వీధుల్లో విహారం..మాల్స్‌లో వినోదం

రియల్‌ ఎస్టేట్‌లో అపార్ట్‌మెంట్లు, విల్లాల తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే వాటిలో వాణిజ్య భవనాలు మొదటిస్థానంలో ఉంటాయి. వీటి నిర్మాణంలో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. మారుతున్న షాపింగ్‌ తీరుతెన్నులకు సిటీలో నిర్మిస్తున్న మాల్స్‌ అద్దం పడుతున్నాయి. వీటిలో ఎక్కువగా మల్టీప్లెక్స్‌లు, దుకాణాలు, షోరూంలను నిర్వహిస్తున్నారు.

Published : 13 May 2023 04:05 IST

రియల్‌ ఎస్టేట్‌ రిటైల్‌ నిర్మాణంలో వేగంగా మార్పులు
ఈనాడు, హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌లో అపార్ట్‌మెంట్లు, విల్లాల తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే వాటిలో వాణిజ్య భవనాలు మొదటిస్థానంలో ఉంటాయి. వీటి నిర్మాణంలో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. మారుతున్న షాపింగ్‌ తీరుతెన్నులకు సిటీలో నిర్మిస్తున్న మాల్స్‌ అద్దం పడుతున్నాయి. వీటిలో ఎక్కువగా మల్టీప్లెక్స్‌లు, దుకాణాలు, షోరూంలను నిర్వహిస్తున్నారు. ఇక హైస్ట్రీట్‌ నిర్మాణాల్లో దేశంలోనే మనకు రెండోస్థానం దక్కింది. సిటీలో ఇదివరకు వాణిజ్య సముదాయాలు మాత్రమే కన్పించేవి. రహదారి పక్కన సంప్రదాయ శైలిలో విశాలమైన కాంప్లెక్స్‌లు నిర్మించేవారు. నగరవ్యాప్తంగా ప్రధాన రహదారుల పక్కన ఎక్కడ చూసినా మనకు కన్పించేవి ఇవే. నిర్వహణ వ్యయం తక్కువ కావడం వీటిలోని సానుకూల అంశం. వీటిని నాన్‌ మోడర్న్‌ రిటైల్‌గా పరిశ్రమ వర్గాలు వర్గీకరిస్తున్నాయి. కొత్తగా వస్తున్న మాల్స్‌ను ఆధునిక రిటైల్‌గా పేర్కొంటున్నాయి. వీటిలో రిటైల్‌ స్పేస్‌ పెరగడం వేగంగా వస్తున్న మార్పులకు నిదర్శనం.

వినోదపరంగా.. : సినిమా చూడటం.. హాల్‌లోంచి బయటకి రాగానే ఆకలిస్తే అక్కడే కడుపు నిండా ఆరగించడం.. ఇంటికెళుతూ షాపింగ్‌ చేయడం.. పిల్లలుంటే గేమ్‌జోన్‌లో వారి కోసం కొంత సమయం కేటాయించడం.. ఇవన్నీ మాల్స్‌లో ఒకచోటనే జరిగిపోతున్నాయి. పార్కింగ్‌ ఏర్పాట్లు ఉండే ప్రాంతంలోనే షాపింగ్‌కు వచ్చేవారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కారణంగానే నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నింటిలో మాల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో విదేశీ సంస్థలు పెద్దఎత్తున పెట్టుబడి పెడుతున్నాయి. కూకట్‌పల్లి వైజంక్షన్‌లో 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్‌ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఏకంగా 12 స్క్రీన్లు వస్తున్నాయి. కర్మన్‌ఘాట్‌లోనూ అతి పెద్ద మాల్‌ పూర్తికావొచ్చింది. 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇక్కడ సైతం 11 స్క్రీన్లు వస్తున్నాయి. ఏకకాలంలో 2700 మంది ఇక్కడ సినిమా చూడొచ్చు. ఈ తరహాలో మోడర్న్‌ రిటైల్‌ స్పేస్‌ పెరుగుతోంది.


అద్దెలు  అ‘ధర’గొడుతున్నాయ్‌..

ఆధునిక మాల్స్‌ నిర్మాణానికి భారీగా వ్యయం చేస్తున్నారు. సిటీలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఒక మాల్‌ అంచనా వ్యయం రూ.250 కోట్లు. నిర్మాణ వ్యయం పెరగడంతో అన్ని ఖర్చులూ పెరుగుతాయి. వీటి నిర్వహణ వ్యయం కూడా ఎక్కువే. మాల్‌ గ్రేడింగ్‌నుబట్టి కూడా ఇది మారుతుంది. సహజంగానే వీటిలో అద్దెలు అ‘ధర’హో అన్పిస్తున్నాయి. ప్రాంతాలనుబట్టి, సందర్శకుల తాకిడినిబట్టి అద్దెల్లో హెచ్చుతగ్గులున్నాయి. ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్‌లో రూ.190 నుంచి రూ.230 వరకు వసూలు చేస్తున్నారు. అంటే వంద చ.అ. విస్తీర్ణంలో ఏదైనా కియోస్క్‌ ఏర్పాటు చేయాలన్నా నెలకు అద్దె రూ.20 వేలు అన్నమాట. జూబ్లీహిల్స్‌లో చ.అ.కు రూ.200 నుంచి రూ.225 వరకు ఉంది. సోమాజిగూడలో రూ.150-రూ.175 మధ్య, గచ్చిబౌలిలో రూ.120-140, అమీర్‌పేటలో రూ.110-130 స్థాయిలో అద్దెలున్నాయి. దిల్లీలో అద్దెల ధరలు కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దిల్లీ ఖాన్‌ మార్కెట్‌లో చ.అ.రూ.1000-1500గా ఉంది. ఇక్కడ ఒక కియోస్క్‌ ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈస్థాయిలో అద్దెలుండటంతో ఎక్కువగా బహుళజాతి సంస్థలు మాత్రమే వీటిలో లీజుకు తీసుకుంటున్నాయి. బ్రాండింగ్‌ కోసం ఏర్పాటు చేస్తున్న సంస్థలున్నాయి.  


మన దగ్గర..

రిటైల్‌పరంగా సంప్రదాయ, ఆధునిక నిర్మాణాల కలబోతగా హైదరాబాద్‌ మార్కెట్‌ ఉంది. ఇటీవల నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో 1.8 మిలియన్‌ చ.అ.రిటైల్‌ స్పేస్‌లో ఆధునిక మాల్స్‌లోనే 1.1 రిటైల్‌ స్పేస్‌ అందుబాటులో ఉండగా.. సంప్రదాయ రిటైల్‌ 0.7 మిలియన్‌ చ.అ. మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే 13.2 మి.చ.అలలో ఆధునిక రిటైల్‌ స్పేస్‌ 5.7 మి.చ.అ. ఉంటే 7.5 మి.చ.అ సంప్రదాయ పద్ధతుల్లో నిర్మించిన రిటైల్‌ స్పేస్‌ ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని