వడ్డీరేట్లు పెరిగాయ్‌... ఆదాయపు పన్నులోనైనా కనికరించరూ

బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు చేస్తోంది. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు బడ్జెట్‌లో తోడ్పాటు ఇవ్వాలని స్థిరాస్తి సంఘాలు ఎంతోకాలంగా కోరుతున్నాయి.

Published : 24 Dec 2022 00:57 IST

చెల్లిస్తున్న వడ్డీకి రూ.5 లక్షల వరకు మినహాయింపు ఇవ్వండి
బడ్జెట్‌ నేపథ్యంలో కేంద్రానికి క్రెడాయ్‌ విజ్ఞప్తి
ఈనాడు, హైదరాబాద్‌

బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు చేస్తోంది. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు బడ్జెట్‌లో తోడ్పాటు ఇవ్వాలని స్థిరాస్తి సంఘాలు ఎంతోకాలంగా కోరుతున్నాయి. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లోనైనా గృహ రుణ వడ్డీ చెల్లింపులపై పన్ను ప్రయోజనాలను రూ.5 లక్షలకు పెంచాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) కేంద్రాన్ని కోరింది.

గృహ రుణ వడ్డీరేట్లు ఆరు నెలల వ్యవధిలో భారీగా పెరిగాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా రెపో రేటును 225 బేసిక్‌ పాయింట్లకు పెంచడంతో ఆరు నుంచి 7 శాతం మధ్యలో ఉన్న గృహ రుణ వడ్డీరేట్లు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 9 శాతానికి చేరాయి. దీంతో ఈఎంఐ భారం పెరిగింది. ఇందులో వడ్డీ చెల్లింపుల వాటానే అధికంగా ఉంటుంది. ఇప్పటివరకు గృహ రుణ వడ్డీ చెల్లింపుల్లో రూ.2 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది. ఈఎంఐలు పెరిగిన తరుణంలో వడ్డీ మినహాయింపును రూ.5 లక్షలకు పెంచాలని క్రెడాయ్‌ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో మరింతమంది ఇంటి కలను సాకారం చేసుకునేందుకు దోహదం చేస్తుందని చెబుతున్నారు.

రూ.45 లక్షలు మార్చాలి

అందుబాటు ఇళ్లకు కేంద్రం రూ.45 లక్షల పరిమితిని విధించింది. ఈస్లాబ్‌ను నిర్ణయించి ఐదేళ్లు దాటింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మార్కెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. భూముల, నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయి. కూలీల వ్యయం పెరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకుని అందుబాటు ఇళ్ల ధర పరిమితిని సవరించాలని క్రెడాయ్‌ కోరుతోంది. అందుబాటు ఇళ్లకు జీఎస్‌టీ 1 శాతం ఉండగా... మిగతా ఇళ్లకు 5 శాతం ఉంది. అందుబాటు ఇళ్లను మెట్రో నగరాల్లో రూ.80 లక్షలకు, మెట్రోయేతర నగరాల్లో రూ.60 నుంచి 65 లక్షలకు పెంచాలని కొందరు బిల్డర్లు కోరుతున్నారు.

* ఇళ్లకు డిమాండ్‌ పెంచడానికి సంవత్సరంలో రూ.20లక్షల వరకు అద్దె ఆదాయానికి వందశాతం పన్ను మినహాయింపు ఇవ్వాలి. దీంతో ఆదాయం ఉన్న వ్యక్తులు అద్దె ఇళ్లపై పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించినట్లు అవుతుందని కేంద్రాన్ని క్రెడాయ్‌ కోరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని