ఫ్లాట్లు ఉన్నాయి. గరిష్ఠంగా అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల ధరలు రూ.20 కోట్ల వరకు చేరాయి. ఈతరహా ప్రీమియం ఇళ్ల వాటా రెండు నుంచి 3 శాతంగా ఉన్నట్లు బిల్డర్లు చెబుతున్నారు. 70 శాతం వరకు రెండు, మూడు పడకల గదుల ఇళ్లే ఉంటున్నాయి. వీటి ధరలు అందుబాటులోనే ఉన్నాయని నిర్మాణదారులు అంటున్నారు. హైదరాబాద్‌లో ఉండేవారికి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌కు రూ.కోటిన్నర వెచ్చించడం భారంగా భావిస్తున్నారు. ముంబయి, ఇతర నగరాల నుంచి వచ్చిన వారికి  ఈ ధరల్లోని ఇళ్లు ఆకర్షణీయంగా అనిపిస్తున్నాయి. వీరు అక్కడ ఫ్లాట్లను అమ్మి పశ్చిమ హైదరాబాద్‌లో ఎక్కువగా ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. రోజు రోజుకు భూములు తగ్గిపోతున్నాయని.. హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం అని.. భవిష్యత్తులో మంచి రాబడి అందుకుంటారని ప్రముఖ నిర్మాణ సంస్థ డైరెక్టర్‌ ఒకరు విశ్లేషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని