శివారులో జోరుగా లేఅవుట్లు

రాజధానిలో నిర్మాణ రంగం విస్తరిస్తోంది. నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ ప్రభుత్వం టీఎస్‌బీపాస్‌ చట్టాన్ని తీసుకురావడంతో.. శివారులో అధికారిక లేఅవుట్లు పెరుగుతున్నాయి.

Updated : 10 Dec 2022 09:09 IST

తూర్పు నగరంలో వేగంగా విస్తరణ
పశ్చిమాన భారీ అంతస్తులకు ప్రాధాన్యం

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో నిర్మాణ రంగం విస్తరిస్తోంది. నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ ప్రభుత్వం టీఎస్‌బీపాస్‌ చట్టాన్ని తీసుకురావడంతో.. శివారులో అధికారిక లేఅవుట్లు పెరుగుతున్నాయి. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే వాటికి ఆదరణ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల కాలంలో ఇచ్చిన అనుమతులను పరిశీలిస్తే.. గ్రేటర్‌కు తూర్పున లేఅవుట్ల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. ఇళ్ల స్థలాల క్రయవిక్రయాలకు ఇటువైపు ఆదరణ ఉందని,  పశ్చిమాన భారీ నిర్మాణాలతో విస్తరిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

తూర్పున రయ్‌ రయ్‌

బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) నగరానికి మణిహారం లాంటిది. నగర విస్తరణకు కేంద్రంగా మారింది. దీని చుట్టూ హైదరాబాద్‌ శరవేగంగా విస్తరిస్తోందని గత రెండేళ్లలో జారీ అయిన నిర్మాణ అనుమతులు నిరూపిస్తున్నాయి. నవంబరు 16, 2020 నుంచి నవంబరు 16, 2022 వరకు టీఎస్‌బీపాస్‌ ద్వారా శివారు మున్సిపాలిటీల్లో మంజూరైన నిర్మాణ అనుమతులను పరిశీలిస్తే.. తూర్పున మరిన్ని కొత్త లేఅవుట్లు అనుమతులు పొందాయి. శ్రీశైలం హైవేపై ఓఆర్‌ఆర్‌ సమీపంలో ఉండే తుక్కుగూడ మున్సిపాలిటీ నుంచి ప్రారంభిస్తే.. ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్‌, పెద్దఅంబర్‌పేట, శామీర్‌పేట, తూముకుంట, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ పురపాలక సంస్థల పరిధిలో ఇవి వచ్చాయి. 600 చ.గజాలకు మించి విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాల పరంగా ఇవి వెనుకబడి ఉన్నాయి. అమీన్‌పూర్‌, నిజాంపేట, మణికొండ, నార్సింగి, బండ్లగూడ, తదితర మున్సిపాలిటీల్లో బహుళంతస్తులకు లెక్కకు మించి అనుమతి తీసుకున్నారు. నగరానికి పశ్చిమాన ఉన్న ప్రాంతాలు బహుళ అంతస్తులు, ఆకాశహర్మ్యాలకు నెలవుగా మారుతున్నాయని ప్రణాళిక విభాగం అధికారులు విశ్లేషించారు. అమీన్‌పూర్‌లో రెండేళ్లలో 600 చ.గజాలకు మించిన భూమిలో 365 నిర్మాణ అనుమతులు మంజూరయ్యాయని, నిజాంపేటలో 324, మణికొండలో 252, బండ్లగూడలో 228, నార్సింగిలో 216, కొంపల్లిలో 186, పెద్దఅంబర్‌పేట, పీర్జాదిగూడలో 183 చొప్పున భారీ అంతస్తులకు అనుమతులిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నార్సింగి, పెద్దఅంబర్‌పేట, తెల్లాపూర్‌ మున్సిపాలిటీల్లో రెండు చొప్పున లేఅవుట్లు, కొంపల్లిలో ఓ లేఅవుట్‌ మినహా.. మిగిలిన వాటిలో దరఖాస్తులే లేకపోవడం గమనార్హం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని