శ్లాబు దశలో ఆగిన నిర్మాణ పనులు

గచ్చిబౌలిలో వందకుపైగా ఫ్లాట్లతో అపార్ట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టిన ఒక బిల్డర్‌ సివిల్‌ వర్క్‌ను గుత్తేదారుకు అప్పగించారు. ఏడాదిక్రితం చదరపు అడుగుకు రూ.1250 లాగా ఒప్పందం చేసుకున్నారు. నిర్మాణ ముడిసామగ్రి ధరలు 10 శాతం వరకు హెచ్చుతగ్గులైనా సరే భరిస్తానని పనులు చేపట్టారు. రెండు టవర్లలో ఒకటి పూర్తైంది. రెండోది శ్లాబు వేసే సరికి స్టీల్‌ ధర టన్నుకు రూ.45వేల నుంచి రూ.80వేల పైచిలుకు పెరిగింది. ఏకంగా రెట్టింపు కావడంతో గుత్తేదారు నెల రోజులుగా రెండో అంతస్తు....

Published : 09 Apr 2022 02:42 IST

ఈనాడు, హైదరాబాద్‌

చ్చిబౌలిలో వందకుపైగా ఫ్లాట్లతో అపార్ట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టిన ఒక బిల్డర్‌ సివిల్‌ వర్క్‌ను గుత్తేదారుకు అప్పగించారు. ఏడాదిక్రితం చదరపు అడుగుకు రూ.1250 లాగా ఒప్పందం చేసుకున్నారు. నిర్మాణ ముడిసామగ్రి ధరలు 10 శాతం వరకు హెచ్చుతగ్గులైనా సరే భరిస్తానని పనులు చేపట్టారు. రెండు టవర్లలో ఒకటి పూర్తైంది. రెండోది శ్లాబు వేసే సరికి స్టీల్‌ ధర టన్నుకు రూ.45వేల నుంచి రూ.80వేల పైచిలుకు పెరిగింది. ఏకంగా రెట్టింపు కావడంతో గుత్తేదారు నెల రోజులుగా రెండో అంతస్తు దగ్గరే పనులు ఆపేశారు. ఈ తరహాలో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు పెద్ద ఎత్తున శ్లాబుల దశలో ఆగిపోయాయి. పెద్ద బిల్డర్ల పరిస్థితే ఇలా ఉంటే.. చిన్న బిల్డర్ల పరిస్థితి ఊహించుకోవచ్చు అని రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు అంటున్నాయి.

స్టీలు, సిమెంట్‌ ధరలు నెలల వ్యవధిలోనే అనూహ్యంగా పెరగడం నిర్మాణ రంగానికి గుదిబండగా మారింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అనంతరం పరిస్థితి మరింత దిగజారింది. కొవిడ్‌ అనంతరం రవాణా సమస్యలతో చాలావరకు ముడిసరకుల ధరలు పెరిగినా.. ఇటీవల స్టీల్‌ వంటి కీలక ముడిసరకు రెట్లు వంద శాతం పెరగడంతో నిర్మాణదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పెరిగిన ధరలతో అపార్ట్‌మెంట్‌ శ్లాబు పనులు చేపడితే నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉండటంతో పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కృత్రిమంగా పెంచుతున్న స్టీల్‌, సిమెంట్‌ ధరలను తగ్గించాలని నిర్మాణ సంఘాలన్నీ ఒక్కరోజు బంద్‌ను సైతం చేపట్టారు. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా భవన నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. క్రెడాయ్‌, ట్రెడా, టీబీఎఫ్‌, టీడీఏకి చెందిన వెయ్యి మంది డెవలపర్లు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డిలో ఒక్కరోజు పనులు ఆపేసి నిరసన తెలిపారు. వీరికి అదనంగా మరో 800 మంది డెవలపర్లు తెలంగాణ వ్యాప్తంగా కన్‌స్ట్రక్షన్‌ హాలిడే పాటించారు. దీంతో మూడు లక్షల మంది కార్మికులకు పనిలేకుండా పోయింది.

నెల రోజులుగా..

పెద్ద బిల్డర్లు కొద్ది మంది తప్ప చిన్న బిల్డర్లు ముఖ్యంగా స్టీల్‌తో ముడిపడిన శ్లాబు పనులను నెలరోజులుగా నిలిపేశారు. స్టీల్‌ ధరలు తగ్గిన తర్వాతే పనులు మొదలెడతాం అంటున్నారు. దీంతో ప్రాజెక్టులు పూర్తిచేయడం ఆరునెలలు ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. పనుల నిలిపివేత ఎక్కువ కాలం కొనసాగితే పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని.. కూలీలు ఉపాధి కోల్పోతారని స్థిరాస్తి సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది ఈ రంగమేనని గుర్తు చేస్తున్నాయి.

ఆ ప్రాజెక్టులు మరింత ఆలస్యం?

హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌ బాగుండటంతో గత రెండేళ్లలో పెద్ద ఎత్తున ప్రీలాంచింగ్‌లో ఫ్లాట్ల విక్రయాలు చేపట్టారు. తక్కువ ధరకే ఫ్లాట్లను కట్టి ఇస్తామని బుకింగ్స్‌ చేపట్టారు. మూడేళ్లలో గృహ ప్రవేశం చేయవచ్చు అని హామీ ఇచ్చారు. చదరపు అడుగు రూ.5వేల స్థానంలో రూ.3500లకే విక్రయించారు. వీరు అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు మొదలెడదాం అనుకునే సమయానికి ముడిసరకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో పనులు ఎలా మొదలెట్టాలనే తర్జనభర్జనలో డెవలపర్లు ఉన్నారు. వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ప్రీలాంచింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ మరింత ఆలస్యం కానున్నాయి.

స్టీల్‌ అవసరం ఎంత?

ఇంటి నిర్మాణంలో ఆర్‌సీసీ స్ట్రక్చర్‌కు ప్రతి చదరపు అడుగుకు 3.5 నుంచి 4కిలోల వరకు స్టీల్‌ పడుతుంది.

1200 చదరపు అడుగుల విస్తీర్ణం కల్గిన ఇంటికి 4200 నుంచి 4800 కిలోల స్టీల్‌ పడుతుందని బిల్డర్లు అంటున్నారు.

కొన్నినెలల క్రితం వరకు స్టీల్‌ కిలో రూ.45 ఉండేది. అప్పుడు 4800 కిలోలకు రూ.2.16 లక్షలు అయ్యేది. పెరిగిన ధరలు కిలో రూ.80 ప్రకారం రూ. 3.84 లక్షలు అవుతుంది. ఒక్కస్టీల్‌ దగ్గర చిన్న ఇంటి నిర్మాణానికి పెరిగిన ధరలతో రూ.1.68 లక్షలు తేడా వస్తోంది. సిమెంట్‌, ప్లంబింగ్‌ సామగ్రితో కలిపితే భారం రెట్టింపు అవుతుంది.

బహుళ అంతస్తుల భవనాల్లో వేల చదరపు అడుగుల నిర్మాణం చేపడుతుంటారు. శ్లాబుల దశలో ఉన్న భవనాలను పూర్తి చేయాలంటే అదనంగా లక్షల రూపాయల భారం అవుతుందని బిల్డర్లు చెబుతున్నారు. కొనుగోలుదారులతో ముందే ఒక ధరకు ఒప్పందం చేసుకున్నందువల్ల ధర పెంచలేమని.. అందుకే ధరలు తగ్గే వరకు ఎదురుచూస్తున్నామని బిల్డర్లు చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు