ఎంఎంటీఎస్‌తో రియల్‌ ప్రయాణం

ఒకప్పుడు బస్సు డిపో ఆ ప్రాంతానికి వచ్చిందంటే.. ప్రయాణ సౌకర్యముందని భావించి అటువైపు కుదిరితే కొత్త ఇల్లు కొనుక్కోడానికి లేదంటే అద్దెకు వెళ్లేవారు.

Updated : 22 Apr 2023 13:04 IST

రెండోదశ అందుబాటులోకి రావడంతో మరింత వేగంగా..

ఈనాడు, హైదరాబాద్‌: ఒకప్పుడు బస్సు డిపో ఆ ప్రాంతానికి వచ్చిందంటే.. ప్రయాణ సౌకర్యముందని భావించి అటువైపు కుదిరితే కొత్త ఇల్లు కొనుక్కోడానికి లేదంటే అద్దెకు వెళ్లేవారు. అలా నగర శివార్లలో ఏర్పడిన డిపోల చుట్టూ నివాస ప్రాంతాలు వెలిశాయి. ఉదాహరణకు చెంగిచెర్ల, కుషాయిగూడ, హెచ్‌సీయూ, మియాపూర్‌ ఇలా పలు డిపోలతో నగరం విస్తరించింది. ఇప్పుడా డిపోలు నగర విస్తరణతో మధ్యలోకి వచ్చేసినట్టయ్యాయి. శివార్లలో డిపోలు రాకపోయినా.. సొంత వాహనాలు, ఇతర రవాణా సౌకర్యాలు ఉండడంతో నగర విస్తరణ జోరుగా సాగుతోంది. మెట్రో రాకతో నగరంలో ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా సులువయిపోయింది. వీటన్నిటికి తోడు ఎంఎంటీఎస్‌ పరుగులతో.. ఆయా ఎంఎంటీఎస్‌ స్టేషన్ల పరిసర ప్రాంతాల వారికి ప్రయాణవనరు లభించినట్లయింది. ఇటీవల ఎంఎంటీఎస్‌ రెండోదశ అందుబాటులోకి రావడంతో ఆయా స్టేషన్ల పరిధిలో వేరే ఆలోచన లేకుండా సొంత ఇంటికోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిదే స్థిరాస్తి రంగం నగరం నలువైపులా విస్తరించేందుకు అవకాశాలు కల్పించినట్లయింది.

మేడ్చల్‌ను చేరువ చేసి..

సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌కు వెళ్లాలంటే గతంలో దూరంగా అనిపించేది. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా మేడ్చల్‌- సికింద్రాబాద్‌ మధ్య 20 ఎంఎంటీఎస్‌ సర్వీసులు తిరగుతుండడంతో ఆ ప్రాంత ప్రజలకు ఎంతో ఊరట లభించింది. దీంతో అటువైపు ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారు మరో ఆలోచన చేయకుండా సొంతింటి కల సాకారం చేసుకుంటున్నారు. పడమరవైపు ఐటీకి చేరువలో ధరలు ఎక్కువ ఉండడంతో ఇప్పుడు నగరానికి ఉత్తరం వైపు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా ఇప్పటికే మేడ్చల్‌ నుంచి ప్రయాణ వనరు లభించగా.. త్వరలో మౌలాలి - సనత్‌నగర్‌ మధ్య ప్రత్యేక లైనుతో ఐటీ సెక్టార్‌కు మరింత దగ్గర మార్గం ఏర్పడుతోంది.

సికింద్రాబాద్‌ నుంచి మొదలు పెడితే లాలాగూడ, మల్కాజిగిరి, దయానందనగర్‌, సఫిల్‌గూడ, ఆర్‌కేపురం, అమ్ముగూడ, కేవర్లీ బ్యారక్స్‌, అల్వాల్‌, బొల్లారం, గుండ్ల పోచంపల్లి, గౌడవల్లి, మేడ్చల్‌ ఇలా 12 స్టేషన్లు.. 28 కిలోమీటర్ల మేర నగర ప్రజలకు చౌక ప్రయాణం అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. అలాగే దక్షిణం వైపు ఫలక్‌నుమా తర్వాత శివరాంపల్లి, బుద్వేల్‌, ఉందానగర్‌ స్టేషన్లు.. 20 ఎంఎంటీఎస్‌ సర్వీసులు అందుబాటులోకి రావడంతో ప్రయాణసౌకర్యం లభించినట్లయింది. శంషాబాద్‌ పరిసరాల్లో సొంత ఇల్లు కొనుగోలు చేయాలకనుకునే వారికి కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఎంఎంటీఎస్‌ అందుబాటులోకి రావడంతో అటువైపు సొంతింటి కల సాకారం చేసుకునే అవకాశం లభించింది. బొల్లారం స్టేషన్‌కు రీసాల్‌బజార్‌, హకీంపేట పరిసరాల వారు సులభంగా చేరుకోవచ్చు. కొంపల్లి, అల్వాల్‌, లోతుకుంట, సైనిక్‌పురి తదితర ప్రాంతాల వాళ్లు మేడ్చల్‌కు ఎంఎంటీఎస్‌ సేవలు అందుబాటులోకి రావడంతో సులభంగా ప్రయాణించే మార్గం ఏర్పడింది.

ఘట్‌కేసర్‌ వరకు..

ఎంఎంటీఎస్‌ మొదటి దశ 46 కిలోమీటర్లు కాగా రెండో దశ 100 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్‌ రెండోదశలో భాగంగా 51 కిలోమీటర్ల మేర ప్రజారవాణా అందుబాటులోకి వచ్చింది. జనవరి నాటికి 100 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్‌లు పరుగులు పెడితే.. ఇక తిరుగుండదు. సికింద్రాబాద్‌ కేంద్రంగా అటు ఘట్‌కేసర్‌, ఇటు మేడ్చల్‌, మరోవైపు ఉందానగర్‌, తెల్లాపూర్‌ ఇలా మొత్తం 146 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్‌ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. మొదటి దశలో 26 స్టేషన్లు ఉండగా.. రెండో దశలో మరో 30 స్టేషన్ల వరకూ అందుబాటులోకి వస్తాయి.

విస్తరణతో మరింత జోరు..

ఎంఎంటీఎస్‌ రెండో దశ తర్వాత మూడో దశ అంటారా.. పేరు ఏదైనా కానీ.. ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రికి 33 కిలోమీటర్లు, ఉందానగర్‌ నుంచి షాద్‌నగర్‌కు 31 కిలోమీటర్లు, మేడ్చల్‌ నుంచి తూప్రాన్‌కు 21 కిలోమీటర్లు, తెల్లాపూర్‌ నుంచి రావులపల్లికి 21 కిలోమీటర్లు, యాదాద్రి నుంచి జనగామకు 32 కిలోమీటర్లు, షాద్‌నగర్‌ నుంచి జడ్చర్లకు 24 కిలోమీటర్లు, రావులపల్లి నుంచి వికారాబాద్‌కు 24 కిలోమీటర్లు, బీబీనగర్‌ నుంచి నల్గొండకు 72 కిలోమీటర్లు.. ఇలా 2041 వరకూ విస్తరించాలనే ప్రాథమిక ప్రణాళికలు రూపుదిద్దుకుంటే రియల్‌ఎస్టేట్‌ రంగానికి మరింత ఊతమిచ్చినట్లవుతుంది. అమెరికాలో మాదిరిగా దూరం ఎంతైనా పర్వాలేదు.. ప్రశాంతమైన నిలయాల్లో నగరవాసులు నివసించడానికి అవకాశం ఏర్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని