పశ్చిమం VS పశ్చిమం

జీవో 111 ఎత్తివేత ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పై ఏ మేరకు ఉంటుందనే దానిపై క్రమంగా స్పష్టత వస్తోంది. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల కంటే పశ్చిమంపై దీని ప్రభావం కనిపిస్తోంది. తొలగింపు ప్రకటనతోనే అక్కడి మార్కెట్‌లో ఒకరకమైన స్తబ్ధత నెలకొంది. ప్రభుత్వం ఇప్పటివరకు జీవో ఇచ్చింది

Updated : 07 May 2022 06:02 IST

జీవో 111 ఎత్తివేత ప్రభావం అక్కడే అధికం
ఈనాడు, హైదరాబాద్‌

జీవో 111 ఎత్తివేత ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పై ఏ మేరకు ఉంటుందనే దానిపై క్రమంగా స్పష్టత వస్తోంది. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల కంటే పశ్చిమంపై దీని ప్రభావం కనిపిస్తోంది. తొలగింపు ప్రకటనతోనే అక్కడి మార్కెట్‌లో ఒకరకమైన స్తబ్ధత నెలకొంది. ప్రభుత్వం ఇప్పటివరకు జీవో ఇచ్చింది తప్ప ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయబోతోందో.. అనుమతుల విధి విధానాలేమిటో ప్రకటించలేదు. దీంతో పశ్చిమ హైదరాబాద్‌ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది.
జీవో ఎత్తివేసిన ప్రాంతంలో అధికశాతం పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతంలోనే ఉంది. ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు చేరువలో జీవో పరిధిలోని భూములు ఉన్నాయి. ఇక్కడ ఏకంగా 1.32 లక్షల ఎకరాలు అందుబాటులోకి రాబోతుండటంతో ధరలు తగ్గుతాయనే ప్రచారం జరిగింది. దీంతో కొందరు కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. గతంలో 20మంది విచారించి ఒకరు కొనుగోలు చేస్తే.. ప్రస్తుతం 10 మంది విచారించి ఒకరు కొంటున్నారని ఓ బిల్డర్‌ తెలిపారు. విచారణలు మాత్రం బాగా తగ్గిపోయాయని చెప్పారు. ధరలు తగ్గుతాయనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఆ మూడు మార్గాల్లో..
జీవో తొలగింపుతో ప్రధానంగా శంకర్‌పల్లి మార్గం, మొహినాబాద్‌-చేవెళ్ల, బెంగళూరు జాతీయ రహదారిలో శంషాబాద్‌ నుంచి కొత్తూరు వరకు ఉన్న భూములపై ఆంక్షలు తొలగినట్లైంది. ఇక్కడ అభివృద్ధికి బాటలు పడనున్నాయి.  జీవో111 కారణంగా ఇంతకాలం ఎక్కువగా వ్యవసాయ క్షేత్రాలనే నిర్మించుకున్నారు. భూముల ధరలు తక్కువే ఉండేవి. సర్కారు ప్రకటనతో ఇక్కడ భూముల ధరలు సైతం ఒక్కసారిగా పెంచేశారు. ఈ ప్రాంతాల్లో బేరసారాలు మాత్రం జరుగుతున్నాయి. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ చేరువలోని జీవో 111 పరిధి ప్రాంతంలో మొన్నటి వరకు ఎకరాకు రూ.9కోట్లు ఉండగా ఇప్పుడు అక్కడ రూ.20 కోట్ల వరకు చెబుతున్నారని రియల్టర్‌ ఒకరు అన్నారు.  

ఆయా ప్రాంతాల్లో..
శంకర్‌పల్లి మార్గంలో రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు ముఖ్య కేంద్రంగా ఉన్న ప్రాంతం మోఖిల్లా. మొదట్లో విల్లా ప్రాజెక్టులతో మొదలై ఇప్పుడు అపార్ట్‌మెంట్లు వస్తున్నాయి. ఇక్కడ ఎకరా రూ.20 కోట్ల వరకు ఉంది. పక్కనే ఉన్న గ్రామాలు ఇంతకాలం జీవో 111 పరిధిలో ఉండటంతో భూముల లభ్యత లేక మోఖిల్లా వంటి ప్రాంతాల్లో ధరలు పెరుగుతూ పోయాయి. శంకర్‌పల్లి, పటాన్‌చెరు, కంది, సంగారెడ్డి వరకు పశ్చిమ హైదరాబాద్‌ మార్కెట్‌ విస్తరించుకుంటూ వెళ్లింది. సర్కారు ప్రకటనతో ఈ ప్రాంతంలోని రియల్‌ ఎస్టేట్‌పై కొంత ప్రభావం ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ఒక్కో ప్రాంతానికి ఒక్కో కస్టమర్‌ బేస్‌ ఉంటుంది. వారు అక్కడ తప్ప వేరేచోట కొనడానికి ఆసక్తి చూపరు. ఇంతకాలం పశ్చిమంలో పెట్టుబడులు పెడుతూ వచ్చినవారు.. పశ్చిమంలోనే పెద్ద ఎత్తున భూముల లభ్యత వస్తుండటంతో అవకాశం అందిపుచ్చుకోవాలని చూడటం సహజం కాబట్టి జీవో ప్రభావం పశ్చిమం వర్సెస్‌ పశ్చిమంలోనే ఉంటుంది’ అని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రతినిధి విశ్లేషించారు.

ఫ్లాట్ల ధరల తగ్గుదలపై ఆశలు
నార్సింగి, కోకాపేట, గండిపేట తదితర ప్రాంతాలు బహుళ అంతస్తులతో నిండిపోయాయి. ఇక్కడ కోటి రూపాయలు లేనిదే ఫ్లాట్‌ వచ్చే పరిస్థితి లేదు. పక్కనే ఉన్న భూములు అందుబాటులోకి వస్తే ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు. భూమి తక్కువ ధరకు కొనుగోలు చేసినా.. మార్కెట్లో  ఏ ధర ఉందో దానికే విక్రయిస్తారు తప్ప తక్కువకు ఎవరూ ఇవ్వరని నిర్మాణదారులు అంటున్నారు.  స్టీల్‌తో సహా నిర్మాణ సామగ్రి రేట్లు పెరిగిన పరిస్థితుల్లో ధరలు తగ్గుతాయని భావించలేమన్నారు.  ఇప్పటివరకు ఆ విధంగా ధరలు ఎక్కడా తగ్గలేదన్నారు. ప్రస్తుతం మార్కెట్‌ స్తబ్ధుగా ఉందని... ఫ్లాట్‌ కొనే ఆలోచన ఉన్నవారు బిల్డర్లతో గట్టిగా బేరమాడేందుకు ఇది అనువైన సమయమని సుమధుర ఉపాధ్యక్షుడు అరుణ్‌ అన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని