టీడీఆర్‌తో అదనపు లబ్ధి

రాజధాని పరిధిలో అపార్ట్‌మెంట్ల నిర్మాణదారులకు టీడీఆర్‌(అభివృద్ధి బదలాయింపు హక్కు) వరంలా మారింది. నిర్మాణ సంస్థలు దీనిని ఉపయోగించి తక్కువ స్థలంలో ఒకటి నుంచి రెండో అదనపు అంతస్తులు నిర్మిస్తున్నాయి. భూమిపై చేసిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు బిల్డర్లకు ఇదొక వరంలా మారింది

Published : 07 May 2022 04:31 IST

300గజాల్లో ఐదు  అంతస్తులకు అనుమతి
600కు మించిన స్థలాలకూ ఉపయోగం
అపార్ట్‌మెంట్లకు వరంలా మారిన కొత్త సదుపాయం
ఈనాడు, హైదరాబాద్‌

రాజధాని పరిధిలో అపార్ట్‌మెంట్ల నిర్మాణదారులకు టీడీఆర్‌(అభివృద్ధి బదలాయింపు హక్కు) వరంలా మారింది. నిర్మాణ సంస్థలు దీనిని ఉపయోగించి తక్కువ స్థలంలో ఒకటి నుంచి రెండో అదనపు అంతస్తులు నిర్మిస్తున్నాయి. భూమిపై చేసిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు బిల్డర్లకు ఇదొక వరంలా మారింది. ఇళ్ల కొనుగోలుదారులకూ లబ్ధి చేకూరుతోంది. కోరుకున్న ప్రాంతంలో ప్రత్యేక నిబంధనల కింద అదనంగా నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేయగలుగుతున్నారు. ఈ రకంగా టీడీఆర్‌ నిర్మాణదారులు, వినియోగదారులకు ఉభయతారకంగా ఉపయోగపడుతోంది. భూమి విలువతో పోలిస్తే టీడీఆర్‌ తక్కువ ధరకు లభిస్తుండటంతో నిర్మాణ వ్యయం, ఇంటి ధర కూడా స్వల్పంగా తగ్గుతోందని జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం స్పష్టం చేస్తోంది. ఇటీవల టీడీఆర్‌ను ఉపయోగించి ఇళ్లు కట్టుకునేవారి సంఖ్య పెరిగిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

టీడీఆర్‌ అంటే..
అభివృద్ధి బదలాయింపు హక్కు(టీడీఆర్‌)ను జీహెచ్‌ఎంసీ భూ యజమానులకు అందిస్తుంది. రహదారులకు, చెరువుల అభివృద్ధికి, ఇతర పనులకు ఆయా ప్రభుత్వ సంస్థలు భూసేకరణ చేపడతాయి. దాని కోసం నిధులను వెచ్చించకుండా.. ప్రభుత్వ విలువ ఆధారంగా రెట్టింపు మొత్తంలో టీడీఆర్‌ను ఇస్తున్నాయి. పట్టా భూములకు 400శాతం, చెరువుల్లోని శిఖం భూములకు, గ్రామ కంఠం భూములకు 200శాతం లెక్కన టీడీఆర్‌ అందుతుంది. దీని వల్ల భూమిని కోల్పోయిన వారికి తక్షణమే టీడీఆర్‌ రూపంలో నష్టపరిహారం అందుతుంది. ఈ టీడీఆర్‌ను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కడైనా వినియోగదారులు అదనపు అంతస్తుల నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు.

ఎవరికి ఇది అవసరం
భూ విస్తీర్ణం తక్కువగా అందుబాటులో ఉండి, అక్కడ ఎక్కువ అంతస్తులు కట్టుకోలేకపోతుంటే టీడీఆర్‌ ఉపయోగపడుతుంది. నిబంధనల ప్రకారం 200గజాల విస్తీర్ణంలో రెండు అంతస్తులే కట్టుకోగలరు. పార్కింగ్‌ వసతి ఉంటే.. టీడీఆర్‌ సాయంతో మరో అంతస్తును నిర్మించుకోవచ్చు. 300, 400, 500గజాల్లో టీడీఆర్‌ను ఉపయోగించి నాలుగు లేదా ఐదు అంతస్తులు కట్టుకోవచ్చు. ఎక్కువగా.. 300 నుంచి 400గజాల విస్తీర్ణంలోని భవన సముదాయాలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నాయి. 600 గజాల్లోపు స్థలాల్లో గరిష్ఠంగా ఐదు అంతస్తులు నిర్మించుకోవచ్చు. అంతకు మించి భూ విస్తీర్ణం అందుబాటులో ఉంటే.. ఆరు అంతస్తులకు అనుమతి తీసుకున్న వారు.. అదనపు సెట్‌ బ్యాక్‌ అవసరం లేకుండా, టీడీఆర్‌తో మరో రెండు అంతస్తులు నిర్మించుకోవచ్చు. అలాగే 7 అంతస్తుల అనుమతితో తొమ్మిది, 8 అంతస్తుల అనుమతితో 10, పదింటికి అనుమతితో 12 అంతస్తులను అధికారికంగా కట్టుకోవచ్చు. నగరంలో ఈ తరహాలో చాలా అపార్ట్‌మెంట్లు అదనపు అంతస్తులు నిర్మిస్తున్నాయి. మియాపూర్‌లో 43 అంతస్తులకు అనుమతి తీసుకుంటున్న ఓ భారీ నిర్మాణ సంస్థ.. టీడీఆర్‌ను ఉపయోగించుకుని 45 అంతస్తులు కట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.


ధర ఎలా ఉంటుందంటే..

ప్రభుత్వ భూ విలువ చదరపు గజం లెక్కన ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. ఉదాహరణకు.. కార్వాన్‌లో చదరపు గజం రూ.16,400లు ఉంటే, మూసాపేటలో రూ.21వేలుగా ఉంది. జూబ్లీహిల్స్‌లో చదరపు గజం రూ.41వేలకుపైనే ఉంది. అక్కడి ఓ వ్యక్తి ఇంటిని జీహెచ్‌ఎంసీ 100గజాల మేర రోడ్డు విస్తరణకు తీసుకుంటే.. అతనికి 400గజాలకు ప్రభుత్వ ధరతో టీడీఆర్‌ ఇస్తుంది. అంటే.. అతని వద్ద రూ.1.64కోట్ల విలువైన టీడీఆర్‌ ఉంటుంది. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి విలువ పెరిగితే.. టీడీఆర్‌ విలువ కూడా పెరుగుతుంది. ఇక.. జూబ్లీహిల్స్‌లోని వ్యక్తి దగ్గరున్న టీడీఆర్‌ను కార్వాన్‌లోని 200గజాల ఇంటి యజమాని కొనాల్సి వస్తే.. కార్వాన్‌లో 200గజాల ప్రభుత్వ ధర రూ.32లక్షలు. ఆ విలువకు సమానమైన మొత్తంలో జూబ్లీహిల్స్‌ నుంచి టీడీఆర్‌ను కొంటే సరిపోతుంది. అంటే.. జూబ్లీహిల్స్‌ నుంచి 19.51చదరపు గజాల టీడీఆర్‌ను కొనాలి. ఈ లావాదేవీలో.. కొనుగోలుదారుడు అమ్మేవారిని రాయితీ అడుగుతారు. అవసరం, అవకాశాల ఆధారంగా ఓ ధర వద్ద లావాదేవీ పూర్తవుతుంది.


వినియోగించుకోవడం ఎలా..
జీహెచ్‌ఎంసీ టీడీఆర్‌ అమ్మకందారులను, అది అవసరమైన వినియోగదారులను కలిపేందుకు టీడీఆర్‌ బ్యాంక్‌ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను తెరిచింది. అందులో టీడీఆర్‌ యజమాని పేరు, వారి దగ్గరున్న టీడీఆర్‌ విస్తీర్ణం, ఇతర వివరాలుంటాయి. అవసరమైన వారు యూజర్‌ ఐడీ సాయంతో వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావొచ్చు. టీడీఆర్‌ యజమానుల పట్టికలోని నోటిఫికేషన్‌(గంట గుర్తు)ను నొక్కితే.. వెబ్‌సైట్‌లోని యజమానులందరికీ ఫలాన వ్యక్తి టీడీఆర్‌ కొనుగోలు చేస్తారని తెలుపుతూ.. అమ్మకందారులందరికీ సంక్షిప్త సందేశం వెళుతుంది. టీడీఆర్‌ను అమ్ముకోవాలనుకున్న వ్యక్తులు ఆ ఎస్సెమ్మెస్‌లోని ఫోన్‌ నంబరును సంప్రదిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని