Updated : 04 Mar 2023 13:26 IST

ఇంటి వేటకు దక్షిణం బాట

శంషాబాద్‌ వైపు రియల్‌ అడుగులు

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ విమానాశ్రయం.. ఏరో సిటీతోపాటు రాబోతున్న మరిన్ని టౌన్‌షిప్‌లు.. పేరున్న విద్యాసంస్థలు.. మెట్రో విస్తరణ.. కొనసాగుతున్న సైకిల్‌ ట్రాక్‌ పనులు.. ఓఆర్‌ఆర్‌ అనుసంధానం.. 40 నిమిషాల్లో ఐటీ కారిడార్‌కు చేరుకునే సౌలభ్యం.. బుద్వేల్‌లో హెచ్‌ఎండీఏ కొత్తగా వేయబోతున్న భారీ లేఅవుట్‌.. హిమాయత్‌సాగర్‌ జలాశయం అందాలు.. కొండలు, పచ్చదనం.. ఈసీ, మూసీ వాగు, కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌.. వంటి హంగులతో హైదరాబాద్‌ సౌత్‌ శంషాబాద్‌ వైపు స్థిరాస్తి రంగం క్రమంగా విస్తరిస్తోంది. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ నుంచి ఒక వైపు కొల్లూరు.. మరోవైపు శంషాబాద్‌ వైపు రియల్‌ ఎస్టేట్‌ విస్తరించేందుకు అవకాశం ఉంటుందనే అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. ఈ అంచనాలు నిజమవుతున్నాయి. శంషాబాద్‌ వైపు క్రమంగా నిర్మాణాలు విస్తరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సోషల్‌ ఇన్‌ఫ్రా మెరుగవుతుండటంతో కొత్త ప్రాజెక్టుల రాక మొదలైంది.

విస్తరిస్తున్నాయ్‌..

నగరంలోని మిగతా అన్ని ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌ సౌత్‌ సిటీకి దగ్గరగా ఉంటుంది. అందుబాటు ఇళ్లకు ఈ ప్రాంతం నిలయంగా ఉంది. అయినా రియల్‌ ఎస్టేట్‌ పరంగా ఇన్నాళ్లు ఆఖర్లో ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగడం, పేరున్న విద్యాసంస్థలు రావడం, మెట్రో వస్తుండటంతో అందరిచూపు అటువైపు మళ్లింది. గచ్చిబౌలి నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఉండే అప్పా, బండ్లగూడ వరకు ఇదివరకే జనావాసాలు వచ్చాయి. ఇక్కడ పలు గేటెడ్‌ కమ్యూనిటీలు ఉన్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి క్రమంగా కిస్మత్‌పూర్‌, బుద్వేల్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ వైపు కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆరాంఘర్‌ నుంచి శంషాబాద్‌ మధ్యలో సాతంరాయి చుట్టుపక్కల బహుళ అంతస్తుల ఆకాశహర్మ్యాల నిర్మాణంలో ఉన్నాయి. బుద్వేల్‌లో 200 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ భారీ లేఅవుట్‌ వేయబోతుంది. దీంతో ఇక్కడ ఐటీ సంస్థలు, ఆకాశహర్మ్యాల భవనాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది.

మెట్రోకి ఆకర్షణీయం..

రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ. ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఈ ప్రాంతం నుంచి వెళ్తుంది. మూడేళ్లలో పూర్తిచేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. గడువుకు కాస్త అటుఇటైనా ప్రాజెక్ట్‌ రావడం పక్కా. దీంతో ప్రజారవాణా మెరుగు అవుతుంది. అప్పా, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌లో స్టేషన్లు రాబోతున్నాయి. వీటి కేంద్రంగా నివాసాలు విస్తరించనున్నాయి. ఇప్పటికే విమానాశ్రయం ప్రాంగణంలో ఏరో సిటీ నిర్మిస్తున్నారు. ఇక్కడ పలు అంతర్జాతీయ సంస్థలు తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆగాఖాన్‌ అకాడమీతోపాటు పేరున్న పది విద్యాసంస్థలు హైదరాబాద్‌ సౌత్‌లో అత్తాపూర్‌ నుంచి బండ్లగూడ, శంషాబాద్‌ వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా దక్షిణం వైపు నివాసాలకు అనువుగా మారుతున్నాయి.  

ఫ్లాట్‌, విల్లాలు..

సిటీకి దగ్గరలో గేటెడ్‌ కమ్యూనిటీల్లో చదరపు అడుగు ఐదారువేల రూపాయల ధరల్లోనే లభిస్తున్న ప్రాంతాల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ ధరలు అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నాయి. పలు విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. ధరలు కూడా మిగతా ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. మెట్రో విస్తరణ, బుద్వేల్‌ లేఅవుట్‌, శంషాబాద్‌ విస్తరణ ప్రణాళికలతో ఇటీవల కాలంలో ధరల్లో కొంత పెరుగుదల కనిపించింది. జీవో 111 పరిధిలో ఎక్కువ భూములు ఉండటంతో అక్కడ ఫామ్‌హోమ్స్‌, వీకెండ్‌ హోమ్స్‌ నిర్మించుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు