పచ్చని పొదరిల్లు.. స్వయం సమృద్ధిగా వర్ధిల్లు

హరిత భవనాలంటే పచ్చదనం మాత్రమే కాదు.  వాటిల్లో నివసించేవారు, అక్కడ పనిచేసేవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా.. ఉత్పాదకత, జీవన ప్రమాణాలు పెంచే విధంగా.. పర్యావరణానికి హాని

Published : 02 Apr 2022 03:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: హరిత భవనాలంటే పచ్చదనం మాత్రమే కాదు.  వాటిల్లో నివసించేవారు, అక్కడ పనిచేసేవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా.. ఉత్పాదకత, జీవన ప్రమాణాలు పెంచే విధంగా.. పర్యావరణానికి హాని తగ్గించేదిలా ఉండటం ప్రధానం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మన దగ్గర కొన్ని సంస్థలు నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తూ తమ ప్రత్యేకతను చాటుతున్నాయి.  కొవిడ్‌ తర్వాత ఈ తరహా నివాసాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. కొనుగోలుదారుల్లో అవగాహన పెరగడంతో నిర్మాణసంస్థలు కొత్తదనం చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి.. స్వయం సమృద్ధి గృహాలను చేపడుతున్నాయి.
నగరంలో ఇళ్లను చూస్తే కాంక్రీట్‌ జంగిల్‌ మాదిరిగా తలపిస్తాయి. ఒకదాని పక్కకే మరోటి.. దగ్గర దగ్గరగా నివాసాలు. భూముల ధరలకు రెక్కలు రావడంతో సెట్‌బ్యాక్‌ వదలకుండా కట్టేస్తున్నారు. నిర్మాణాలు విస్తరించే కొద్దీ పచ్చదనం మరింత తగ్గిపోతోంది. వాహనాల పెరుగుదలతో కాలుష్యం అధికం అవుతోంది. ప్రశాంతంగా, కాలుష్యానికి దూరంగా ఉందామనుకునేవారు శివార్లకు వెళుతున్నారు. వ్యక్తిగత ఇళ్లు, విల్లాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఉపాధిరీత్యా దూరంగా వెళ్లలేనివారు సిటీ మధ్యలోనే ఉంటున్నా కొంతకాలం క్రితం వరకు హరిత భవనాలు పెద్దగా అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల ఈ తరహా జీవనశైలి నిర్మాణాలు వస్తున్నాయి. అందమైన ఆరోగ్యకరమైన పొదరిల్లును, కమ్యూనిటీలను తీర్చిదిద్దే బాధ్యతను బిల్డర్లు తమ భుజాలపై సంతోషంగా మోయడానికి సిద్ధపడుతున్నారు.

నిటారు వనాలు..

సిటీలో కొత్త వస్తున్న ప్రాజెక్టులన్నీ ఆకాశహర్మ్యాలే. పక్కపక్కనే  మూడు నుంచి పది వరకు టవర్లు.. కింద ఖాళీ స్థలంలో చెట్లు, మొక్కలు నాటడంతోనే సరిపెట్టకుండా వర్టికల్‌ గార్డెన్లు పెంచుతున్నారు. మారిన నిర్మాణ తీరుతెన్నులతో ఇది అవసరం కూడా. ఒక భవనంలో వందల సంఖ్యలో చెట్లు, వేల సంఖ్యలో పొదలు పెంచే ప్రయత్నం సిటీలోనూ మొదలైంది. ఫలితంగా వాహన కాలుష్యం తగ్గించి ఆక్సిజన్‌ పెంచేందుకు సహాయపడుతున్నాయి. గాలులు, ఉష్ణోగ్రతలు, శబ్ధ కాలుష్యం నియంత్రించడానికి దోహదం చేస్తుందని బిల్డర్లు అంటున్నారు. మొక్కల పెంపకానికి అనుకూలంగా బాల్కనీలను ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నారు. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేలా చేస్తున్నారు. పడక గది దగ్గర స్వచ్ఛమైన గాలి ప్రసరించే మొక్కలు.. పిల్లల గది పక్కన జ్ఞాపక శక్తి పెంపొందించడానికి దోహదం చేసే మొక్కలు, ఆహ్లాదకరంగా ఉండే మొక్కలు ఇలా గదిని బట్టి మొక్కలు పెంచుకునేందుకు హరిత భవనాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. నీరు పోసేందుకు డ్రిప్‌ విధానం అనుసరిస్తున్నారు. గది లోపల కాలుష్య స్థాయిలను బట్టి  స్వచ్ఛమైన గాలిని గదుల్లోకి  ప్రసరించేలా ఆటోమేటిక్‌ విండోస్‌ను సైతం ప్రవేశపెడుతున్నారు. ఇంట్లో కాలుష్యం పెరిగిందని సెన్సర్ల ద్వారా గుర్తించగానే కిటికీలు తెరుచుకుంటాయి. గతంలో ఇళ్లలో కిటికీల పైన వెంటిలేటర్లు ఉండేవి. గదిలోని వేడి గాలిని బయటికి పంపడానికి అనువుగా  ఉండేవి. ఏసీల వాడకం మొదలయ్యాక వెంటిలేటర్ల బిగింపు పూర్తిగా మానేశారు. కొత్తగా వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తూ.. అవసరమైనప్పుడు ఆటోమెటిక్‌గా తెరుచుకుని మూసుకునేలా టెక్నాలజీని నిర్మాణదారులు వాడుతున్నారు.

వాన నీటిని ఒడిసి పట్టేలా..

వేసవి వచ్చిందంటే చాలా కమ్యూనిటీల్లో నీటి కొరతను ఎదుర్కొంటుంటారు. ట్యాంకర్లతో నీటిని పోయించుకుంటారు. వానాకాలంలో వరదలతో జనావాసాలు నీటమునుగుతున్నాయి. నిర్మాణాలు చేపట్టే సమయంలో వర్షపు నీరు ఇంకేలా ఇంకుడు గుంతలు నిర్మించాలనే నిబంధనలు ఉన్నా.. అవి ఎప్పుడో రూపొందించినవి. అప్పట్లో నగరంలో భూగర్భ జలాలు 200 అడుగుల లోతులో ఉండేవి. 15 అడుగుల లోతు ఇంకుడు గుంతలు సరిపోయేవి. ప్రస్తుతం సిటీలో 500 అడుగుల లోతులో బోర్లు వేస్తే తప్ప జలం జాడ చిక్కడం లేదు. వీటి నుంచి ప్రతిరోజూ లక్షల లీటర్ల నీటిని తోడేస్తున్నారు. ఒక్కో గృహ సముదాయంలో 500 నుంచి 2వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ భవనాలపై కురిసిన నీటిని ఒడిసి పట్టగలిగితే నీటి కొరత ఏర్పడినప్పుడు వాడుకోవచ్చు. కొన్ని కమ్యూనిటీల్లో నెలరోజులకు సరిపడా వాననీటిని సంరక్షిస్తున్నారు. మిగతా నీటిని 500 నుంచి 750 అడుగుల వరకు డమ్మీ బోర్లు తవ్వి నీటిని ఇంకిస్తున్నారు. ప్రతి నీటి బొట్టును భూమిలోకి ఇంకించడం, ఫలితంగా భూగర్భ జలాలు తగ్గకుండా సుస్థిర విధానాలు అవలంబిస్తున్నారు.

వేడిని తట్టుకునేలా..  

హరిత భవనాల్లో పచ్చదనంతో పాటూ నిర్మాణంలో ఉపయోగించే సామగ్రి కీలకమే. హైదరాబాద్‌లో వేసవి కాలంలో ఎక్కువ వేడి ఉంటుంది. తట్టుకోలేక ఏసీల వాడకం విపరీతంగా పెరుగుతోంది. ఇది పర్యావరణానికి హాని చేసేదే. హరితభవనాల్లో నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువ వేడిని గ్రహించే ఇటుకలు కాకుండా తక్కువగా గ్రహించే మట్టి ఇటుకలను వినియోగిస్తున్నారు. కాంక్రీట్‌ గోడల స్థానంలో వీటికి పెద్దపీట వేస్తున్నారు. ఫలితంగా గది లోపల ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువ ఉంటాయని బిల్డర్లు చెబుతున్నారు. సౌర విద్యుత్తు వాడకం, ఐజీబీసీ ధృవీకరించిన రంగులు, నిర్మాణ సామగ్రి ఉపయోగించడం వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) నుంచి ప్లాటినం, గోల్డ్‌ రేటింగ్‌, యూఎస్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ నుంచి లీడ్‌ ప్లాటినం రేటింగ్‌తో హరిత భవనాలు కడుతున్నారు.

వెల్‌నెస్‌కు ప్రాధాన్యం..

ఇంట్లోకి సహజసిద్ధంగా వెలుతురు ప్రసరించాలి..  ఇంధన వినియోగం తక్కువగా ఉండాలి.. నీటి ఆదాతో పాటూ వాననీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.. పచ్చదనానికి పెద్దపీట వేయాలి.. ఇంటి నిర్మాణంలో స్థానికంగా దొరికే నిర్మాణ సామగ్రి వినియోగం.. నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం, సౌర విద్యుత్తు వాడకం.. మొత్తంగా పర్యావరణ హితంగా నిర్మించే వాటినే హరిత భవనాలు అంటున్నారు. ఇప్పటికే పలు సంస్థలు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) రేటింగ్‌తో నిర్మాణాలు చేపట్టగా.. వీరి బాటలోనే మరికొన్ని పెద్ద, చిన్న సంస్థలు అడుగులు వేస్తున్నాయి. హరిత నిర్మాణాలపై అవగాహన పెరగడంతో ఈ తరహా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

* కొవిడ్‌తో పిల్లలు ఇంటి నుంచే పాఠాలు, పెద్దలు కార్యాలయ పనులు చేస్తున్నారు. రోజంతా ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నారు. ఇంటి వాతావరణం ఆహ్లాదంగా, ఆరోగ్యకరంగా లేకపోతే రోజుల తరబడి ఉండలేరు. ఇదివరకు కార్యాలయాల్లో రోజులో ఎక్కువ సమయం గడిపేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పలు సంస్థలు తమ ఉద్యోగుల ఆరోగ్యం కోసం వెల్‌నెస్‌ భవనాల పోకడలను చేపట్టాయి.

* హరిత భవనాల్లో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడం ప్రధానంగా ఉంటే.. వెల్‌నెస్‌లో వీటితో పాటూ సుస్థిర భవనం లక్ష్యంగా నిర్మాణాలు ఉంటాయి. వీటిలో ఉండేవారి ఆరోగ్యం ప్రాధాన్యంగా ఇంటీరియర్‌ మొదలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కొవిడ్‌ అనంతరం నివాసాల్లోనూ వీటికి ప్రాధాన్యం పెరిగింది.

* విద్యుత్తు ఆదా, సమర్థంగా నీటి వినియోగం, వ్యర్థాలను వేరు చేయడం వంటి చర్యలతో పాటూ. గాలి నాణ్యత పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం వీటిలో ముఖ్య ఉద్దేశం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని