అలాంటి సందర్భాల్లో.. అద్దె ఆదాయం కాదు

పాత భవంతులను నేలమట్టం చేసి కొత్తవి నిర్మించేందుకు మూడేళ్ల సమయం పడుతుంది. నిర్మాణం పూర్తయ్యే వరకు మరో చోట నివాసం ఉండేందుకు నెలవారీ అద్దెను బిల్డర్‌ చెల్లిస్తుంటారు.

Published : 29 Apr 2023 02:58 IST

స్థిరాస్తులను అభివృద్ధికి ఇచ్చి కిరాయి పొందుతున్న వారికి ఊరట
ముంబయి ఆదాయ పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ తీర్పు

నగరాల్లో పాత ఇళ్లను కూల్చేసి కొత్త భవంతులను నిర్మించేందుకు డెవలప్‌మెంట్‌కి ఇస్తుంటారు. కొత్త ఇళ్లు సైతం నేలమట్టం చేసి అపార్ట్‌మెంట్లు కట్టేందుకు ఇస్తున్నారు. ఇందుకోసం స్థలం, ఫ్లాట్‌ యజమానులతో బిల్డర్‌ ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభిస్తారు. నిర్మించే ఫ్లాట్లలో చెరి సగం అని, కొంత నగదు ఇస్తామని, నిర్మాణం పూర్తయ్యే వరకు అద్దె సైతం చెల్లిస్తామని.. ఇలా ఇరు పార్టీల మధ్య, అక్కడ స్థలానికి ఉన్న డిమాండ్‌ను బట్టి ఒప్పందాలు చేసుకుంటారు. తమ ఆస్తిని వదులుకునే ఫ్లాట్‌ యజమానులు స్వీకరించే అద్దె.. అదాయం అవుతుందా? లేదంటే మూలధనంగా చూడాలా? దీనిపైనే వివాదం నెలకొనడంతో కొందరు ముంబయిలోని ఆదాయ పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా.. అలాంటి సందర్భాల్లో అద్దె ఆదాయ మార్గం కాదని తీర్పు చెప్పింది.

పాత భవంతులను నేలమట్టం చేసి కొత్తవి నిర్మించేందుకు మూడేళ్ల సమయం పడుతుంది. నిర్మాణం పూర్తయ్యే వరకు మరో చోట నివాసం ఉండేందుకు నెలవారీ అద్దెను బిల్డర్‌ చెల్లిస్తుంటారు. సముద్రం కారణంగా ముంబయి సిటీ హైదరాబాద్‌ మాదిరి నలువైపులా విస్తరించేందుకు అవకాశం లేదు. దీంతో ఉన్న స్థలాల్లోనే భవనాలు నిర్మించాల్సి ఉంటుంది. ఎప్పుడో యాభై, అరవై ఏళ్ల క్రితం తక్కువ అంతస్తుల్లో కట్టిన అపార్ట్‌మెంట్లను కూల్చి ఇప్పుడు ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారు. స్థల డిమాండ్‌ దృష్ట్యా పాత ఫ్లాట్‌కు కొత్త ఫ్లాట్‌తో పాటూ నిర్మాణం పూర్తయ్యేవరకు అద్దె సైతం చెల్లించేలా అక్కడ ఒప్పందాలు ఉన్నాయి. ఈ విధంగా పెద్ద ఎత్తున డెవలప్‌మెంట్‌ ఇచ్చిన స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇలా 2013లో ముంబయికి చెందిన అజయ్‌ తమ హౌసింగ్‌ సొసైటీని బిల్డర్‌కు అభివృద్ధి చేసేందుకు ఇచ్చారు. దీంతో బిల్డర్‌ నుంచి రూ.3.7 లక్షలు అద్దె అందుకున్నారు. ఈ డబ్బును అద్దె చెల్లించేందుకు ఉపయోగించకుండా తన తల్లిదండ్రుల ఇంటికి మారారు. దీంతో  ఆదాయ పన్ను శాఖ కంప్యూటర్‌ ఆధారిత పరిశీలనలో ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయంగా పరిగణించి.. ఆ మేరకు వర్తించే స్లాబ్‌ రేటు ప్రకారం ఆదాయపన్ను విధించినట్లు అసెస్‌మెంట్‌ అధికారి తెలిపారు. దీనిపై ఆదాయపన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో ఆయన అప్పీల్‌ చేశారు. ఇల్లు తరలింపు కారణంగా అనేక సర్దుబాట్లు చేయాల్సి వచ్చిందని.. అద్దెను ఆదాయంగా పరిగణించేందుకు అర్హత లేదని తీర్పు చెప్పింది. చెల్లింపుదారు అందుకున్న పరిహారం రెవెన్యూ కాదని మూలధనంగా చూడాలని అంతకుముందు డెలిలారాజ్‌ మున్సుఖాని, ఆదాయ పన్ను కార్యాలయ కేసులోనూ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ పేర్కొంది.  

ఈనాడు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని