నివాస కేంద్రంగా బాచుపల్లి

నగరంలో కొత్త నివాస కేంద్రాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మౌలిక వసతులు మెరుగ్గా ఉండటం.. మరికొన్ని ప్రణాళిక దశలో ఉండటంతో బాచుపల్లి పరిసర ప్రాంతాలు గృహ నిర్మాణాలకు చిరునామాగా మారాయి.

Updated : 25 Dec 2021 05:42 IST

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో కొత్త నివాస కేంద్రాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మౌలిక వసతులు మెరుగ్గా ఉండటం.. మరికొన్ని ప్రణాళిక దశలో ఉండటంతో బాచుపల్లి పరిసర ప్రాంతాలు గృహ నిర్మాణాలకు చిరునామాగా మారాయి. ఇక్కడ పెద్ద ఎత్తున బహుళంతస్తుల నిర్మాణాలు వస్తున్నాయి. అరగంటలో మియాపూర్‌ మెట్రో స్టేషన్‌కు చేరుకునే సదుపాయం, అవుటర్‌కు, ఐటీ కారిడార్‌కు సైతం చేరువలో ఉండడంతో ఇక్కడ సొంతిళ్ల కొనుగోలుకు దిగువ, ఎగువ మధ్యతరగతి వాసులు ఆసక్తి చూపిస్తున్నారు. కేపీహెచ్‌బీ, మియాపూర్‌, ప్రగతినగర్‌, నిజాంపేట ప్రాంతాలకు కొనసాగింపుగా ఈ ప్రాంతం ఉండటం, నిజాంపేట కార్పొరేషన్‌ పరిధిలోకి రావడంతో ప్రణాళికబద్ధ అభివృద్ధి ఉంటుందనే అంచనాలతో మొగ్గుచూపుతున్నారు.

కప్పుడు శివారు ప్రాంతం.. పరిశ్రమలకు కేంద్రం.. ఇప్పుడు ఇక్కడి పరిశ్రమలన్నీ చాలావరకు అవుటర్‌ ఆవలకు తరలిపోయాయి. భూముల లభ్యత పెరిగింది. ఆర్‌1 జోన్‌ కిందకు మారడంతో పెద్ద ఎత్తున నివాస సముదాయాలు వస్తున్నాయి. అత్యధికం గేటెడ్‌ కమ్యూనిటీలే. ఆకాశ హర్మ్యాలు, విల్లాలు, వ్యక్తిగత ఇళ్లు ఇలా విస్తరిస్తూ పోతున్నాయి. బౌరంపేట, మల్లంపేట, బాచుపల్లి, మియాపూర్‌ ప్రాంతాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయి.

పలు సానుకూలతలు
నివాసం ఉండేందుకు ప్రధానంగా చూసే అంశాల్లో విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయా.. లేవా? అనేది. ఇక్కడ పలు ప్రముఖ, కార్పొరేట్‌ స్థాయి పాఠశాలలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండటం సానుకూలంగా మారింది. నిజాంపేట కార్పొరేషన్‌ కిందకు రావడంతో మౌలిక వసతులు మెరుగు పడుతున్నాయి. అవుటర్‌ లోపల ఉన్న శివారు ప్రాంతాలన్నింటికీ కృష్ణా నది జలాలను అందించే పనులు కొనసాగుతున్నాయి. ఆరు నెలల నుంచి ఏడాదిలో ఇక్కడ కట్టే గృహ సముదాయాలన్నింటికీ నేరుగా తాగునీటి సౌకర్యం లభించనుందని బిల్డర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇప్పటికే అవుటర్‌ వరకు అనుసంధానం చేయాల్సిన మిగిలిన రహదారులను గుర్తించింది. వీటిని త్వరలోనే విస్తరించనుంది. ఇవన్నీ బాచుపల్లి ప్రాంతానికి సానుకూలంగా మారాయి.

అందుబాటులో ధరలు  
లక్షలాది ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగులకు ఉపాధి కేంద్రాలైన మాదాపూర్‌, గచ్చిబౌలికి సమీపంలో ఉన్న నివాస ప్రాంతాలు కొండాపూర్‌, కేపీహెచ్‌బీ, హఫీజ్‌పేటల్లో ఎంత లేదన్న చదరపు అడుగు తక్కువలో తక్కువ రూ.6 వేల లోపు దొరికే అవకాశాలు లేవు. గరిష్ఠంగా రూ.పది వేల వరకు పలుకుతోంది. అందుబాటు ధరలో నివాసాలంటే బాచుపల్లి వైపు చూస్తున్నారు. పెద్ద ఎత్తున స్థలాలు అందుబాటులో ఉండటం కలిసొచ్చింది. ఇక్కడ చిన్న పెద్ద సంస్థలు పలు నిర్మాణాలను చేపట్టాయి.


రవాణా సులువు

టీ కారిడార్‌కు ఈ ప్రాంతం సుమారు 15 కి.మీ. దూరం ఉంటుంది. మియాపూర్‌, కేపీహెచ్‌బీ వంటి వాణిజ్య కేంద్రాలు చేరువలో ఉన్నాయి. నిజాంపేట, ప్రగతినగర్‌, బౌరంపేట, మోమిన్‌పేట, గాజులరామారం ఇలా చుట్టూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు రహదారులున్నాయి. మియాపూర్‌ నుంచి గండిమైసమ్మ మీదుగా మేడ్చల్‌ వరకు జాతీయ రహదారి ఉంది. పైగా ఈ ప్రాంతం ఓఆర్‌ఆర్‌కు ఆనుకొనే ఉండటంతో ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా సులభంగా దూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవచ్చు. జిల్లా కేంద్రం మేడ్చల్‌కు అవుటర్‌ దగ్గరి దారి. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ ఈ ప్రాంతానికి 10 కి.మీ. దూరం. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్‌కి 8 కి.మీ.. ఇక్కడి నుంచి మెట్రోలో సిటీలోని ఏ ప్రాంతానికైనా గంటలోపే చేరుకునే వెసులుబాటు ఉంది.


గేటెడ్‌ వైపు మొగ్గు

కేపీహెచ్‌బీ, పరిసర ప్రాంతాలు నివాసాలతో నిండిపోవడం..పైగా అప్పట్లో ఎక్కువగా సాధారణ అపార్ట్‌మెంట్లు కావడంతో పలు సౌకర్యాలతో ఉండే అపార్ట్‌మెంట్ల వైపు చూస్తున్నారని బిల్డర్లు అంటున్నారు. ఇప్పటివరకు ఉన్న సాధారణ అపార్ట్‌మెంట్లలో సౌకర్యాలు తక్కువ. పిల్లలకు ఆడుకునే సదుపాయాలు అంతంతే. నివాస ప్రాంతాలు చాలావరకు వాణిజ్య ప్రాంతాలుగా విస్తరించాయి. దీంతో ఇక్కడి ఇళ్లను విక్రయించి గేటెడ్‌ కమ్యూనిటీల వైపు వెళుతున్నారు. ‘మరో పది పదిహేను ఏళ్లలో హైదరాబాద్‌లో స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లు కన్పించవు. కొనుగోలుదారులు గేటెడ్‌ కమ్యూనిటీల వైపే మొగ్గుచూపుతున్నారు. అన్నిరకాల సౌకర్యాలు ఉండడం, నిర్వహణ మొత్తం సొసైటీ చూస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు అనే ఆలోచనతో ఇటు మొగ్గుచూపుతున్నారు’ అని వాసవి గ్రూపు డైరెక్టర్‌ అభిషేక్‌ చందా అన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని