ఇంటికో ఇతివృత్తం.. పర్యావరణమే హితం

ఇంటి నిర్మాణంలో కొనుగోలుదారుల ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. బడ్జెట్‌ ఇళ్లను దాటేసి ఇటీవల వరకు విలాసవంతమైన పోకడ నడిచింది.

Updated : 27 May 2023 07:09 IST

వెల్‌నెస్‌ హోమ్స్‌ వైపు కొనుగోలుదారుల మొగ్గు
రద్దయిన జీవో 111 ప్రాంతం అనుకూలం

ఇంటి నిర్మాణంలో కొనుగోలుదారుల ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. బడ్జెట్‌ ఇళ్లను దాటేసి ఇటీవల వరకు విలాసవంతమైన పోకడ నడిచింది. ఇప్పుడేమో వెల్‌నెస్‌ హోమ్స్‌ వైపు మళ్లుతున్నారు. మానవ, పర్యావరణ శ్రేయస్సు ప్రాముఖ్యతను గ్రహించడంతో వెల్‌నెస్‌ ఇతివృత్తంతో నిర్మిస్తున్న ఇళ్ల ప్రాజెక్ట్‌లు పెరుగుతున్నాయి. గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను నిర్దిష్ట ఇతివృత్తంతో చేపట్టడం హైదరాబాద్‌ మార్కెట్లో చాన్నాళ్లుగా ఉంది. ఒక్కో థీమ్‌ ఒక్కో సమయంలో బాగా ప్రాచుర్యంలో ఉంటుంది. మిగతావి కొనసాగుతూనే కొత్తవి పుట్టుకొస్తుంటాయి. రద్దయిన జీవో 111 పరిధిలో ఈ తరహా ప్రాజెక్ట్‌లు చేపట్టాలనే ప్రణాళికలో పలువురు బిల్డర్లు ఉన్నారు.

పిల్లల దగ్గర్నుంచి..

పిల్లలు కేంద్రీకృతంగా గృహ నిర్మాణ ప్రాజెక్టులు కొంతకాలంపాటూ నడిచాయి. ఇంట్లో చిన్నారులను సైతం దృష్టిలో పెట్టుకుని వారి కోసం మైదానాలు, ఇండోర్‌ స్టేడియాలు, సైకిల్‌ ట్రాక్‌, ఇంట్లో గదులు, టాయిలెట్‌ కమోడ్‌, పిల్లల భద్రత వరకు జాగ్రత్తలతో చేపట్టారు. ఇప్పుడు ఈ సదుపాయాలన్నీ ప్రతి ప్రాజెక్ట్‌లో సర్వసాధారణంగా మారాయి. ఈ రకంగా వృద్ధులను దృష్టిలో పెట్టుకుని.. కొవిడ్‌ తర్వాత ఇంటి నుంచి పని.. ఇలా ఎప్పటికప్పుడు థీమ్‌ మారుతూ వస్తున్నాయి.

ఆరోగ్యానికి పెద్దపీట..

ఎన్ని సౌకర్యాలున్నా.. ఎంత విలాసవంతంగా కట్టుకున్నా అందులో ఉంటున్నవారు ఆరోగ్యంగా లేకపోతే ఏం ఉపయోగం? అందుకే హంగులు, ఆర్భాటాలు కొనసాగిస్తూనే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు అనువైన వాతావరణం ఉన్న గృహ నిర్మాణ ప్రాజెక్టులను కోరుకుంటున్నారు. వీరి కోసం వెల్‌నెస్‌ ఇళ్లను నిర్మిస్తున్నారు.

ఏముంటాయి ఇందులో?

నివాస ప్రాంగణాల్లో  యోగా స్టూడియోలు, ధ్యానగదులు, స్పాలు, వ్యాయామశాలలు, టెన్నిస్‌కోర్టులు, జాగింగ్‌ ట్రాక్‌లు, ఇండోర్‌, అవుట్‌డోర్‌ క్రీడా సదుపాయాలను కల్పిస్తున్నారు.

* ప్రస్తుతం ఉంటున్న ఇళ్లలో వీటిలో ఏది కావాలన్నా బయటకు వెళ్లాల్సిందే. ఈ కారణంగానే చాలామంది బద్దకిస్తుంటారు. అదే ఇంటి ప్రాంగణంలోనే ఉంటే క్రమం తప్పక చేసేందుకు అవకాశం ఉంటుంది. తమకు సమయం దొరికినప్పుడు కసరత్తులు చేస్తూ.. ఆటలాడుతూ.. ధ్యానం చేస్తూ ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటారు.

* కొత్త ప్రాజెక్టుల్లో ఒక అడుగు ముందుకేసి.. ముఖ్యంగా జిమ్‌ వంటి వాటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉత్సాహం తగ్గకుండా ఉండేలా కూడా స్టూడియోలను అన్నింటికి అనువుగా నిర్మిస్తున్నారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌లో ఒక ప్రాజెక్ట్‌ ఈ తరహాలో రూపుదిద్దుకుంటోంది.

* కేవలం సౌకర్యాలే కాదు ఇంటి నిర్మాణంలో ఉపయోగిస్తున్న సామగ్రి,  వినియోగిస్తున్న నీరు, పీలుస్తున్న గాలి, చుట్టు పచ్చదనం వంటివి కూడా ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకం.  వీటిని పరిశీలించి ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ రేటింగ్‌ ఇస్తుంది. రేటింగ్‌ పొందిన భవనాల్లో వెల్‌నెస్‌ థీమ్‌ ప్రధానంగా ఉంటుంది.

వ్యాపకాలకు చోటిచ్చేలా..

ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా.. చుట్టూ ఎందరో ఉన్నా.. చాలామంది ఒంటరితనంగా భావిస్తుంటారు. వారికి మానసికంగా దగ్గర అంశాలు అక్కడ లేకపోవడమే కారణమని సైకాలజిస్టులు చెబుతుంటారు. అందుకే ఇటీవల గృహ నిర్మాణ ప్రాజెక్టులో ఆర్ట్‌ స్టూడియోలు, హాబీ రూమ్స్‌, జెన్‌ గార్డెన్స్‌ను నిర్మిస్తున్నారు. ఒకింత విలాసవంతమైన ప్రాజెక్టుల్లోనే ఇవి కన్పిస్తుంటాయి.  

ఉత్పాదకత పెంచేలా..

ఈ తరహా గృహాల్లో, కార్యాలయాల్లో ఉండేవారు ఆరోగ్యంగా ఉండటమే కాదు వారి ఉత్పాదకత పెరగనుంది. ‘బండ్లగూడలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఒక కమ్యూనిటీలో కొన్నాళ్ల క్రితం ఒకరు ఇళ్లు కొన్నారు. రోడ్డు పక్కనే సౌకర్యంగా ఉంటుందని, విలువ కూడా పెరుగుతుందని కొన్నారు. అప్పట్లో రద్దీ ఉండేది కాదు. ఇటీవల వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. రాత్రిపూట శబ్దాలతో ఇంట్లో నిద్ర పట్టక ఆ గృహ యాజమాని ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభావం మరుసటిరోజు విధి నిర్వహణపై పడుతోంది’ అని వాపోయారు. ఇంటి విలువ పెరగడం కంటే ఇప్పుడు తన ఆరోగ్యమే ముఖ్యమని శబ్దాలు రాకుండా ఏం చేయవచ్చు అనేదానిపై ఆలోచిస్తున్నారు. ఇలా ఎవరికి వారు క్రమంగా ఆరోగ్య ప్రాధాన్యం గుర్తిస్తున్నారు.

ఖర్చు పెరుగుతుంది...

సాధారణ గృహాలతో పోలిస్తే వెల్‌నెస్‌ హోమ్స్‌తో సహా ప్రత్యేక థీమ్‌తో నిర్మించే గృహాల ధరలు ఎక్కువే ఉంటాయి. వీటి నిర్వహణ కోసం అక్కడ నివాసితుల నుంచి వసూలు చేసే నిర్వహణ రుసుములు ఎక్కువే ఉంటాయి. కొనేటప్పుడు వీటన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఖరీదు కంటే మానసిక ఆరోగ్యమే ముఖ్యమనే వారు వీటిలో కొనుగోలు చేస్తున్నారు. నిజానికి మార్కెట్లో వీటికి డిమాండ్‌ ఉందని.. అడిగి మరీ కొనుగోలు చేస్తున్నారని బిల్డర్‌ ఒకరు అన్నారు.

బడ్జెట్‌లో కావాలంటే..

వెల్‌నెస్‌ సదుపాయాలతో ప్రాజెక్ట్‌లు అంటే బడ్జెట్‌లో సిటీలో దొరికే పరిస్థితి లేదు. కొందరైతే అసాధారణ ధరలు చెబుతున్నారు. అందుకే శివార్లలో కాస్త దూరమైన ఫర్వాలేదు అంటున్నారు. ఈ కారణంగా ఇటీవల పెద్ద సంఖ్యలో శివార్లలో విల్లా ప్రాజెక్ట్‌లు వచ్చాయి. కాలుష్యానికి దూరంగా ప్రకృతి నడమ గడపాలనుకునేవారు ఎక్కువగా వీటివైపు మొగ్గుచూపుతున్నారు. కొనుగోలుదారుల డిమండ్‌ ఉండటంతో రద్దయిన జీవో111 పరిధిలో వెల్‌నెస్‌ ఇతివృత్తంతో పలు ప్రాజెక్టులు చేపట్టాలనే ఆలోచనలో బిల్డర్లు ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ చాలామంది భూములను కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలో సాధారణ ప్రాజెక్టుల కంటే పర్యావరణహితంగా ఉండేలా చేపడితే నగరానికి ప్రత్యేకత సమకూరుతుందని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు అంటున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు