టీడీఆర్‌తో నిర్మాణదారులకు పండగ

నగరంలో టీడీఆర్‌కు డిమాండ్‌కు పెరిగింది. గడిచిన 5 నెలల్లో జరిగిన టీడీఆర్‌ విక్రయాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Published : 27 May 2023 01:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో టీడీఆర్‌కు డిమాండ్‌కు పెరిగింది. గడిచిన 5 నెలల్లో జరిగిన టీడీఆర్‌ విక్రయాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సుమారు 100 మంది నిర్మాణదారులు టీడీఆర్‌ను కొనుగోలు చేసి జరిమానాలు చెల్లించారు. తద్వారా భవన నిర్మాణదారులకు జరిమానా విలువలో సగానికిపైగా ఆదా అయింది. టీడీఆర్‌ సర్టిఫికెట్లకూ మార్కెట్‌ పెరిగింది. రోడ్డు విస్తరణ, పైవంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి అవసరయ్యే నిధులకన్నా, భూసేకరణకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. తొమ్మిదేళ్లలో 35 పనులు చేపడితే రూ.4 వేల కోట్ల ఖర్చయితే భూసేకరణకు రూ.3,500 కోట్ల టీడీఆర్‌ సర్టిఫికెట్ల ద్వారా చెల్లించాల్సి వచ్చింది. ఈ టీడీఆర్‌ సర్టిఫికెట్లు ఏడాది క్రితం వరకు యజమానులకు తలనొప్పిగా మారాయి. కొనేవారు లేక యజమానులు అవస్థ పడ్డారు. చాలా తక్కువ ధరకు అమ్ముకున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధికే పరిమితమైన టీడీఆర్‌ను హెచ్‌ఎండీఏ మొత్తానికి వర్తింపజేసింది. ఇంటి ప్లాన్‌ను ఉల్లంఘించి (గరిష్ఠంగా 10 శాతం), అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలకు విధించే జరిమానాలను టీడీఆర్‌తో చెల్లించుకునే వెసులుబాటు కల్పించింది.

పెరిగిన లావాదేవీలు..: నివాసయోగ్య పత్రం జారీ కోసం జీహెచ్‌ఎంసీ యజమానులకు విధించే జరిమానాలను టీడీఆర్‌ సర్టిఫికెట్లతో చెల్లించేందుకు నిర్మాణదారులు ముందుకొస్తున్నారు. 5 నెలల్లో రూ.50 కోట్ల జరిమానాలు టీడీఆర్‌తో మాఫీ అయినట్లు అధికారులు చెబుతున్నారు. రూ.60 లక్షల జరిమానాను రూ.20 లక్షలకు కొన్న టీడీఆర్‌తో చెల్లించే పరిస్థితి ఉండటంతో ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారు. అయినా మరిన్ని మార్గాల్లో పేరుకుపోయిన టీడీఆర్‌ను నగదు రూపంలోకి మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యజమానులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని