భవిష్యత్తు మార్పులు

కొవిడ్‌ అనంతరం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పలు మార్పులు వచ్చాయి. కొనుగోలుదారుల అంచనాలను అందుకునేందుకు.. అవసరాలను తీర్చేందుకు నిర్మాణదారులు నిరంతరం కొత్త

Published : 26 Mar 2022 01:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ అనంతరం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పలు మార్పులు వచ్చాయి. కొనుగోలుదారుల అంచనాలను అందుకునేందుకు.. అవసరాలను తీర్చేందుకు నిర్మాణదారులు నిరంతరం కొత్త పోకడలతో ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీంతో గేటెడ్‌ కమ్యూనిటీలోని క్లబ్‌హౌస్‌లోనే కార్యాలయాల కోసం నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ కో వర్కింగ్‌, కోలివింగ్‌ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. కార్యాలయ వాతావరణం కోసం వీటివైపు కొంత మంది మొగ్గు చూపుతున్నారు. ఉపయోగించుకున్నందుకు అద్దె చెల్లిస్తే సరిపోతుంది. కొత్తగా కార్యాలయాల స్థలాలను విక్రయిస్తాం అంటున్నాయి కొన్ని స్థిరాస్తి సంస్థలు. భవిష్యత్తు మార్పులకు అనుగుణంగా ఇంటితో పాటూ విడిగా అదే కమ్యూనిటీలో వంద చదరపు అడుగుల మొదలు ఎంత స్థలం కావాలంటే అంత కార్యాలయ నిర్మాణ స్థలం విక్రయస్తాం అంటున్నాయి. తమకు ఇంట్లోనే ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటుకు అనువుగా మరింత విశాలమైన ఇళ్లను సైతం నిర్మించి ఇస్తున్నారు. 

* ఇల్లు, కార్యాలయం దేని ప్రాధాన్యం దానిదే. టౌన్‌షిప్పుల రాకతో కార్యాలయానికి సమీపంలో నివాసాలు ఉంటాయి. నడుచుకుంటూ, సైకిల్‌ తొక్కుకుంటూ కార్యాలయానికి వెళ్లిరావొచ్చు. ఇక్కడ వాణిజ్య, వినోద సదుపాయాలు కల్పించే మినీ పట్టణాలు రూపుదిద్దుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో అవుటర్‌ బయట ఈ తరహా నిర్మాణాలు చూడబోతున్నాం. ప్రస్తుతం చాలావరకు కాన్సెప్టు దశలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇన్నర్‌రింగ్‌రోడ్డు చుట్టుపక్కల ఒకప్పుడు ఇదే పద్ధతిలో ఏర్పాటు చేశాయి. ప్రైవేటులోనూ ఈ పోకడ వస్తోంది.

* భూముల ధరలు భారంగా మారడంతో కమ్యూనిటీల్లో కో లివింగ్‌ విస్తరిస్తోంది. 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇళ్లు ఉంటాయి. వీటినే సూట్‌ హోమ్స్‌ అంటున్నారు. స్టూడియో రూమ్‌ అని కూడా పిలుస్తున్నారు. వంటగది, గ్రంథాలయం, జిమ్‌, యోగా కేంద్రం, లాంజ్‌, వర్క్‌జోన్‌, యుటిలిటీ ప్రాంతం అన్నీ ఉమ్మడిగా ఉంటాయి. మిగతావారితో కలిసి వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. హాస్టల్స్‌, పీజీ కేంద్రాల కంటే మరింత మెరుగైన జీవనశైలి వీటిలో సొంతం అని చెబుతున్నారు. మీ ఇంట్లో మీరే ఉంటారు.. మిగతా విషయాలన్నీ కంపెనీలు చూసుకుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని