డిజైన్‌ ప్రకారం కడితేనే..

జీవితకాలంలో కూడబెట్టుకున్న సొమ్ముతో ఇల్లు కట్టడం, కొనడం చేస్తుంటారు. చాలకపోతే గృహరుణం తీసుకుని మరి కొనుగోలు

Published : 02 Nov 2019 02:07 IST

ఈనాడు, హైదరాబాద్‌

జీవితకాలంలో కూడబెట్టుకున్న సొమ్ముతో ఇల్లు కట్టడం, కొనడం చేస్తుంటారు. చాలకపోతే గృహరుణం తీసుకుని మరి కొనుగోలు చేస్తారు. మున్ముందు ఏ సమస్యలు లేకుండా ఉండాలని నాణ్యంగా ఉండాలని కోరుకుంటారు. అందుకు కొనేటప్పుడే ప్రత్యేకించి కొన్ని అంశాలను పరిశీలిస్తే ఇబ్బందులు ఉండవు.

* అనుమతులు పొందిన డిజైన్‌ ప్రకారమే కడుతున్నారో లేదో చూడాలి. చాలాచోట్ల డ్రాయింగ్స్‌ వేరుగా ఉంటాయి.. కట్టేది మరో విధంగా ఉంటుంది.
* నిర్మాణం చేపట్టే స్థలంలో భూ పరీక్షలు ఏమైనా చేశారా? వదులు నేల ఉంటే అందుకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా పరిశీలించాలి.
* లీకేజీలు, పగుళ్లు లేకుండా నిర్మాణం ఉందా లేదా అని పరిశీలించాలి. లేదంటే ఎక్కువ కాలం మన్నవు. భవనం పైన వర్షపునీరు వెళ్లేలా స్లాబ్‌ వాలు సరిగ్గా ఉందా లేదో చూడాలి.

తెలిస్తేనే కదా అడుగుతారు..!
ఇంటి కొనుగోలు సమయంలో ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లలో కార్పెట్‌ ఏరియా, బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియా పదాలు వినపడుతుంటాయి. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారిలో చాలామందికి ఇవి గందరగోళంగా అనిపిస్తుంటాయి. వీటి గురించి అవగాహన ఉంటే కొనుగోలు సమయంలో ఏజెంట్లు, బిల్డర్లతో ధర విషయంలో బేరమాడేందుకు అవకాశం ఉంటుంది. మన అవసరాలకు తగిన విస్తీర్ణం కలిగిన ఇంటిని సొంతం చేసుకునేందుకు వీలవుతుంది. రెరాకు ముందు ఈ మూడింటిని కలిపే చెప్పేవారు. ఇప్పుడు కామన్‌ ఏరియాను విడిగా చూపిస్తున్నారు.

కార్పెట్‌ ఏరియా...
ఇంట్లో గదుల్లోని గచ్చు పరిధి వరకు విస్తరించిన ప్రాంతాన్ని కార్పెట్‌ ఏరియా పరిగణిస్తారు. గోడలను మినహాయించి లెక్కిస్తారు. ఉమ్మడి స్థలం మెట్లు, లిఫ్ట్‌, లాబీ, ఆట స్థలం వంటివి ఇందులోకి రావు. కాబట్టి కొనేటప్పుడు కార్పెట్‌ ఏరియా ఎంత అనేది తెలిస్తే వంటగది, హాలు, పడకగది, పిల్లల గది ఏ విస్తీర్ణంలో రాబోతుంది అనే అంశంలో అవగాహనకు రావొచ్చు. బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియాపైనే ధర వసూలు చేస్తారు. సాధారణంగా బిల్టప్‌ ఏరియాలో 70 శాతం వరకు కార్పెట్‌ ఏరియా ఉంటుంది.

బిల్టప్‌ ఏరియా
ఇంట్లో గచ్చు, గోడలన్నీ కలిపి బిల్టప్‌ ఏరియాగా లెక్కిస్తారు. గోడలు 20 శాతం ఆక్రమిస్తాయి. మరో 10 శాతం బాల్కనీ, ఇతరత్రా పోతుంది. మీ ఫ్లాట్‌ 1000 చ.అడుగుల బిల్టప్‌ ఏరియా అయితే 30 శాతం ఉపయోగించని స్థలమే ఉంటుంది. వినియోగంలో ఉండే స్థలం 700 చ.అ. మాత్రమే.

సూపర్‌ బిల్టప్‌ ఏరియా
బిల్టప్‌ ఏరియాతో పాటు కామన్‌ ఏరియాను కలిపి సూపర్‌ బిల్టప్‌ ఏరియాగా వ్యవహరిస్తుంటారు. కారిడార్‌, లిఫ్ట్‌, లాబీ ఇందులోనే కలుపుతుంటారు. కొందరు బిల్డర్లు ఈత కొలను, గార్డెన్‌, క్లబ్‌ హౌస్‌లను కలిపి లెక్కిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని