విస్తీర్ణం ప్రకారమే వసూలు

కమ్యూనిటీల్లో నిర్వహణ రుసుములను హౌసింగ్‌ సొసైటీలు, రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు(ఆర్‌డబ్ల్యూఎస్‌) నిర్ణయిస్తుంటాయి. ఇంటి యజమానుల అభిప్రాయాలను పరిగణనలోకి....

Updated : 05 Feb 2022 04:55 IST

హౌసింగ్‌ సొసైటీలు నిర్ణయించవచ్చు: తెలంగాణ వినియోగదారుల కమిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: కమ్యూనిటీల్లో నిర్వహణ రుసుములను హౌసింగ్‌ సొసైటీలు, రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు(ఆర్‌డబ్ల్యూఎస్‌) నిర్ణయిస్తుంటాయి. ఇంటి యజమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నెలవారీ  నిర్వహణను వ్యయాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయిస్తుంటారు. నెలవారీ నిర్వహణ రుసుంలు హైదరాబాద్‌లో తక్కువలో తక్కువ రూ.వెయ్యి నుంచి రూ.పాతికవేల  వరకు ఉన్నాయి. పెద్ద కమ్యూనిటీల్లో చదరపు అడుగుకి రెండు మూడు రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. సౌకర్యాలను బట్టి ఇది పెరుగుతుంది. మరికొన్ని చోట్ల ఒకే కమ్యూనిటీ అయినా రెండు, మూడు పడక గదుల విస్తీర్ణంలో నివాసాలు ఉంటాయి. ఇక్కడే వివాదాలు తలెత్తుతున్నాయి. మొదట్లో ఉన్న అసోసియేషన్లు విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే తరహా నిర్వహణ రుసుం వసూలు చేసేవి. తర్వాత  వచ్చిన అసోసియేషన్లు విస్తీర్ణం ఆధారంగా రుసుం అనేసరికి వివాదాలు పెరిగి వినియోగదారుల ఫోరం వరకు వెళ్లాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఫోరం తీర్పును కొట్టివేస్తూ.. విస్తీర్ణం ఆధారంగా నిర్వహణ రుసుం వసూలు చేసే అధికారం చట్టబద్ధంగా ఎన్నికైన అసోసియేషన్లకు ఉంటుందని తీర్పు చెప్పింది. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో  ఉన్న ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో 154 నివాసాలు ఉన్నాయి. ఇక్కడ 1281-3270 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు నివాసాలు ఉన్నాయి. ఇందులో ఒకరు అందరికీ ఒకే నిర్వహణ రుసం ఉండాలని జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించడంతో వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎక్కువ మంది మాత్రం విస్తీర్ణం ప్రకారం వసూలు చేసేందుకు సమ్మతించారు. దీంతో అసోసియేషన్‌ రాష్ట్ర  కమిషన్‌ను ఆశ్రయించడంతో కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ ఎంఎస్‌కే జైస్వి, సభ్యులు మీనా రాంనాథన్‌ విస్తీర్ణం ఆధారంగా నిర్వహణ రుసుం వసూలు చేసే అధికారం అసోసియేషన్‌ ఉందని తీర్పు వెల్లడించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని