గోవా, ఊటీ, కూర్గ్‌, దుబాయ్‌లో.. ముచ్చటపడి కొంటున్నారు

స్థలాలు.. భూములు.. ఇళ్లు.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఆలోచనలు వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. తమ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు, మార్కెట్‌ పరిస్థితులను విశ్లేషించుకుని వేర్వేరు చోట్ల పెట్టుబడులు పెడుతున్నారు.

Updated : 20 May 2023 13:07 IST

స్థలాలు.. భూములు.. ఇళ్లు.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఆలోచనలు వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. తమ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు, మార్కెట్‌ పరిస్థితులను విశ్లేషించుకుని వేర్వేరు చోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. హైదరాబాద్‌లో ఫ్లాట్‌, విల్లాలు, భూములున్నా ఇంకెక్కడైనా పెడితే బాగుంటుందని ఆలోచించేవారు పెరిగారు. నగరాలు, దేశాలను దాటి వెళుతున్నారు. నిర్మాణదారులు సైతం మరో ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారు. ఇదివరకు సినీ ప్రముఖులు, వ్యాపారులు, ఏ కొద్దిమందో ఇలా ఆలోచించేవారు.

ఈనాడు, హైదరాబాద్‌: మనవాళ్లు ఇటీవల ఎక్కువగా గోవా, కూర్గ్‌, దుబాయ్‌, యూఎస్‌ఏలో స్థిరాస్తులు కొంటున్నారు. ఊటీలో ఎప్పటి నుంచో కొంటున్న సంగతి తెలిసిందే. కూర్గ్‌ వంటి ప్రాంతాల్లో ఫామ్‌ల్యాండ్స్‌ కొనుగోలు చేస్తున్నారు. ఇదివరకే ఎంతోమందికి కాఫీ తోటలున్నాయి. గోవాలో విల్లాలు ఎక్కువగా కొంటున్నారని.. అందులో సినిమా వాళ్లే ఎక్కువని పరిశ్రమ వర్గాలుంటున్నాయి. సామాన్యులు ఫ్లాట్లు కొంటున్నారు. మనవాళ్లు కొందరు కశ్మీర్‌ లోయ వైపు చూస్తున్నారు. బెంగళూరులో ఎంతోమందికి స్థిరాస్తులున్నాయి.  

ఎందుకు కొంటున్నారంటే..: పెట్టుబడి కోణంలోనే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. పనిలో పనిగా తమకు హాలిడే హోమ్స్‌గా కూడా ఉపయోగపడుతోంది. అద్దెల రాబడి కోసం కూడా కొంటున్నారు. ముఖ్యంగా దుబాయ్‌లో అద్దెల కోసం కొనేవాళ్లే ఎక్కువ. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ వాసులు ఎక్కువగా కొన్నారు. అద్దెల రాబడి పథకాలతో ఆ దేశం పెట్టుబడిదారులను ఎక్కువగా ఆకర్షిస్తోందని ‘నేషనల్‌ అసోసియేషన్‌ రియల్టర్స్‌ ఇండియా’ వైస్‌ ఛైర్మన్‌ సుమంత్‌రెడ్డి విశ్లేషించారు. అమెరికాలో గ్రీన్‌కార్డుతో అక్కడే స్థిరపడిన వృత్తి నిపుణులు ఇదివరకు ఒకటే కొనేవారు.. పెట్టుబడి దృష్ట్యా రెండోదీ కొనేవారు పెరిగారు. ఇక ఆ దేశంలో రూ.8 కోట్లు పెట్టుబడి పెడితే వీసా పొందేందుకు అవకాశం కల్పిస్తుండటంతో అక్కడ రియాల్టీలో మనవాళ్లు పెట్టుబడి పెడుతున్నారు.

ఆ ప్రాంతాలు నచ్చడంతో..: పెట్టుబడి కోణం ఒక్కటే వీరిని ఆకర్షిస్తుందా? అంటే కాదట. ఆయా ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఆహ్లాదకర వాతావరణం, సంస్కృతి నచ్చడం.. తరచూ ఆ ప్రదేశాలను సందర్శిస్తుండంతో ముచ్చటపడి కొంటున్నవాళ్లే ఎక్కువట. ఖాళీగా ఉండకుండా రెంటల్‌ ఏజెన్సీలు అద్దెలు సైతం చెల్లించేందుకు ముందుకు రావడం.. సొంత ఇల్లు కాబట్టి నచ్చినన్ని రోజులు అక్కడ ఉండేందుకు అవకాశం ఉంటుందని ఎక్కువ మంది కొంటున్నారు. చేరువలో విమాన సదుపాయం ఉండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.  

మన బిల్డర్లు ఉండటంతో..

బెంగళూరు, గోవా, ఊటీ వంటి ప్రదేశాల్లో హైదరాబాద్‌ బిల్డర్లు అపార్ట్‌మెంట్లు కడుతున్నారు. బెంగళూరులో ప్రాజెక్ట్‌లు చేసే బిల్డర్లు ఎక్కువ మంది ఉన్నా.. గోవా, ఊటీలలో పరిమితంగా ఉన్నారు. సహజంగానే వీరు తెలుగు ప్రజలు ఉన్నచోటనే మార్కెటింగ్‌ చేస్తారు. ఆ రకంగా మన బిల్డర్లు తమతోపాటు కొనుగోలుదారులను వెంట తీసుకెళ్లి స్థిరాస్తులను కొనేలా చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రాపర్టీ షోలను నిర్వహిస్తున్నారు. బెంగళూరు తూర్పు, ఉత్తర ప్రాంతంలో 30 శాతం తెలుగువాళ్లే ఉంటారు. హైదరాబాద్‌ పెద్ద బిల్డర్ల ప్రాజెక్టులు సైతం ఇక్కడ నిర్మాణంలో ఉన్నాయి. హైదరాబాద్‌లో పది ప్రాజెక్టులు చేస్తే అక్కడ 2 చేస్తుంటారు. ఇక్కడ మార్కెట్‌ మందగమనంగా ఉంటే బెంగళూరు మార్కెట్‌పై దృష్టి పెడతారు. ప్రవాస భారతీయులు ఎక్కువ కొంటుంటారు.  

ఇతర ప్రాంతాలవారు హైదరాబాద్‌ వైపు..: నగర వాసులు ఇతర నగరాల వైపు చూస్తుంటే దేశంలోని ఇతర ప్రాంతవాసులు భాగ్యనగరం వైపు వస్తున్నారు. ఇక్కడి వాతావరణం, సంస్కృతి, ఆదరించే తీరు చూసి సొంతిల్లు కొంటున్నారు. ఇక్కడి గేటెడ్‌ కమ్యూనిటీలు మినీ భారతాన్ని తలపిస్తుంటాయి. ఇక్కడి వారికి ఇంటి ధరలు ఎక్కువనిపించినా వారికి తక్కువగా అనిపించడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని