ఇల్లు నిన్న అవసరం.. నేడు అత్యవసరం

మధ్యతరగతివాసులకు ఫ్లాట్‌ అనేది మిగతా అన్నింటికంటే చాలా ముఖ్యమైంది. మీరు ఇల్లు కొంటే  అద్దె చెల్లించే స్థానంలో నెలనెలా ఈఎంఐ చెల్లిస్తారు.

Updated : 24 Dec 2022 07:04 IST

గృహరుణంతో కొనుగోలు చేస్తే ప్రయోజనం
ఇంటి కొనుగోలుదారులకు ద్రవ్యోల్బణంతో డబుల్‌ ధమాకా
ఈనాడు, హైదరాబాద్‌

ఇల్లు కొనడం మేలా? అద్దెకు ఉండటం ఉత్తమమా?  
సొంత డబ్బులతో కొనడం సరైందా? గృహ రుణం తీసుకుంటే లాభిస్తుందా?
వ్యక్తిగత ఇల్లా? అపార్ట్‌మెంట్‌లో ఫ్లాటా? ఏది ఎవరికి అనువైన నిర్ణయం?

ఇల్లు కొనాలనే ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటి ఎన్నో సందేహాలు చుట్టుముడుతుంటాయి. కొందరు ఏటూ తేల్చుకోలేక సతమతం అవుతుంటారు. ఇవే సందేహాలను నిర్మాణ రంగంలో మూడున్నర దశాబ్దాల అనుభవం ఉన్న జనప్రియ ఛైర్మన్‌ రవీందర్‌రెడ్డి ముందు ఉంచితే ఏం చెప్పారంటే? ఇల్లు ఉండటం ఇదివరకు అవసరం.. ఇప్పుడు అత్యవసరం అంటున్నారు. ఎందుకో మీరే చదవండి.

పింఛను ఇస్తుంది

మధ్యతరగతివాసులకు ఫ్లాట్‌ అనేది మిగతా అన్నింటికంటే చాలా ముఖ్యమైంది. మీరు ఇల్లు కొంటే  అద్దె చెల్లించే స్థానంలో నెలనెలా ఈఎంఐ చెల్లిస్తారు. 30 ఏళ్ల వయసులో కొని ఉంటే అప్పుడే వివాహమై ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటారు. 15 ఏళ్ల తర్వాత చూస్తే పిల్లలు ఇంజినీరింగ్‌, మెడిసిన్‌లో చేరే స్థితిలో ఉంటారు. మధ్యతరగతి వారు పిల్లల చదువుల కోసం మళ్లీ అప్పు చేయక తప్పని పరిస్థితి. ఇంటిని పూచీకత్తుగా చూపించి విద్యారుణం పొందవచ్చు. తక్షణం రుణం పొందేందుకు ఇల్లు ఉండటం దోహదం చేస్తుంది. చూస్తుండగానే నాలుగైదేళ్లలో చదువు పూర్తి చేస్తారు. ఆ తర్వాత పిల్లలు రుణం తీర్చడమో..మీరే తీర్చడమే చేస్తారు. మీరు పదవీ విరమణ చేసే 60 ఏళ్ల నాటికి ఈఎంఐలు పూర్తైపోతాయి. రుణ విముక్తి అవుతారు. పదవీ విరమణ తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించేందుకు నెలనెలా కొంత పింఛను కావాలంటే ఇంటిని రివర్స్‌ మార్ట్‌గేజ్‌ చేయవచ్చు. ఇంటి విలువను బట్టి నెలకు రూ.10వేలు, 20వేల చొప్పున 15 ఏళ్ల వరకు పొందేందుకు ఇల్లు దారి చూపిస్తుంది. ఆ ఇంట్లో ఉంటూనే ఎంతో కొంత పింఛను రావడం ఆర్థికంగా భరోసా ఇస్తుంది.  అంతా అనుకున్నట్లు జరిగితే ఇల్లు అనేది కుటుంబానికి ఇన్ని పనులు చేసి పెడుతుంది. హఠాత్తుగా 50 ఏళ్లు, 60 ఏళ్ల వయస్సులో ఆరోగ్యం దెబ్బతిని వైద్య ఖర్చుల కోసం రూ.20 లక్షలు కావాల్సి వస్తే... ఇల్లును చూసి ఎవరైనా సొమ్ములు సర్దుబాటు చేస్తారు. తర్వాత కిరాయి ఇంటికి వెళ్లిపోయి సొంతింటిని విక్రయించి అప్పులు తీర్చవచ్చు. సమయానికి చికిత్సకు సొమ్ములు లేకపోవడంతో ప్రాణాపాయ పరిస్థితికి చేరే బదులు ఇంకో ఇంటికి వెళతారు అంతే.  ఇల్లే లేదు.. పిల్లలకు వచ్చే సంబంధాలు ఎలా ఉంటాయి? ఇల్లే లేదు.. కుటుంబ పెద్ద ఆరోగ్యం పాడై మంచాన పడితే .. మధ్యలో ఉండే పిల్లల చదువులు ఏమై పోతాయోననే దిగులుతో మరింత కుంగిపోతారు. అదే ఇల్లు ఉంటే.. తాను దూరమైనా ఇల్లు అమ్ముకుని ఎలాగో బతుకుతారులే అనే ధీమా.. ఒక్కోసారి మంచాన పడిన వారిని సైతం కోలుకుని తిరిగి పనిచేసేలా చేస్తుంది. ఆరోగ్యం చెడిపోవడానికి ఓ కారణం ఇల్లు లేకపోవడం అనేది గమనించవచ్చు.

సొంత నిధులుంటే..

రూ.50 లక్షలు చేతిలో ఉంటే స్థలం కొనుగోలు చేయడం మేలు.  ఫ్లాట్‌ని మాత్రం గృహ రుణంతోనే కొనుగోలు చేయాలి. రెండింటిని పోల్చి స్థలం విలువ బాగా పెరిగింది అని అంటుంటారు. కానీ అక్కడ స్థలంపై పెట్టుబడి రూ.50 లక్షలు. కానీ ఇక్కడ ఇంటిపై మీ జేబు నుంచి పెట్టిన పెట్టుబడి రూ.10 లక్షలే. మిగతాది 20 ఏళ్ల వరకు చెల్లించే గృహరుణమే.  ద్రవ్యోల్బణంతో మీరు చేసిన అప్పు విలువ తగ్గుతుంది. ఇంటి విలువ పెరుగుతుంది. ఆ రకంగా చూసినప్పుడు తక్కువ పెట్టుబడితో ఫ్లాట్‌ విలువ ఎక్కువ పెరిగినట్లు. రెండింటి ప్రయోజనం ఇక్కడ ఉంటే.. పూర్తిగా సొంత నిధులతో కొనుగోలు చేసినప్పుడు స్థిరాస్తి విలువ మాత్రమే పెరుగుతుంది.

ఆదాయపు పన్ను చెల్లించేవారు

అప్పు చేసి ఇల్లు కొనడం తప్పనే భావనలో కొందరు ఉంటారు. నా దృష్టిలో వారు తప్పు చేస్తునట్లుగా భావిస్తాను. ఆదాయం పన్ను చెల్లింపు పరిధిలో ఉన్నవారు అప్పు తీసుకోకుండా ఇల్లు కొంటే ఇంకా పెద్ద తప్పు. అదే గృహ రుణంతో కొంటే చెల్లించే ఈఎంఐలో 25 నుంచి 30 శాతం ఈఐఎంలో భారం తగ్గుతుంది. ఈ మేరకు ఆదాయ పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. 

ఐదేళ్ల తర్వాత జేబులోంచి కట్టేది ఏముండదు?

నెలకు రూ.60వేల ఆదాయం వచ్చే ఒక మధ్యతరగతి వ్యక్తి వార్షిక సంపాదన రూ.7 లక్షలపైన ఉంటుంది. ఆదాయ పన్ను పరిధిలోకి వస్తారు. రెండు ఫ్లాట్లు కొని ఒకదాంట్లో ఉంటూ.. మరోటి అద్దెకి ఇచ్చారు. ఈఐఎం చెల్లిస్తున్నారు కాబట్టి అసలు, వడ్డీపై ఆదాయ పన్ను ప్రయోజనాలు వస్తాయి.  ఒక ప్లాట్‌కి ఈఐఎం రూ.15వేలు చెల్లిస్తున్నారు. దీన్నుంచి అద్దె రూ.8వేలు వస్తోంది. ఆదాయపన్ను ప్రయోజనం రూ.3వేల వరకు వస్తోంది. ఈ రకంగా మీ జేబు నుంచి ఈఎంఐకి చెల్లించేది రూ.4వేలు మాత్రమే. 8 శాతం వడ్డీలో మీరు కట్టేది మూడు శాతమే.

* రుణం తీసుకున్నప్పుడు 9 శాతం వడ్డీరేటు ఉందనుకుందాం. ఏటా నాలుగైదు శాతం ద్రవ్యోల్బణం ఉంటుంది. ఈ రోజు మీరు రుణం తీసుకున్నప్పుడు రూపాయి విలువ 100 పైసలు. 4 శాతం ద్రవ్యోల్బణంతో వచ్చే ఏడాది రూపాయి విలువ 96 పైసలకు పడిపోతుంది. అంటే మీరు కట్టే ఈఎంఐ విలువ రూ.14,400. ఆ మరుసటి ఏడాది 92 కంటే దిగువకు పడిపోతుంది. అప్పుడు రూ.13,800 అవుతుంది. ఇలా  ఐదేళ్లు కడితే ఆ తర్వాత నుంచి మీ జేబులోంచి చెల్లించేది ఏమీ ఉండదు. మరోవైపు అద్దెలు పెరుగుతాయి. అంటే ఐదేళ్ల తర్వాత రూపాయి కట్టకుండా మీ ప్లాట్‌ మీకు సొంతం అవుతుంది.

* జేబులోంచి రూపాయి కట్టే పనిలేదు.. అప్పుడు ఏం చేయాలంటే మరో ఇల్లు కొనుక్కోవాలి.. ఇలా ఐదేళ్లకు ఒక ఇల్లు కొనుగోలు చేయాలి. 

ఇవి గమనించాలి...

* ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండదు.. స్థిరాస్తి విలువ పెరగడం కూడా అన్ని ప్రాంతాల్లో ఒకలా ఉండదని గమనించాలి. 

* గృహరుణ వడ్డీ శాతం ఎంత? ఏ ప్రాంతంలో స్థిరాస్తిని కొనుగోలు చేశావు? చుట్టుపక్కల అభివృద్ధి ఎలా ఉంది అనే విషయాలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. 

* వడ్డీరేటు 6 శాతమే ఉంటే స్థిరాస్తి విలువ ఎక్కువ పెరుగుతుంది. 9 శాతం ఉంటే కాస్త తక్కువగా ఉంటుంది. 

* ఎక్కడో సిటీకి దూరంగా ఇల్లు కొన్నాను.. కట్టుకున్నాను.. చుట్టుపక్కల అభివృద్ధి పెద్దగా లేదు..  అంటే ఇలాంటి చోట విలువ అనుకున్నంత పెరగకపోవచ్చు. కొనుగోలు చేసిన  ప్రాంతంలో.. చకచకా  ఇళ్లన్నీ వచ్చాయి.. లేదంటే కొత్తగా ఒక మౌలిక వసతుల ప్రాజెక్ట్‌ వచ్చిందంటే అక్కడ స్థిరాస్తి విలువ పెరుగుదల మరోలా ఉంటుంది. 

* స్థిరాస్తుల విలువ పెరగడం గ్యారంటీ. కొన్నిచోట్ల నెమ్మదిగా సాధారణ వృద్ధి ఉంటుంది. మరికొన్నిచోట్ల యాక్సిలరేట్‌ వృద్ధి అంటే వేగంగా పెరుగుతుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.

వాటిలో కొనడం లాటరీలాంటిదే

ప్రీలాంచ్‌ పేరుతో వస్తున్న ప్రాజెక్టుల్లో కొనడమంటే లాటరీ కొంటున్నట్లే. చదరపు అడుగు రూ.5వేలు వ్యయం అయ్యేచోట రూ.2500 ఇస్తున్నారంటే లాటరీ కిందనే చూడాలి. అమ్మిన వారిదే కాదు కొనుగోలు చేసిన వారిది కూడా తప్పు. ఇలాంటి వాటిని కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. 

విలువ పెరుగుతుంది

ఇల్లు అత్యవసరమే.. మరి కొనే మార్గమేది? గృహరుణం తీసుకుని మీ బడ్జెట్‌లో ఇల్లు కొనుగోలు చేయండి.  ఇక్కడ మీ జేబు నుంచి చెల్లించే సొమ్ము 10 శాతం మించి ఉండదు. ద్రవ్యోల్బణంతో పడిపోయే రూపాయి విలువతో లాభనష్టాలు ఉంటాయి. గృహ రుణంతో ఇల్లు కొన్నవారికి మాత్రం లాభం. ఎప్పుడూ మీరు లబ్ధి పొందుతున్నట్లే.. ఒకప్పుడు రూ.లక్షకు కొన్న ఇల్లు.. ఈ రోజు రూ.20 లక్షలు ఎందుకు అయింది అంటే ద్రవ్యోల్బణమే. దీన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు  ఇల్లు కొనుగోలుతో సానుకూలంగా మార్చుకోవచ్చు. ఇది కూడా గృహరుణం తీసుకుని కొనుగోలు చేస్తేనే ఈ ప్రయోజనం దక్కుతుంది. అప్పు చేయడం నాకు ఇష్టం లేదు.. నా దగ్గర రూ.50 లక్షలు ఉన్నాయి.. సొంతంగా ఫ్లాట్‌ కొనుగోలు చేస్తాను అంటే ద్రవ్యోల్బణంతో వచ్చే ఫాయిదా పొందలేరు. రూ.40 లక్షలు రుణం తీసుకుని.. రూ.పది లక్షలు సొంతంగా పెట్టుకుంటే... మీరు తీసుకున్న అప్పు మొత్తం ద్రవ్యోల్బణంతో విలువ తగ్గుతుంది.. కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. ఈ రెండింటి మధ్య అంతరం డబుల్‌ అవుతుంది.  ద్రవ్యోల్బణంతో డబుల్‌ ధమాకా అంటే ఇదే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని