నిర్మాణ ఒప్పందాలకు బీమాతో ధీమా

ఒక బహళ అంతస్తుల గృహ సముదాయం నిర్మించాలంటే వందల సంఖ్యలో పనులు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పనిని ఒక్కో సంస్థకో, గుత్తేదారుకో అప్పగిస్తారు.

Updated : 22 Apr 2023 02:19 IST

కొవిడ్‌ అనంతరం చిన్న బిల్డర్లు సైతం ఈ దిశగా అడుగులు

ఈనాడు, హైదరాబాద్‌: ఒక బహళ అంతస్తుల గృహ సముదాయం నిర్మించాలంటే వందల సంఖ్యలో పనులు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పనిని ఒక్కో సంస్థకో, గుత్తేదారుకో అప్పగిస్తారు. సెల్లార్‌ తవ్వకం మొదలు.. గోడల నిర్మాణం, ప్లాస్టరింగ్‌, షట్టరింగ్‌, విద్యుత్తు, కరెంట్‌, లిఫ్ట్‌ వరకు అనుభవం, నైపుణ్యం కల్గిన ఏజెన్సీలతో చేయిస్తుంటారు. ఇంత సంక్షిష్టత నడమ నిర్మాణ ఒప్పందాలు, కార్యకలాపాలు సాగుతుంటాయి. మొత్తంగా ఒక్కో ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి మూడు నుంచి ఐదేళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలో ఎదురయ్యే ఒడిదుడుకులు.. ఆర్థిక నష్టం నుంచి రక్షణగా ఒప్పందాలను నిర్మాణసంస్థలు బీమా చేయిస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియనే అయినా కొవిడ్‌ తర్వాత ఊపందుకుంది. కొవిడ్‌ లాక్‌డౌన్‌, అనంతర పరిణామాలతో చాలా మంది బిల్డర్లు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. పెద్ద బిల్డర్లలో కొందరికి కరోనా అనంతర పరిస్థితులు కలిసిరాగా, చిన్న బిల్డర్లను చిదిమేసింది. ఈ తరహా అనుకోని అనుభవాలతో ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపించకుండా ముందు జాగ్రత్తగా బీమా చేస్తున్నారు. పెద్ద బిల్డర్లు ఈ పోకడను ఇదివరకే అందిపుచ్చుకున్నారు. వేటికి ఎక్కువ బీమా చేయిస్తున్నారంటే..

ఆల్‌ రిస్క్‌ పాలసీ..

నిర్మాణ పనుల్లో ఉపయోగించే సామగ్రికి నష్టం వాటిల్లితే ఈ పాలసీ పరిహారం చెల్లిస్తుంది. పనులు జరుగుతున్నంత కాలం వర్తించేలా బీమా చేయించుకోవచ్చు.

ఎంప్లాయర్స్‌ లయబులిటీ(ఈఎల్‌) బీమా

ఉద్యోగులు, కార్మికులు నిర్మాణ సమయంలో ప్రమాదం బారిన పడినా, అనారోగ్యం పాలైనా, గాయపడినా, మరణిస్తే ఈఎల్‌ బీమా వర్తిస్తుంది. వార్షిక ప్రాతిపాదికన బీమా జారీ చేస్తారు.  

మరిన్ని.. : ఎన్విరాన్‌మెంటల్‌, పబ్లిక్‌ లయబులిటీ తదితర బీమాలను నిర్మాణ సంస్థలు చేయిస్తున్నాయి. ప్రధానంగా ఏడెనిమిది రకాల పాలసీలు చేయిస్తున్నాయి.

ఒప్పందాల్లోనూ  మార్పులు...

సాంకేతికతతో నిర్మాణ రంగంలో పెరిగిన వేగం, ఆధునికతతో ఒప్పందాల్లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నారు. సంప్రదాయ ఒప్పందాలతో పాటు వినూత్న ఒప్పందాలు ఆచరణలోకి వచ్చాయి.

* సంప్రదాయ విధానంలో నిర్మాణదారులు అనుభవం, నైపుణ్యం ఆధారంగా పనులవారీగా గుత్తేదారులకు కాంట్రాక్ట్‌ ఇస్తారు. గడువు లోపల పూర్తి చేస్తే బిల్లులు జారీ చేస్తుంటారు.  

* డిజైన్‌ బిల్డింగ్‌ ఒప్పందాలు కూడా ఈ మధ్య పెరిగాయి. ప్రాజెక్ట్‌కు సంబంధించి సవివరణమైన డిజైన్‌ ఇవ్వడంతో పాటు నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంటుంది. కొత్త బిల్డర్లు రిస్క్‌ లేకుండా ఎక్కువగా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకు నిర్మాణం వరకు అప్పగిస్తున్నారు. పెద్ద సంస్థలు కావడంతో ఒప్పందాలు.. వాటి నుంచి రక్షణ కోసం బీమా చేయిస్తున్నారు.

* నిర్మాణ రంగంలో ఎన్నోరకాల సామగ్రిని వినియోగించాల్సి ఉంటుంది. వీటి కొనుగోలు, నాణ్యత పరిశీలనతో పాటు మరెన్నో అంశాలు ఉంటాయి. నిర్వహించడం కష్టం. అందుకే అనుభవం కల్గిన మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను పూర్తిగా వీరే చూసుకుంటున్నారు.

* డిజైన్‌తో మొదలు మేనేజ్‌మెంట్‌, నిర్మాణం మూడూ ఒకటే సంస్థ చూసేలా కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈపీసీ కాంట్రాక్టులు తెలిసివే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని