111 ప్రాంతం..క్రయవిక్రయాలకు ఊపు

దాదాపు 26 ఏళ్ల తర్వాత జీవో 111ను ఎత్తివేస్తూ తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంతో.. ఆ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. నెల రోజుల వ్యవధిలోనే 30-40 శాతం మేర రేట్లు పెరిగాయి. మున్ముందు ఈ ప్రాంతంలో ధరలు మరింత

Updated : 14 May 2022 04:29 IST

భూముల ధరలకు అమాంతం రెక్కలు
జోరుగా సాగుతున్న రిజిస్ట్రేషన్లు
ఈనాడు, హైదరాబాద్‌

దాదాపు 26 ఏళ్ల తర్వాత జీవో 111ను ఎత్తివేస్తూ తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంతో.. ఆ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. నెల రోజుల వ్యవధిలోనే 30-40 శాతం మేర రేట్లు పెరిగాయి. మున్ముందు ఈ ప్రాంతంలో ధరలు మరింత పెరుగుతాయని స్థిరాస్తి వ్యాపారులు అంచనా వేస్తున్నారు. జీఓ 111ను ఎత్తివేస్తామని అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 20న జీవో ఎత్తివేస్తూ.. మరో జీవో 69ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పరిణామంతో జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో స్థిరాస్తి రంగానికి ఊపిరి పోసినట్లు అయింది. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మొయినాబాద్‌ మండలంలో ఏప్రిల్‌ నెలలో 571 రిజిస్ట్రేషన్లు జరగగా.. ఈ నెలలో ఇప్పటికే 277 అయ్యాయి. శంషాబాద్‌లో ఏప్రిల్‌లో 308 రిజిస్ట్రేషన్లు కాగా.. ఈ నెలలో ఇప్పటికే 141 అయ్యాయి. నెలాఖరుకల్లా 400కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. గండిపేట, శంకర్‌పల్లి మండలాల్లోనూ రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడంతో తహసీల్దారు కార్యాలయాల వద్ద హడావుడి కనిపిస్తోంది.

అప్పుడు స్తబ్ధుగా.. ఇప్పుడు జోరుగా..

కొన్నేళ్లుగా జీవో 111 పరిధిలోకి వచ్చే మొయినాబాద్‌, శంషాబాద్‌, శంకర్‌పల్లి, కొత్తూరు, రాజేంద్రనగర్‌, గండిపేట మండలాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రశాంతమైన జీవనం గడిపేందుకు వీలుగా ఎకరా, అర ఎకరా మేర స్థలాలు కొనుగోలు చేసి ఫాంహౌస్‌లు నిర్మించి స్థిరాస్తి వ్యాపారులు విక్రయాలు చేపట్టారు. ఈ తరహా వ్యాపారానికి ఇక్కడి ప్రాంతాలు బాగా ప్రాధాన్యం సంపాదించుకున్నాయి. జీవో కారణంగా జీ+2కి మించి నిర్మాణాలు చేసే వీల్లేకపోవడంతో పాటు కన్జర్వేషన్‌ జోన్‌ కోసం 90 శాతం వదలాలనే నిబంధనతో నిర్మాణాలు ఎక్కువగా సాగలేదు. దీనివల్ల ఎంతోమంది స్థలాలు కొనుగోలు చేసి వదిలేశారు. సీఎం కేసీఆర్‌ ప్రకటన తర్వాత జీవో ఎత్తివేసే వరకు మార్కెట్‌ స్తబ్ధుగా కనిపించింది. జీవో ఎత్తివేస్తే ధరలు భారీగా పెరుగుతాయన్న ఉద్దేశంతో రైతులు, వ్యాపారులు భూములు అమ్మకుండా అప్పట్లో అట్టే పెట్టుకున్నారు. జీవో ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాక పరిస్థితుల్లో అమాంతం మార్పులు వచ్చాయి. ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే ఊహించని విధంగా రేట్లు పెంచి చెబుతున్నారు. సహజంగా ఈ పరిణామం మార్కెట్‌కు ఊపునిచ్చినా.. సామాన్యుడు కొనుగోలు చేయలేని స్థితికి ధరలు చేరుకున్నాయి.

ప్లాట్ల ధరల్లో భారీ వ్యత్యాసం

జీవో 111 ఎత్తివేస్తే నిర్మాణాలు ఊపందుకునే అవకాశం ఉందనే ప్రచారంతో లే అవుట్లలోని ప్లాట్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఆయా గ్రామాల్లో అనధికార లే అవుట్లు పెద్దసంఖ్యలో పుట్టుకొచ్చాయి. వీటిని హెచ్‌ఎండీఏ, పంచాయతీరాజ్‌ శాఖాధికారులు ఎప్పటికప్పుడు కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం ఆయా లే అవుట్లను క్రమబద్ధీకరించుకునే పనిలో ఉన్నారు. అధికారికంగా ఏర్పడిన లే అవుట్లలో ప్లాట్ల ధరలు అమాంతం పెరిగాయి. ప్రధాన రహదారుల పక్కన ఉన్న లే అవుట్లలో చదరపు గజం విలువ రూ.5 వేల నుంచి రూ.9వేలకు పెరిగింది. మున్ముందు మరింత పెరగనున్నాయనే సమాచారంతో ఇప్పుడే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. రహదారులు, నాలాల వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో స్థలాల విలువ పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

కొత్త జీవో వచ్చేలోపే..

జీవో 111 ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ.. మరో కొత్త జీవో రావాల్సి ఉంది. జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలేమిటో వివరిస్తూ ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. జంట జలాశయాలు కలుషితం కాకుండా తీసుకునే చర్యలపై కమిటీ నివేదిక ఇచ్చాక ప్రభుత్వం మరో జీవో జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జీవో పరిధి ఎంత వరకు ఉంటుంది..? ఏయే ఆంక్షలు ఉంటాయి..? బఫర్‌  జోన్‌, కన్జర్వేషన్‌ జోన్‌ వంటివి ఎక్కడి వరకు నిర్ణయిస్తారు..? నిర్మాణాలకు ఏ మేరకు అనుమతిస్తారనే విషయాలపై స్పష్టత రానుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా.. కొత్త ఆదేశాలు వచ్చేలోగా భూముల క్రయవిక్రయాలు చేపట్టేందుకు స్థిరాస్తి వ్యాపారులు, విక్రయదారులు ఆసక్తి చూపుతున్నారు. దీనికితోడు రిక్రియేషన్‌ కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉండటంతో.. అందుకు తగ్గట్టుగా స్థలాలు సమీకరించుకునే పనిలో వ్యాపారులు ఉన్నారు. కొత్త జీవోలో ఏయే ఆంక్షలు ఉంటాయో చూసి.. తదనుగుణంగా కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నారు.

హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ అమ్డాపూర్‌ సమీపంలో నెల రోజుల కిందట వరకు ఎకరా రూ.2 కోట్లు ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.3.50-4కోట్ల వరకు చెబుతున్నారు.

చిలుకూరు నుంచి ప్రగతి రిసార్టు వెళ్లే ప్రధాన రహదారిలో గతంలో ఎకరా ధర రూ.4కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.6కోట్ల వరకు చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని