సంగారెడ్డి వరకు సాగిపోదాం...

ఐటీ కారిడార్‌కు చేరువలో ఉన్న ప్రాంతాల్లో పటాన్‌చెరు-సంగారెడ్డి మార్గం ఒకటి.. పశ్చిమ హైదరాబాద్‌లో భాగంగా అభివృద్ధి విస్తరిస్తున్న ప్రాంతం. దీంతో చాలాకాలంగా ఐటీ ఉద్యోగుల చూపు ఈ ప్రాంతంపై పడింది.

Updated : 03 Jun 2023 02:15 IST

ఐటీ కారిడార్‌కు చేరువలో ఉన్న ప్రాంతాల్లో పటాన్‌చెరు-సంగారెడ్డి మార్గం ఒకటి.. పశ్చిమ హైదరాబాద్‌లో భాగంగా అభివృద్ధి విస్తరిస్తున్న ప్రాంతం. దీంతో చాలాకాలంగా ఐటీ ఉద్యోగుల చూపు ఈ ప్రాంతంపై పడింది. విల్లాలు, అపార్ట్‌మెంట్లు, స్థలాలు ఈ ప్రాంతంలో కొనుగోలు చేసిన వారిలో అత్యధికులు వీరే. వేగంగా అభివృద్ధి చెందుతుండటం, ధరలు సైతం అందుబాటులో ఉండటంతో మున్ముందు మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని స్థిరాస్తి వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌

ఐటీ కారిడార్‌కు చేరువలో ఉన్న కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, మియాపూర్‌, చందానగర్‌, బీహెచ్‌ఈఎల్‌ వరకు నివాస కేంద్రాలుగా రెండు దశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి చెందాయి. ఐటీ కారిడార్‌లోనే ఉన్న కొండాపూర్‌, నార్సింగి, మంచిరేవుల, నల్లగండ్ల, తెల్లాపూర్‌, కోకాపేట వరకు కార్యాలయాలు, నివాస భవనాలు పెద్ద సంఖ్యలో నిర్మాణంలో ఉన్నాయి. భారీ ప్రాజెక్టులన్నీ ఇక్కడే ఎక్కువగా వస్తున్నాయి. భూముల ధరల కారణంగా ఇక్కడ చదరపు అడుగు ధర రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఉంది. రూ.10 వేలు, రూ.12 వేలు చెబుతున్న ప్రాంతాలూ ఉన్నాయి. ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నా ఫ్లోర్‌రైజ్‌ ఛార్జీలతో ఇవి కూడా భారంగా మారాయి. ట్రాఫిక్‌ పెరుగుతోంది. దీంతో కాస్త దూరమైనా ట్రాఫిక్‌ లేని, తక్కువ ధరల్లో గృహ నిర్మాణ ప్రాజెక్టుల వైపు కొనుగోలుదారులు దృష్టి సారించడం మొదలైంది.

నగరానికి పశ్చిమదిశగా..  

ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న పటాన్‌చెరు సంగారెడ్డి మార్గం.. ఇప్పుడు నివాసాలకు కేంద్రంగా మారింది. ఇక్కడ పెద్దఎత్తున విల్లాలు, అపార్ట్‌మెంట్‌, ఓపెన్‌ వెంచర్‌ ప్రాజెక్టులు వచ్చాయి. అపార్ట్‌మెంట్లలో చ.అడుగు రూ.4 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. విల్లాలు రూ.7 వేల నుంచి రూ.8 వేల శ్రేణిలో చదరపు అడుగు ధరలు చెబుతున్నారు. ఈ ధరలు కొన్నివర్గాలకు అందుబాటులో ఉండటంతో ఇక్కడ ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులే ఎక్కువగా వస్తున్నారని స్థిరాస్తి సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ చాలా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.

సానుకూలతలు ఎక్కువే..

* అవుటర్‌ రింగ్‌రోడ్డు అనుసంధానంతో ఐటీ కారిడార్‌కు చేరుకోవడం సులభంగా మారింది. దగ్గర ఉంటూ ట్రాఫిక్‌లో ఎక్కువ గంటలు ఇరుక్కుపోయేకంటే దూరమైనా సాఫీ ప్రయాణం ఉంటుందనే కారణంగా ఇటువైపు చూస్తున్నారు.

* పేరున్న పాఠశాలలు ఈ ప్రాంతానికి చేరువలో ఉన్నాయి. పిల్లల చదువుల కోసం ఇటువైపు వస్తున్నారు. కందిలో ఐఐటీ, మరికొన్ని పేరున్న ఇంజినీరింగ్‌ కళాశాలలు చుట్టుపక్కల వస్తున్నాయి.

* ఆరు వరసలుగా జాతీయ రహదారి విస్తరణ వంటి మౌలిక వసతుల అభివృద్ధి కూడా ఈ ప్రాంతానికి సానుకూలంగా మారింది.

* ఇక్కడికి సమీపంలోనే పారిశ్రామికవాడలు ఉండటం.. పలు కొత్త కంపెనీలు రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ పెరగడానికి దారి తీశాయి.


సరైన సమయమిదే..

మున్ముందు ఈ ప్రాంతం మరింత పెరగడానికి అవకాశం ఉందని.. పెట్టుబడి పెట్టేవారికి, ఇల్లు కావాల్సిన వారు కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం అని ఒక బిల్డర్‌ అన్నారు. ప్రస్తుతం మార్కెట్‌ కొంత నెమ్మదించిందని ఎన్నికల తర్వాత మళ్లీ పెరిగే సూచనలు ఉన్నాయంటున్నారు. కొవిడ్‌ సమయంలోనూ కొన్ని నెలలు విక్రయాలు లేవని ఆ తర్వాత ఒక్కసారిగా ఎగబడటంతో ధరలు పెరిగాయని గతానుభవాలను ఆయన ఉదహరించారు. పశ్చిమ హైదరాబాద్‌కు కొనసాగింపు కావడంతో ఈ ప్రాంతానికి చాలా సానుకూలత ఉందన్నారు. గత పదేళ్లలో చూస్తే భూముల ధరలు పదింతలు పెరిగాయని గుర్తుచేశారు.


ఐటీ విస్తరణ...

నగరంలోని అన్ని ప్రాంతాలకు ఐటీ రంగాన్ని విస్తరించేందుకు, అభివృద్ధి ఫలాలను పంచేందుకు ప్రభుత్వం గ్రిడ్‌ పాలసీ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా గతంలో సిటీలో ఉన్న పారిశ్రామికవాడలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేయబోతుంది. గతంలో పటాన్‌చెరులోనూ పారిశ్రామికవాడలున్నాయి. ఇక్కడి పరిశ్రమలను అవుటర్‌ బయటకు తరలించారు. ఈ స్థలంలో ఐటీపార్క్‌ల అభివృద్ధికి అవకాశం ఉంది. ఇది కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి, నివాసాలకు ఆకర్షణగా మారుతోంది.

ప్రాంతీయ వలయం మొదట ఇక్కడే..

ఓఆర్‌ఆర్‌ బయట ప్రాంతీయ వలయ రహదారిని 340 కి.మీ. మేర రెండుదశల్లో నిర్మించనున్న సంగతి తెలిసిందే. మొదటదశలో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు 158 కి.మీ. చేపడుతున్నారు. పనులు సంగారెడ్డి నుంచే మొదలు కాబట్టి ఈ ప్రాంతంపై అందరి దృష్టి ఉంది. ఇది కూడా ఇటువైపు రియల్‌ ఎస్టేట్‌ విస్తరణకు దోహదం చేసింది.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని