పల్లెకు పోదాం చలోచలో

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కాలనీలు కట్టగా చూశాం.. టౌన్‌షిప్పులను నిర్మించగా ఆయా సంస్థల పేర్లతో చలామణి కావడం వింటున్నాం. ఆకాశహర్మ్యాలను కడితే అందులో ఉంటున్నాం.. ఇప్పుడు కొత్తగా ఊర్లనే నిర్మిస్తున్నారు. కొనుగోలుదారులు సైతం పల్లెకు పోదాం చలోచలో అంటున్నారు.

Published : 17 Dec 2022 02:33 IST

పట్టణాలు కాదు ఊర్లనే నిర్మిస్తున్నారు
రియల్‌ ఎస్టేట్‌లో నయాపోకడలు
పర్యావరణహిత ప్రాజెక్టులవైపు కొనుగోలుదారుల మొగ్గు
ఈనాడు, హైదరాబాద్‌  

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కాలనీలు కట్టగా చూశాం.. టౌన్‌షిప్పులను నిర్మించగా ఆయా సంస్థల పేర్లతో చలామణి కావడం వింటున్నాం. ఆకాశహర్మ్యాలను కడితే అందులో ఉంటున్నాం.. ఇప్పుడు కొత్తగా ఊర్లనే నిర్మిస్తున్నారు. కొనుగోలుదారులు సైతం పల్లెకు పోదాం చలోచలో అంటున్నారు. మట్టి రహదారులు, వంకర టింకరగా ఉండే ఇరుకు సందులు.. దారులపై నడుచుకుంటూ, దూరమైతే సైకిళ్లపై వెళ్లే మనుషుల సంచారం.. ప్రతి ఇల్లు పచ్చని పొదరిల్లు.. చుట్టూ చూస్తే పొలమో.. అడవో కన్పిస్తుంది.. పిచ్చుకల కిలకిలారావాలు.. వాహన రణగొణ ధ్వనులు లేని ప్రశాంత వాతావరణం.. ఇరుగు పొరుగు పలకరింపు.. రచ్చబండపై కాలక్షేప కబుర్లు... ఒకప్పటి పల్లెలు ఇవి. మళ్లీ అలాంటి ప్రదేశాల్లో గడపాలని చాలామంది ఉత్సాహపడుతున్నారు.
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇప్పటివరకు పట్టణాలను నిర్మించిన సంస్థలు.. ఇప్పుడు కొత్తగా పల్లెల నిర్మాణం మొదలెట్టాయి. ఇప్పటి తరానికి నాటి పల్లెలను పరిచయం చేయడమే కాదు అక్కడే చక్కటి వాతావరణంలో సుస్థిర నివాసం ఏర్పర్చుకునే వెలుసుబాటునూ కల్పిస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి రీత్యా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు పెద్దఎత్తున వలస వస్తున్నారు. సహజంగానే హైదరాబాద్‌లో జనాభా పెరిగేకొద్దీ మౌలిక వసతులపై ఒత్తిడి పెరుగుతోంది. జనాభాకు తగ్గట్టుగా పైవంతెనలు, రహదారులను విస్తరిస్తున్నారు. బెంగళూరు, చెన్నైకంటే మౌలిక వసతులపరంగా మెరుగ్గా ఉన్నామని అధికారులంటున్నారు. ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు ఎంతగా చేస్తున్నా.. జనసాంద్రత పెరిగేకొద్దీ సమస్యలు వస్తున్నాయి. వ్యర్థాలు, మురుగునీటి, వరదనీటి నిర్వాహణ వరకు సమస్యలు ఉండనే ఉంటాయి. రహదారులపై ట్రాఫిక్‌ పెరగడం, సిటీలో కాలుష్య సమస్యలు.. ఇలా ఒక్కోటి నగర జీవనశైలిని ప్రభావితం చేస్తుంటాయి. ఒత్తిడిని పెంచుతున్నాయి. అంతిమంగా ఇవన్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యం లేని, ఒత్తిడికి దూరంగా ప్రశాంత వాతావరణంలో జీవించాలని కోరుకుంటున్నవారు పల్లెలవైపు చూస్తున్నారు.  కొవిడ్‌ సమయంలో ఊర్లలో, ఫామ్‌హౌజ్‌లలో కొన్నాళ్లపాటు గడిపి వచ్చిన అనుభవాలు వీరి సొంతం. వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలని శతమానం భవతి అంటున్నారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నవారందరూ ఒక్కచోట కమ్యూనిటీగా ఉండేందుకు మొగ్గు చూపుతుండటంతో పట్నాల చెంత పల్లెలు రూపుదిద్దుకుంటున్నాయి.

ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కల

టౌన్‌షిప్పులు, కాలనీలే కాదు ప్రాంతీయ వలయ రహదారి బయట పల్లెలు రూపుదిద్దుకుంటున్నాయి. సిటీకి 60 కి.మీ. దూరంలో ఊర్లలో మాదిరి క్లస్టర్‌ హోమ్స్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఆయా క్లస్టర్లకు అక్కడ పెంచే వృక్షాల పేర్లతో రావిపల్లె, మోదుగుపల్లె వంటి పేర్లను పెడుతున్నారు. ఊర్లలో సైతం ప్రతి సందులో సిమెంట్‌ రోడ్డు ఉంటుంది. ఇక్కడ మాత్రం మట్టి రోడ్డే కనిపిస్తుంది. ఇదివరకు వాహనాలు లేకపోవడంతో ఇంటి ముందు పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. నిమిషానికి పదుల సంఖ్య వాహనాలు పలెల్లోనూ పరుగులు తీస్తున్నాయి. పల్లె ప్రాజెక్టుల్లో గల్లీలాంటి రోడ్లే కాబట్టి వాహనాలు ఇంటిదాకా వచ్చే పరిస్థితి ఉండదు. వాహనాలన్నింటిని కమ్యూనిటీ ప్రారంభంలో నిలిపేందుకు పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తున్నారు. అక్కడి నుంచి ఎవరైనా నడిచి ఇంటికి చేరాల్సిందే. పల్లెల్లో ఉండేవారికి ఎంతోకొంత వ్యవసాయ పొలం ఉంటుంది. ఇక్కడ ఉండేవారికి సైతం పొలం ఉంటుంది. ఉమ్మడి వ్యవసాయంతో కావాల్సిన ఆకుకూరలు, కాయకూరలు పండించుకుంటారు.

స్థానికంగా ఉపాధి..

ఒక ఊరు అంటే వందల ఇళ్లు ఉంటాయి. రెండు మూడొందల మంది నివాసం ఉంటారు. వీరికి కావాల్సిన పనులు చేసిపెట్టేందుకు పదుల సంఖ్యలో మనుషులు అవసరం. పల్లె ప్రాజెక్టులు వచ్చినచోట ఇలా కొందరికి ఉపాధి లభిస్తుంది. పట్నాలకు వలసలు తగ్గుతాయి. సిటీ మౌలిక వసతులపై ఒత్తిడి తగ్గుతుంది.  

నెట్‌ జీరో మాదిరి..

ఒకప్పుడు పల్లెలు స్వయం సమృద్ధితో ఉండేవి. కొన్ని వస్తువులు తప్ప ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు, బియ్యం అన్ని దొరికేవి. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు తీర్చిదిద్దుతున్న పల్లెల్లో సైతం వీటికి పెద్దపీట వేస్తున్నారు. ప్రతి ఇంటిపై సౌరపలకలతో కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. గోశాలతో పశుపోషణ చేస్తున్నారు. వచ్చే ఎరువును పంటలకు వేస్తున్నారు. వాననీటిని పూర్తిగా అక్కడే ఇంకిస్తున్నారు. చెరువుల్లో నీటి నిల్వతో ఏడాది పొడవునా వినియోగించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రభుత్వం ఎకో హబ్‌ ఏర్పాటు చేస్తే బాగు
- నగేశ్‌ బత్తుల, ఎండీ, ఆర్గానో

మా వంతుగా కౌంటర్‌ అర్బనైజేషన్‌ చేయాలని సిటీకి దూరంగా ఎకో హ్యాబిటేట్స్‌ చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఉండేవారిని సిటీ నుంచి గంటన్నర ప్రయాణ దూరంలో వరకు తీసుకెళ్లి అక్కడ నివసించేలా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకోసం పల్లెల స్ఫూర్తితో వాటిని పునఃనిర్మిస్తున్నాం. ఫలితంగా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వలసలను ఆపేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటితరం వారికి పల్లెలు ఎలా ఉంటాయో తెలియదు. కొత్తతరానికి సిసలైన భారత్‌ అంటే ఏంటో ఇక్కడ చూస్తారు. ఇలాంటి ఎకో హ్యాబిటేట్‌ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఒక వేదిక ఉంటే బాగుంటుది. టీహబ్‌ మాదిరి ఏకో హబ్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం పర్యావరణపరంగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. రియల్‌ ఎస్టేట్‌రంగంలో పర్యావరణ అనుకూల ప్రాజెక్టులను చేపట్టేవారికి ఎకో హబ్‌ తోడ్పాటు అందించేలా ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని