ఏ అంతస్తులో మేలు?

అపార్ట్‌మెంట్‌లో ఏ అంతస్తులో తీసుకుంటే మేలు? మొదటిసారి బహుళ అంతస్తుల నివాసాల్లో ఫ్లాట్‌ కొనేవారి మదిలో ఎన్నో సందేహాలు. ఐదు అంతస్తుల్లోనే తేల్చుకోవడం కష్టంగా ఉంటే.. ఇప్పుడు 50 అంతస్తుల్లో ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి.

Published : 18 Feb 2023 01:14 IST

అపార్ట్‌మెంట్‌లో ఏ అంతస్తులో తీసుకుంటే మేలు? మొదటిసారి బహుళ అంతస్తుల నివాసాల్లో ఫ్లాట్‌ కొనేవారి మదిలో ఎన్నో సందేహాలు. ఐదు అంతస్తుల్లోనే తేల్చుకోవడం కష్టంగా ఉంటే.. ఇప్పుడు 50 అంతస్తుల్లో ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. వీటిలో ఏ అంతస్తు ఎంపిక చేసుకోవడం మేలు?  

స్థిరాస్తి కొనుగోలు అంటేనే ఎన్నో అంశాలను పరిశీలించాలి.అందునా బహుళ అంతస్తుల భవనంలో నివాసం అంటే మరెన్నో విషయాలను చూడాలి.కడుతున్న ప్రాంతం.. రవాణావంటి మౌలికవసతులు.. అద్దె ఎంత వస్తుంది.. భవిష్యత్తులో వృద్ధికి ఉన్న అవకాశాలు.. తమ బడ్జెట్‌లో ఉందా లేదా అనే విషయాలను చూడటంతో పాటూ ఏ అంతస్తు ఎంపిక చేసుకోవాలనేది కూడా కొనుగోలుదారుదారుడి కోణంలో ముఖ్యమైందే. ప్రతి దాంట్లోనూ సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని.. కుటుంబ సభ్యుల ఆసక్తులను బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని నిర్మాణరంగ నిపుణులు అంటున్నారు.

కింద..

కొత్తగా నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోన్న శివారు ప్రాంతాల్లో అధికంగా వస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామీణ వాతావరణం ఉంటుంది. ఇటువంటి చోట్ల కింది అంతస్తుల్లోనూ ఎంపిక చేసుకోవచ్చు.

ఇప్పటికే కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన ప్రాంతంలో నిర్మిస్తున్నట్లయితే కింది అంతస్తుల ఎంపికపై వ్యక్తిగత అభిరుచులను బట్టి నిర్ణయం తీసుకోవాలి. చుట్టూ కూడా నిర్మాణాలు ఉంటే గాలి, వెలుతురు పరిమితంగా ఉంటుందని గుర్తించాలి.

  భద్రతాపరంగా, వచ్చిపోయేవారి సందడితో కింది అంతస్తుల్లో కొంత ఇబ్బందిగా ఉంటుంది.

అద్దెకు ఇచ్చేవారు, తరచూ ఇల్లు మారే వారికి సామగ్రి తరలించడం కింది అంతస్తుల్లో సులువు కాబట్టి ఎంపిక చేసుకోవచ్చు.

బాల్కనీల్లో చూస్తే నలుగురు కనిపించడం.. అవసరమైతే అక్కడి నుంచి మాట్లాడే అవకాశం ఉంటేనే కొందరికి సౌకర్యంగా ఉంటుంది. చుట్టూ సందడి ఉండాలని కోరుకుంటుంటారు. ఇలాంటి వారు కింది అంతస్తుల్లో ఎంపిక చేసుకోవచ్చు.

మధ్యన

పైన, కింద తేల్చుకోలేక పోతున్నట్లయితే మరేం ఆలోచించకుండా మధ్య అంతస్తులు ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

సానుకూల, ప్రతికూలం ఏమైనా ఇక్కడ సమంగానే ఉంటాయి.

పై అంతస్తుల్లో..

అత్యంత ఎత్తులో ఉండే పై అంతస్తులో నివసించేవారు బాల్కనీల్లోంచి చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది. చుట్టూ ఉండే పరిసరాలు, పచ్చదనాన్ని అస్వాదించవచ్చు.

గాలి, వెలుతురు ధారాళంగా ఇంట్లోకి వస్తాయి.

పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలు ఉండవు. రాకపోకలు తక్కువే కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది.

పర్యావరణ సమస్యలు ముఖ్యంగా ధ్వని కాలుష్యం ఉండదు. దోమలు ఉండవని చెబుతుంటారు.

పై అంతస్తులో నివసించడం అంటే హోదాగా కూడా చూస్తుంటారు.

టీడీఆర్‌తో ఏంటి ప్రయోజనం...

నగరంలో అభివృద్ధి పనుల కోసం రహదారి విస్తరణలో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఆస్తులను సేకరిస్తోంది. నష్టపరిహారం బదులుగా టీడీఆర్‌ సర్టిఫికెట్లను జారీ చేస్తోంది. వీటిని కొనుగోలు చేసిన వారు అదనపు అంతస్తులు నిర్మించుకోవచ్చు అని చెబుతోంది.

ఏంటీ టీడీఆర్‌?

అభివృద్ధి బదలాయింపు హక్కు(టీడీఆర్‌-ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌) అనేది సర్టిఫికెట్‌ రూపంలో జారీ అయ్యే  పరిహారం.  ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిని సేకరించాల్సి ఉంటే.. ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూ విలువ ప్రకారం.. 400శాతం టీడీఆర్‌ ఇస్తారు. పట్టాభూమి అయితేనే 400శాతం. గ్రామ కంఠం, చెరువు శిఖం, ఇతరత్రా భూములైతే 200శాతం మేర టీడీఆర్‌ అందుతుంది. ధ్రువపత్రం రూపంలో, గజాల లెక్కన జారీ అయ్యే టీడీఆర్‌ను మార్కెట్లో సులువుగా విక్రయించుకోవచ్చు. అందుకోసం జీహెచ్‌ఎంసీలోని నగర ప్రణాళిక విభాగం టీడీఆర్‌ బ్యాంక్‌ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది.

* టీడీఆర్‌ను ఉపయోగించి పరిమితికన్నా ఒకటి లేదా రెండు అంతస్తులను అదనంగా నిర్మించుకోవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మూడు, నాలుగు అంతస్తులకు అనుమతించే విస్తీర్ణంలో.. మరో అంతస్తును అధికారికంగా నిర్మించుకోవచ్చు. ఆరు అంతస్తులు లేదా 2వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఎత్తైన భవనాలైతే.. టీడీఆర్‌తో రెండు అంతస్తులను అదనంగా నిర్మించుకోవచ్చు.

* టీడీఆర్‌ చెల్లుబాటయ్యే పరిధి ఓఆర్‌ఆర్‌(బాహ్య వలయ రహదారి) నుంచి హెచ్‌ఎండీఏ మొత్తానికి విస్తరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని