శ్రామికనైపుణ్యం.. నిర్మాణ రంగానినికి ప్రాణం

నిర్మాణ రంగం రెండో అతిపెద్ద ఉపాధి కల్పన రంగంగా ఉంది. గతేడాది నాటికే ఈ రంగంపై ఆధారపడిన కార్మికుల సంఖ్య 7.5 కోట్లుగా ఉంది.

Published : 29 Apr 2023 02:58 IST

నాణ్యత మెరుగు.. వృథాకుఅడ్టుకట్ట

నిర్మాణ రంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.. టెక్నాలజీ పాత్ర పెరిగింది.. చుక్కలను తాకేలా 60అంతస్తుల వరకు ప్రాజెక్టులు చకచకా కడుతున్నారు. స్ట్రక్చరల్‌ డిజైన్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. సంప్రదాయ నిర్మాణం స్థానంలో మైవాన్‌ టెక్నాలజీ, స్టీల్‌ స్ట్రక్చర్‌ వరకు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. నాణ్యతలో రాజీ లేకుండా.. ప్రమాదాలకు తావులేకుండా ఉండాలంటే ప్రాజెక్ట్‌ డెవలపర్‌ దగర్నుంచి ఇంజినీర్లు, కార్మికుల వరకు నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిందే. పై స్థాయిలో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లను నియమించుకుంటుండగా.. కింది స్థాయిలో ఉన్న కార్మికులు, మధ్యస్థాయిలోని ఉద్యోగులకు పని ప్రదేశంలో శిక్షణిస్తున్నారు. ఇందుకోసం రూ.లక్షల్లో ఖర్చు చేస్తే.. ప్రాజెక్టుల్లో రూ.కోట్లలో ఆదా అయ్యే అవకాశం ఉండటంతో పని ప్రదేశాల్లో శిక్షణ ఇప్పించేందుకు నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ రంగం రెండో అతిపెద్ద ఉపాధి కల్పన రంగంగా ఉంది. గతేడాది నాటికే ఈ రంగంపై ఆధారపడిన కార్మికుల సంఖ్య 7.5 కోట్లుగా ఉంది. అయితే నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఈ రంగాన్ని వేధిస్తోంది. కూలిపనికి వచ్చి చూసి నేర్చుకోవడమే తప్ప శాస్త్రీయంగా శిక్షణ అందించే సంస్థలు పెద్దగా లేవు. హైదరాబాద్‌లో న్యాక్‌ వంటి సంస్థలో ఏటా వందల మంది శిక్షణ పొందుతున్నా.. మార్కెట్‌కు అవసరమైన వారి సంఖ్య లక్షల్లో ఉంది. హైదరాబాద్‌లోని నిర్మాణాల్లోనే 4 లక్షల మంది వరకు వేర్వేరు ప్రాంతాల నుంచి పనిచేస్తున్నారు. స్థిరాస్తి సంఘాలతో కలిసి స్థానికులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జాతీయ అవసరాల దృష్ట్యా కేంద్రం గతేడాది శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా వచ్చే పదేళ్లలో 4.5 కోట్ల నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉందని గుర్తించిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డీసీ)తో కలిసి గతేడాది జూన్‌ 21 నిపుణ్‌ను ప్రారంభించింది. నిర్మాణ రంగంలో నరెడ్కో తెలంగాణ వంటి పరిశ్రమ భాగస్వాములు... మౌలిక సదుపాయాల సామగ్రి, ప్లంబింగ్‌ వంటి సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌(ఎస్‌ఎస్‌సీ)ల ద్వారా ఏడాదిలో లక్ష మంది కార్మికులకు శిక్షణ ఇవ్వడం లక్ష్యం.


శిక్షణ ఎవరికి

* 18 నుంచి 45 ఏళ్ల వయసు లోపున్న కార్మికులకు.
* సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ పేర్కొన్న ఉద్యోగాలకు.
* కింది స్థాయి కార్మికులకు నైపుణ్యాలు పెంపొందించి తదుపరి దశకు తీసుకెళ్లేలా శిక్షణ.
* కార్మికులు, సిబ్బంది చేసే ఉద్యోగాల ప్రాధాన్యం గురించి అవగాహన, అధునాతన నైపుణ్యాల శిక్షణ, సాఫ్ట్‌ స్కిల్స్‌.
* పని ప్రదేశాల్లో ప్రమాదాలను తగ్గించేందుకు భద్రతా అంశాలపై సన్నద్ధం చేయడం.
* మూడేళ్ల పాటు ఉచిత ప్రమాద బీమా రక్షణ.


బిల్డర్‌కు ప్రయోజనాలు

* కార్మికుల మెరుగైన సామర్థ్యం, వ్యక్తిగత ఆరోగ్యం, భద్రత గురించిన జ్ఞానంతో ఉత్పాదకత పెరుగుతుంది.
* నిర్మాణంలో నాణ్యతతో సమయం, డబ్బు, వనరుల వృథా తగ్గుతుంది.


ఏడాదిలో 25 ప్రాజెక్టుల్లో శిక్షణ

నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంపొందించుకుంటే నాణ్యమైన ప్రాజెక్టులను చేపట్టవచ్చు. ఇదివరకు ఐదు అంతస్తులు కట్టేవాళ్లం. యాభై అంతస్తులను సైతం ఇలాగే కడతామంటే సాధ్యం కాదు. నాణ్యతాపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్మికుల భద్రత కూడా ముఖ్యం. వృథాను తగించాలి. చిన్న ప్రాజెక్టులో 10 శాతం వృథా అంటే ఫర్యాలేదు. అదే యాభై అంతస్తుల ప్రాజెక్టుల్లో ఈస్థాయిలో వృథా చేస్తే ప్రాజెక్టువ్యయం అదుపు తప్పుతుంది. పైగా ఇదంతా జాతి సంపద.  సాధారణంగా చిన్న ప్రాజెక్టుల్లో గోడలు కట్టాక కిటికీల కొలతలు తీసుకుంటారు. పెద్ద ప్రాజెక్టుల్లో అన్ని కిటికీల కొలతలు ఒకేలా ఉండేలా ఆర్డర్‌ ఇస్తారు. కట్టేటప్పుడు అంత కచ్చితత్వంతో నిర్మాణం చేపట్టాలి. వీటన్నింటిపై అవగాహనతో పాటు తగిన శిక్షణ అవసరం. ఎన్‌ఎస్‌డీసీతో కలిసి నరెడ్కో తెలంగాణ ఏడాదిలో 25 ప్రాజెక్టుల్లో కార్మికులకు నిపుణ్‌తో నైపుణ్యాలు పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సైట్‌లోనే శిక్షణ ఉంటుంది. పని ప్రదేశంలో కమిటీ పరిశీలించి మొదటి దశలో కొందరు సూపర్‌వైజర్‌ స్థాయి వ్యక్తులను ఎంపిక చేసుకుని వారికి శిక్షణ ఇస్తుంది. రోజు గంట పాటు పదిరోజుల శిక్షణ ఉంటుంది.

ఎం.విజయ్‌సాయి, ప్రధాన కార్యదర్శి, నరెడ్కో తెలంగాణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు