తగ్గితే పన్ను.. ప్రజలకు దన్ను
కార్మికుల్లో నైపుణ్య లేమితోనే నిర్మాణంలో లోపాలు
పని ప్రదేశంలోనే వారికి శిక్షణ ఇప్పించాలి
‘ఈనాడు’తో నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రాజన్ బండెల్కర్
ఈనాడు, హైదరాబాద్; న్యూస్‌టుడే, సరూర్‌నగర్
‘ఇళ్ల ధరలు పెరిగిన తరుణంలో సామాన్య, మధ్య తరగతి వర్గాల సొంతింటి కల నెరవేరాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు తగ్గించడం ఒక్కటే మార్గం. రూ.60 లక్షల ఇల్లు కొనుగోలు చేస్తే రూ.18-20 లక్షలు ప్రభుత్వాలకు పన్నుల రూపంలో కడుతున్నారు. స్టాంప్‌డ్యూటీ, జీఎస్టీ, ఇతర మౌలిక వసతుల ఛార్జీల రూపంలో కొనుగోలుదారులపై భారం పడుతోంది. కనీసం అందుబాటు ధరల్లోని ఇళ్ల వరకైనా ప్రభుత్వం తమ పన్నులను తగ్గించుకోవాలని కోరుతున్నాం. రూ.పది లక్షలు తగ్గినా.. ఆ మేరకు భారం కొనుగోలుదారుడిపై తగ్గుతుంది. ముడిసరకుల ధరలు పెరగడంతో ఇంటి ధరలు పెరుగుతున్నాయి. గృహం నచ్చి, బడ్జెట్ ధరలో ఉంటే ఆలస్యం చేయకుండా కొనుక్కోవడం మేలు. ధరలు పెరిగే కొద్దీ ఇంటి విస్తీర్ణం తగ్గించడం ఒక్కటే బిల్డర్ల ముందున్న మార్గం. ముంబయిలో 560 నుంచి 360 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గించారు’ అని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(నరెడ్కో) జాతీయ అధ్యక్షుడు రాజన్ బండెల్కర్ అన్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆయన నిర్మాణ రంగంలో నాణ్యత పెంపు, కేంద్రం బడ్జెట్లో కోరుతున్న ప్రోత్సాహకాలు, నిర్మాణ రంగంలో సాంకేతికత తీసుకురాబోతున్న మార్పులపై ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది.
ఇళ్ల నిర్మాణం పెరిగింది. నాణ్యతపై వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారు? బిల్డర్లకు మీరిచ్చే సూచన? నాణ్యత పెంపునకు నరెడ్కో చేపడుతున్న చర్యలేంటి?
రాజన్: వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి లభిస్తున్న రంగం రియల్ ఎస్టేట్. నైపుణ్యం లేని కార్మికులు ఇందులో ఎక్కువగా ఉంటారు. ఇది అటు పరిశ్రమకు, ఇటు వినియోగదారులకు మంచిది కాదు. కార్మికులకు, దేశానికీ నష్టమే. నైపుణ్యం లేకుంటే పని నాణ్యంగా చేయలేరు. నిర్మాణ సామగ్రి వృథా చేస్తారు. పనిలో సంతృప్తి ఉండదు. తగిన వేతనం లభించదు. నిపుణ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వంతో కలిసి నరెడ్కో ప్రతి నిర్మాణదారుడి స్థలంలోకి వెళ్లి అక్కడే కూలీలకు శిక్షణ ఇస్తోంది.
నాణ్యతకు సంబంధించి కొనుగోలుదారుల నుంచి ఎక్కువగా వేటిపైన ఫిర్యాదులు వస్తున్నాయి. దిద్దుబాటుకు గుర్తించిన అంశాలు ఏంటి?
రాజన్: బండలు పరవడం, ప్లంబ్లింగ్, ప్లాస్టరింగ్, కాంక్రీటింగ్, ఎలక్ట్రికల్ పరంగా నైపుణ్యం లేని వ్యక్తులు చేసిన పనితో గచ్చు హెచ్చుతగ్గులు, లీకేజీలు, పగుళ్లు, విద్యుత్తు ఉపకరణాలు కాలిపోవడం వంటి సమస్యలను కొనుగోలుదారులు ఎదుర్కొంటున్నారు. ఒకట్రెండేళ్లలో ఒక్కోటిగా బయటపడే ఈ తరహా సమస్యలను చూసి వాపోతున్నారు. ఇల్లు ఎంత పటిష్ఠంగా ఉంటే కొనుగోలుదారుడు అంత ఆనందంగా ఉంటాడు. సైన్స్, కామర్స్, మెడికల్, ఇంజినీరింగ్ చదివేందుకు కళాశాలలు ఉన్నట్లు.. ప్లాస్టరింగ్, కాంక్రీట్ పని కోసం స్కూళ్లు లేకపోవడం లోపం. కేంద్రంలోని గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, నరెడ్కో అధ్యయనం చేసి పని ప్రదేశంలోనే మూణ్నెల్ల క్రితం జాతీయ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణ బిల్డర్ల నుంచి చొరవ ఎలా ఉంది?
రాజన్: తెలంగాణ నరెడ్కో, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, ఇతర భవన నిర్మాణదారులను సైతం కార్మికులకు శిక్షణ ఇప్పించాలని కోరాం. 400-500 మంది కూలీలు సైట్లలో పనిచేస్తున్నవారికి ఇది ఉపయోగకరం. గుత్తేదారు, కార్మికులు ఎవరూ ఇందుకోసం రూపాయి చెల్లించాల్సిన పనిలేదు. శిక్షణకయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది. పరిశ్రమ, గుత్తేదారు, కార్మికులు అందరికి ఉపయోగం. పని ప్రదేశంలోనే 10 రోజుల శిక్షణ ఉంటుంది. 2 గంటలు పాఠాలు వింటూ.. మిగతా సమయం సైట్లో పనిచేస్తారు. లోపాలను అక్కడే ఉండే శిక్షకుడు సరిచేస్తారు. ఉపాధి పొతుందన్న ఆందోళన అక్కర్లేదు. అనుభవజ్ఞులైన శిక్షకులతో బ్యాచుల వారీగా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం. కార్పెంటర్, బార్ బెండింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, ప్లాస్టరింగ్ ఇలా నిర్మాణంతో ముడిపడిన ప్రతి అంశంపై శిక్షణ ఇస్తారు.
కేంద్రం ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఎలాంటి ప్రోత్సాహకాలను ఆశిస్తున్నారు? పరిశ్రమ తరఫున ఇచ్చిన ప్రతిపాదనలు ఏంటి?
రాజన్: జీఎస్టీతోపాటు గతంలో ఉండే ఇన్‌ఫుట్ సబ్సిడీని నిలిపేశారు. 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. జీఎస్టీ, ఇన్ఫుడ్ సబ్సిడీలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం భవన నిర్మాణదారుడికి కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నాం. అందుబాటు ధరల్లోని ఇళ్లకు జీఎస్టీ 1 శాతం ఉంది. రూ.45 లక్షల పరిమితి ఉంది. దీన్ని తొలగించాలని కోరాం. ఇల్లు కొనుగోలు చేసేవారికి వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకే పన్ను మినహాయింపు ఇస్తున్నారు. పదేళ్ల నుంచి ఇదే ఉంది. మొదటి ఇల్లు కొనేవారికి ఎంత వడ్డీ చెల్లిస్తే అంత మేరకే పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరాం. రెండు, మూడో ఇల్లు కొంటే రూ.5 లక్షల వరకు మినహాయింపు ఉండాలని చెబుతున్నాం.
నిర్మాణ రంగంలో సాంకేతికత వినియోగంతో ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి?
రాజన్: గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్‌ను ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతికతలు ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణ రంగంలో 30-40 నెలలు పట్టే ప్రాజెక్ట్ రెండున్నర నెలల్లో పూర్తిచేసేందుకు వీలవుతుంది. నాలుగింట ఒక వంతు సమయం ఆదా అవుతుంది. వడ్డీ భారం, వ్యయం, కాలుష్యం తగ్గుతుంది. నాణ్యత పెరుగుతుంది.
ఈనాడు: ప్రస్తుతం జాతీయ స్థాయిలో, హైదరాబాద్‌లో స్థిరాస్తి మార్కెట్ ఎలా ఉంది?
రాజన్: హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం స్థిరాస్తి రంగం బాగుంది. కొవిడ్ అనంతరం ప్రతి ఒక్కరిలో సొంత ఇల్లు ఉండాలనే ఆలోచన పెరిగింది. ఈ ఆకాంక్షతో ఇటీవల ఈ రంగం బాగా పుంజుకుంది. భవిష్యత్తుకు ఢోకా లేదు. మిగులు నిధులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడున్న నిర్మాణాల కంటే ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లో అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) ఉండటం ధరలు అమాంతం పెరగకుండా నిరోధిస్తోంది. దేశంలోని ఇతర నగరాల్లో ఎఫ్ఎస్ఐ పరిమితులు ఉండటంతో ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో ధరలు అమాంతం పెరిగాయి. ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడానికి ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు ఉండక పోవడమే కారణం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: సన్ఫ్లవర్స్తో అనసూయ రొమాన్స్.. రకుల్ డైమండ్ కొటేషన్!
-
World News
British Airlines: ఇంత మోసమా.. ఎంతో ఆశతో విండో సీట్ బుక్ చేస్తే..!
-
India News
PM Modi: అలా అనే ధైర్యం ఎవ్వరికీ లేదు : మోదీ
-
Sports News
Anil Kumble: భారత క్రికెట్లో ఈ రోజు ఓ సంచలనం.. కుంబ్లేకు పాక్ జట్టు దాసోహమైన వేళ!
-
General News
Andhra News: ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.4,42,442 కోట్లు: కేంద్రం
-
Movies News
Allu arjun: ఫొటో షూట్ రద్దు చేసిన బన్నీ.. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు