రియల్‌ జోరుకు ఒమిక్రాన్‌ భయం!

ఒమిక్రాన్‌ ప్రభావం స్థిరాస్తి రంగంపై ఏ మేరకు ఉంది? ప్రత్యేకించి నిర్మాణరంగం కొవిడ్‌ మూడోవేవ్‌ కారణంగా ఎలాంటి ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది? గత నెలాఖరు నుంచి కరోనా కేసుల పెరుగుదల

Updated : 22 Jan 2022 06:46 IST

మందకొడిగా మార్కెట్‌.. 30 శాతం ప్రభావం పడిందంటున్న బిల్డర్లు

ఒమిక్రాన్‌ ప్రభావం స్థిరాస్తి రంగంపై ఏ మేరకు ఉంది? ప్రత్యేకించి నిర్మాణరంగం కొవిడ్‌ మూడోవేవ్‌ కారణంగా ఎలాంటి ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది? గత నెలాఖరు నుంచి కరోనా కేసుల పెరుగుదల మొదలై వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో సహజంగానే ఈ ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పైనా కన్పిస్తోంది. ఈ రంగంలో పనిచేసే ఉద్యోగులు, కూలీలు సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో పని ప్రదేశాల్లో హాజరు 30 శాతం వరకు పడిపోయిందని బిల్డర్లు అంటున్నారు. కొనుగోలుదారులు సైతం కరోనా భయం నేపథ్యంలో సైట్‌ సందర్శనలను వాయిదా వేసుకుంటున్నారు. ఫిబ్రవరి నెల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. వచ్చేనెలలో జరిగే ప్రాపర్టీ షోనూ వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

కొవిడ్‌ తొలి దశ(2020)లో విధించిన లాక్‌డౌన్‌తో స్థిరాస్తి రంగం రెండు నెలల పాటు పూర్తిగా స్తంభించింది. ఆ తర్వాత ఎక్కువ మంది కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో ఆరు నెలల పాటు నిర్మాణాలు మందగించాయి. అదే ఏడాది ఆఖరునాటికి దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ వేగంగా కోలుకుంది. మార్కెట్‌ కుదుటపడుతున్న దశలో.. 2021 ఫిబ్రవరి నుంచి మే వరకు డెల్టా వేరియంట్‌తో రెండో వేవ్‌ కుదిపేసింది. దీన్ని సైతం తట్టుకుని మార్కెట్‌ పూర్వస్థాయికి చేరుకుంది. రికార్డు స్థాయిలో ఇళ్లు, కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. దూకుడు మీదున్న హైదరాబాద్‌ రియాల్టీకి 2022లో ఒమిక్రాన్‌ వేరియంట్‌తో కళ్లెం పడినట్లయింది. అయితే, దీని ప్రభావం తాత్కాలికమేనని.. కేసులు తగ్గగానే మళ్లీ ఊపందుకుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.


నిర్మాణాలు కొనసాగుతున్నాయ్‌..

వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రతి రెండో కుటుంబం ఒమిక్రాన్‌ బారిన పడుతోంది. ఈ ప్రభావం 30 శాతం వరకు స్థిరాస్తి రంగంపైనా ఉంది. అయితే, నిర్మాణాలు ఆగినట్లు ఎక్కడా మా దృష్టికి రాలేదు. సైట్లలో పనులు యథావిధిగా జరుగుతున్నాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో ఒమిక్రాన్‌ ముప్పు పెద్దగా లేదని సైట్లలో పనిచేస్తున్నవారిని బట్టి చూస్తే తెలుస్తోంది. ఒమిక్రాన్‌ ప్రభావం ఫిబ్రవరి వరకు ఇలాగే ఉంటుంది. వసంత పంచమి తర్వాత శుభగడియలతో మార్కెట్‌ మళ్లీ ఊపందుకుంటుందని అంచనా వేస్తున్నాం.

- వి.రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, క్రెడాయ్‌ హైదరాబాద్‌


ప్రాజెక్టు సందర్శనలు తగ్గాయి..

ఒమిక్రాన్‌ ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పై స్పష్టంగా కన్పిస్తోంది. నెలరోజులుగా ప్రాజెక్ట్‌ సందర్శనలు సైతం తగ్గిపోయాయి. వైరస్‌ వ్యాప్తి తగ్గే వరకు వేచిచూసే ధోరణిలో కొనుగోలుదారులు ఉన్నారు. హఫీజ్‌పేట్‌, బాచుపల్లి, ఎల్‌బీనగర్‌, గచ్చిబౌలి సహా నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాల్లో 2 వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. వారిలో ఝార్ఖండ్‌ సహా ఏపీలోని శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. పని ప్రదేశాల్లో కలిసి పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మాస్క్‌లు తప్పనిసరిగా ధరించేలా చూస్తున్నాం. అసరమైనవారికి మాస్క్‌లనూ పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే కూలీలందరికీ 2 డోసుల టీకాలు ఇప్పించాం. క్యాంపుల్లో లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచి వైద్య సాయం అందిస్తున్నాం.

- కె. శ్రీనివాసులు, డైరెక్టర్‌, వాసవి గ్రూప్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని