వాతావరణం మారింది.. ఇంటి నిర్మాణం సంగతేంటి?

నిర్మాణ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు చూస్తుంటాం.. ఇంటి ఎలివేషన్లలో మార్పు, ఇంటీరియర్‌లో సరికొత్త కూర్పు.. ఈ మార్పులు ప్రతి దశాబ్దంలో ఇంటి నిర్మాణంలో ప్రతిబింబిస్తుంటాయి.

Updated : 09 Sep 2023 02:25 IST

వరద ముంపు నుంచి గట్టెక్కించే మార్గాలు పాటించాలంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు చూస్తుంటాం.. ఇంటి ఎలివేషన్లలో మార్పు, ఇంటీరియర్‌లో సరికొత్త కూర్పు.. ఈ మార్పులు ప్రతి దశాబ్దంలో ఇంటి నిర్మాణంలో ప్రతిబింబిస్తుంటాయి. వీటితోపాటు వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంఏర్పడిందని అనుభవాలు చెబుతున్నాయి.
ఇళ్లు, కాలనీలు, ఖరీదైన గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలు కూడా భారీ వర్షాలతో వరదల్లో మునుగుతున్నాయి. లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించి సొంతింట్లోకి దిగిన సంతోషం ఎంతోకాలం ఉండటం లేదు. కాలనీ మునిగేలా వరదలు ఒకవైపు... ఫ్లాట్లలో నాణ్యత లోపం కారణంగా లీకేజీలతో మనోవేదన కలుగుతోందని కొనుగోలుదారులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో కుండపోత వానలతో నగరాల మునక మరీ పెరిగింది. ఇది ఒకరకంగా పట్టణాలకు హెచ్చరిక లాంటిది. లేఅవుట్లు వేసేప్పుడు, అపార్ట్‌మెంట్లు కట్టేప్పుడు రియల్టర్లు, బిల్డర్లు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఇప్పటికే కొన్ని సంస్థలు వీటిని పాటిస్తున్నాయి. ఆయా సంస్థలను మిగతావారు ఆదర్శంగా తీసుకోవచ్చు. స్థానిక సంస్థలు సైతం అక్రమ నిర్మాణాలను నిరోధించి.. ఉల్లంఘనలు జరగకుండా చూస్తే ముంపు ముప్పు లేకుండా ఉంటుంది. 

తీవ్రత పెరుగుతోంది.. 

  • వాతావరణంలో మార్పుల కారణంగా గంటరెండు గంటల్లోనే పది సెంటీమీటర్ల వర్షం పడటంతో కాలనీలు నీట మునుగుతున్నాయి. కాలంతో మారినట్లే.. వాతావరణ మార్పులకు అనుగుణంగానూ నిర్మాణాలూ మారాల్సి ఉంది.
  • నిర్మాణాలు ఎత్తయినప్రాంతాల్లోనే చేపట్టాలి. లోతట్టులో నిర్మిస్తుంటే వరద తాకిడి లేకుండా జాగ్రత్తలు వహించాలి.
  • వరద ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు చేపట్టకూడదు.భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. పైగా సెల్లార్లు.. దీంతో నేరుగా వరద బహుళఅంతస్తుల భవనంలోకి చేరుతోంది.
  • ఇల్లు, అపార్ట్‌మెంటు, గేటెట్‌ కమ్యూనిటీ ఏదైనా.. ప్రాంగణంలో పడే ప్రతి వానచుక్క భూమిలో ఇంకేలా సంరక్షణచర్యలు చేపట్టాలి. హరిత భవనాల్లో ఈ విధానం పక్కాగా పాటిస్తున్నారు.
  • భవనం ఏదైనా చుట్టూ ఖాళీ స్థలం సెట్‌బ్యాక్స్‌ తప్పనిసరిగా వదలాలి. చుట్టూ మొక్కలు పెంచుకోవాలి. ఇవి కూడా కొంత నీటిని సంగ్రహిస్తాయి.
  • లేఅవుట్లు వేసేప్పుడే వాస్తుకు సరిగ్గాలేదని ఎక్కడో ఒక మూలన ఖాళీ ప్రదేశాలు, పార్కుల స్థలాలు కాకుండా.. వరద నిల్చే ప్రాంతాల్లో వీటికి స్థలాలు వదిలిపెట్టాలి. జేఎన్‌టీయూ సమీపంలోని ఓ విల్లా ప్రాజెక్ట్‌లో నీరు నిల్చే ఎకరం లోతట్టు ప్రాంతాన్ని పార్కుగా చేశారు. వర్షం పడినప్పుడు ఆ కమ్యూనిటీలో నీరంతా అక్కడికి చేరి నినాదంగా భూమిలోకి ఇంకుతుంది. మొయినాబాద్‌లోని మరో కమ్యూనిటీలో కృత్రిమ చెరువే ఏర్పాటుచేసుకున్నారు. అప్పటికీ వరద నీరు ఎక్కువైతే భూమిలో ఇంకేలా ఇంజెక్షన్‌ వెల్స్‌ వేశారు. ఇలా తమబోర్లలో నీరు ఎండిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. వీరిని ఇతరులు అనుకరించవచ్చు.
  • నీటి సంరక్షణ కోసం సైతం నిర్మాణ ప్రణాళికలో నిపుణులను భాగస్వామ్యం చేస్తే మెరుగైన పరిష్కారాలు లభిస్తాయి. ప్రతి ఇంటిలో నీటి సంరక్షణ చర్యలతో వీధుల్లో వరదను కొంతవరకు నివారించవచ్చు.

సెల్లార్లకు వెళ్లకుండా..

మూసీ పక్కన, జలాశయాల పక్కన భారీ బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇలాంటి చోట సైతం సెల్లార్లు తవ్వుతున్నారు. వాటికి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు ఇస్తోంది. భారీ వర్షాలు పడినప్పుడు.. సెల్లార్లలోకి నీరు చేరుతోంది. ఆయా చోట్ల నీరు తోడే మోటార్లు సైతం ఏర్పాటుచేస్తున్నారు. ఇలాంటి చోట పోడియం పార్కింగ్‌ మేలు. ఇందులో పార్కింగ్‌ కోసం మొదటి ఒకటి, రెండు అంతస్తులను కేటాయించవచ్చు.

వారిదే బాధ్యత..

లేఅవుట్లలో రియల్టర్లు డ్రైన్లు నిర్మిస్తున్నారు. వీటికి అవుట్‌లెట్‌ కనెన్షన్‌ ఉండటం లేదు. వీటిని అనుమతి ఇస్తున్న హెచ్‌ఎండీఏదే అవుట్‌లెట్‌ కనెన్షన్‌ చూపించాల్సి బాధ్యత. ఆ విషయం పట్టించుకోవడం లేదు. ఇది కూడా ముంపు సమస్యకు దారితీస్తోంది. అనుమతి ఇచ్చేప్పుడే ఈ జాగ్రత్తలు చేపట్టాలి. లోతట్టు ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాలు, పార్కులకు స్థలాలు వదిలేలా చూడాలి.

కొనుగోలుదారులూ.. ఎంపికలో జాగ్రత్త

  • ఇల్లు కట్టుకునేందుకు అనువైన స్థలం, నివసించేందుకు ఇల్లు కొంటుంటే వానాకాలంలోనే ఆయా ప్రాజెక్టులను ప్రత్యక్షంగా సందర్శించండి.
  • సైట్‌లో వరద పారుతోందా? ఎత్తులో సురక్షిత ప్రదేశంలోనే ఇల్లు ఉందా? దారులు ఎలా ఉన్నాయి? మునక ముప్పుందా అనేది వానాకాలంలో సందర్శనతో అవగాహన కల్గుతుంది. దీన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.
  • అపార్టుమెంట్లలో ఫ్లాట్‌ కొంటుంటే సిద్ధంగా ఉన్నదైతే వానాకాలంలో వెళ్లి పరిశీలించండి. లీకేజీలున్నాయా? గోడలకు చెమ్మ వస్తోందా.. పగుళ్లున్నాయా? అనేది తెలుస్తుంది.
  • జలాశయాల సమీపంలో నిర్మాణాలుచేపట్టిన ప్రాజెక్ట్‌లో కొనబోతుంటే... బఫర్‌ జోన్‌లో ఉందా? భవిష్యత్తులో వరదలు వస్తే  ఎక్కడిదాకా వరద వస్తుంది వంటి విషయాలు తెలియాలంటే వానాకాలంలోనే సైట్‌ సందర్శించాలి.
  • కట్టుకుంటున్న ఇల్లు, కొంటున్న అపార్ట్‌మెంట్‌ ఎత్తులో ఉంటే సరిపోదు.. ఆ ప్రాంతం.. దారి ఎలా ఉన్నాయో కూడా చూసుకోవాలి.

ఏ భూమి దేనికోసం అనేది రెవెన్యూ రికార్డుల్లో.. 

-డాక్టర్‌ ఎంవీఎస్‌ఎస్‌ గిరిధర్‌, హెడ్‌, సెంటర్‌ ఫర్‌ వాటర్‌ రిసోర్సెస్‌

రెవెన్యూ పాత రికార్డుల్లో ఏ భూమి దేనికోసం అనేది స్పష్టంగా ఉంది. వరద కాలువలు, హద్దులు, చెరువు శిఖం, ఎఫ్‌టీఎల్‌ హద్దులు ఇలా ఉన్నాయి కొనేవారైనా.. కట్టేవారైనా ఈ పాత రికార్డులు పరిశీలించాలి. దేని కోసం భూమి ఉందో అందుకే వినియోగించాలి. చాలా భూములు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంటాయి. ఇక్కడ వ్యవసాయానికే అనుమతి ఉంటుంది. వీటిలో నిర్మాణాలతో ముంపు సమస్యలు వస్తున్నాయి. కాలనీలు, కమ్యూనిటీపరంగా ఎక్కడి నీరు అక్కడ ఇంకేలా ఏర్పాట్లు చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని