గ్రిడ్ రహదారులతోనే.. ఔటర్ చుట్టూ మహర్దశ
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ స్థిరాస్తి మార్కెట్ వృద్ధికి గ్రిడ్‌రోడ్లు కీలకం కానున్నాయి. ప్రస్తుతం ఔటర్ చుట్టూ లేఅవుట్లు పుట్టుకొస్తుండటంతో గ్రిడ్ రోడ్ల నిర్మాణంపై హెచ్‌ఎండీఏ ఆలోచన చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రతి అర కిలోమీటర్‌కు నిర్మాణానికి అవకాశం
అందుకు అనుగుణంగా గ్రోత్‌కారిడార్ మాస్టర్‌ప్లాన్
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ స్థిరాస్తి మార్కెట్ వృద్ధికి గ్రిడ్‌రోడ్లు కీలకం కానున్నాయి. ప్రస్తుతం ఔటర్ చుట్టూ లేఅవుట్లు పుట్టుకొస్తుండటంతో గ్రిడ్ రోడ్ల నిర్మాణంపై హెచ్‌ఎండీఏ ఆలోచన చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిధుల సమస్యతో ఇన్నాళ్లు గ్రిడ్‌రోడ్లు చేపట్టలేదు. ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లకు లీజు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి సమకూరనున్న రూ.7,380 కోట్లకు పైగా ఆదాయాన్ని గ్రిడ్ రహదారుల అభివృద్ధికి వ్యయం చేయాలని స్థిరాస్తి వర్గాలు సూచిస్తున్నాయి.
ఈనాడు, హైదరాబాద్:
నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర రింగ్‌రోడ్డు విస్తరించి ఉంది. ఈ రహదారికి రెండు వైపులా నాలుగు లైన్లలో సర్వీసు రోడ్లు ఉన్నాయి. ఈ సర్వీసు రహదారులకు ఇరువైపులా అటు ఇటు కిలోమీటరు మేరకు గ్రోత్‌కారిడార్‌గా హెచ్‌ఎండీఏ ప్రకటించింది. దీనికి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్రణాళిక ప్రకారమే ఇక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇస్తారు. ఇందులో గ్రిడ్‌రోడ్లు అత్యంత కీలకమైనవి.
ప్రస్తుతం లేక.. : సర్వీసు రహదారి నుంచి ప్రతి అరకిలోమీటర్ పరిధిలో ఈ గ్రిడ్ రోడ్లు సమాంతరంగా ఉంటాయి. ఇలా 158 కిలోమీటర్ల పొడవునా...రెండు వైపులా గ్రిడ్‌రోడ్ల కోసం మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చారు. ప్రస్తుతం మహానగరం శరవేగంగా విస్తరిస్తున్న దరిమిలా అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో వందల సంఖ్యలో లేఅవుట్లు వెలుస్తున్నాయి. చాలా వెంచర్లకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం పెద్ద సమస్యగా మారుతోంది. గ్రిడ్ రోడ్లు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఔటర్ సర్వీసు రోడ్లకు ఈ అప్రోచ్ రహదారులను కలిపేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అడ్డదిడ్డంగా సర్వీసు రహదారులకు వీటిని కలపవద్దని హెచ్‌ఎండీఏ అధికారులు సూచిస్తున్నారు. ప్రణాళికయుతమైన అభివృద్ధికి ఇవి ఆటంకంగా మారతాయన్నారు. ఇప్పటికే మాస్టర్‌ప్లాన్‌లో గ్రిడ్ రోడ్లకు తగిన ప్రాంతాలను సూచిస్తూ మార్కింగ్ చేశారు. వాటికి భిన్నంగా అప్రోచ్ రహదారులు వస్తే.. ఇవి ఆటంకంగా మారతాయి. అంతేకాక వీటిని అధికారికంగా గుర్తించే వీలు ఉండదు. భవిష్యత్తులో వీటి అభివృద్ధి కూడా సాధ్యం కాదని చెబుతున్నారు.
78 వేల ఎకరాలు అందుబాటులోకి.. : గత కొన్నేళ్లుగా ఓఆర్‌ఆర్ చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైంది. కొత్తగా నివాస ప్రాంతాలతోపాటు వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఇలా అన్ని దాని ఇరువైపులా ఏర్పాటు అవుతున్నాయి. రింగ్‌రోడ్డు చుట్టూ వేలాది ఎకరాలు అందుబాటులో ఉండటంతో భారీ స్థిరాస్తి ప్రాజెక్టులు ఇతర కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. సర్వీసు రోడ్లకు సమాంతరంగా గ్రిడ్‌రోడ్డు లేకపోవడం వల్ల ప్రస్తుతం వేలాది ఎకరాలు భూములు ఉన్నా సరే అందుబాటులోకి రావడం లేదు. ఆసక్తి ఉన్న సంస్థలు మాత్రం సొంత భూముల్లో హెచ్‌ఎండీఏ అనుమతులతో గ్రిడ్ రోడ్లను తామే నిర్మించుకుంటున్నాయి.
* ఔటర్‌కు అటు ఇటు కిలోమీటరు మేరకు గ్రోత్‌కారిడార్ కింద హెచ్‌ఎండీఏ పరిగణిస్తోంది. ఈ లెక్కన 158 కి.మీ. రహదారి చుట్టూ లెక్కిస్తే.. 316 చదరపు కిలోమీటర్ల ప్రాంతం గ్రోత్‌కారిడార్ కిందకు వస్తుంది. అంటే దాదాపు 78,086 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లే. గ్రిడ్ రోడ్ల నిర్మాణంతో ఈ భూమి అంతటిని ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం చేసే వీలుందని, స్థిరాస్తి మార్కెట్ అభివృద్ధికి ఇదో కీలకమైన ప్రణాళిక అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రణాళికాయుతమైన అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని పేర్కొంటున్నారు.
* ఔటర్ తర్వాత ప్రాంతీయ వలయ రహదారి వస్తోంది. ఈ నేపథ్యంలో సర్వీసు రోడ్లే కాకుండా గ్రిడ్ రోడ్ల ప్రాధాన్యం ఇంకా పెరగనుంది. పెద్ద పెద్ద వెంచర్ల కోసం కొన్ని స్థిరాస్తి సంస్థలు మాస్టర్‌ప్లాన్ ప్రకారం గ్రిడ్ రోడ్లను నిర్మిస్తున్నాయి. ఔటర్ చుట్టూ ప్రైవేటు భూములే. గ్రిడ్‌రోడ్లు నిర్మించాలంటే భూసేకరణ పెద్ద ఇబ్బందిగా మారుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అవసరమైన చోట తొలుత వీటిని హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేయాలని ప్రణాళిక రచిస్తోంది. ఇటీవల అవుటర్‌రింగ్ రోడ్డును 30 ఏళ్ల పాటు రూ.7,380 కోట్లకు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. సదరు సంస్థ ఈ నిధులన్ని ఏక మొత్తంలో జమ చేయనుంది. ఈ నేపథ్యంలో ఔటర్ చుట్టూ గ్రిడ్ రోడ్లు, సమాంతర రహదారులకు నిధులు కూడా పెద్ద సమస్య కాదని అంటున్నారు.
మార్కెట్ వృద్ధికి ఇవే ఊతం..
ఇప్పటికే ఔటర్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి మార్కెట్ వృద్ధికి ఊతం ఇస్తున్నాయి. మంచినీటి సరాఫరా కోసం గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటి తరలింపు కోసం ఔఆర్‌ఆర్ చుట్టూ రింగ్‌మెయిన్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా 40 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. ఔటర్ ఫేజ్-1, 2 ప్రాజెక్టుల ద్వారా ఆయా ప్రాంతాలకు తాగునీటిని అందించనున్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి రింగ్‌రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు త్వరలో మెట్రో రూపుదిద్దుకోనుంది. ఓఆర్‌ఆర్‌కు నాలుగు ప్రాంతాల్లో రైల్వే మార్గాలు అనుసంధానమై ఉండగా... కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. ఔటర్‌లో 23 కిలోమీటర్ల మేర సైకిల్‌ట్రాక్ రూపుదిద్దుకుంటోంది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. తొలి దశలో బాటసింగారం, మంగల్‌పల్లిలో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు భారీ షెడ్డు, గోదాములు నిర్మాణాలు చేపడుతున్నారు. అక్కడ నుంచి నగరానికి సరకు రవాణా జరగనుంది. నగరం నుంచి ఔటర్‌పైకి చేరేందుకు ఇప్పటికే 32 రేడియల్ రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో పది వరకు పూర్తి చేశారు. గ్రిడ్‌రోడ్ల నిర్మాణంతో ఓఆర్‌ఆర్ పరిధిలో మరింత అభివృద్ధికి ఆస్కారం కలగనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
-
Festival Sale: పండగ సేల్‌లో ఫోన్ కొంటున్నారా? మంచి ఫోన్ ఎలా ఎంచుకోవాలంటే..
-
Mansion 24 Trailer: ఆ భవంతిలోకి వెళ్లిన వారందరూ ఏమయ్యారు: ‘మాన్షన్ 24’ ట్రైలర్