సిరుల మార్గాలు.. సరికొత్త వ్యూహాలు

ఈ రోడ్డు చూడండి.. ఒక్క గుంత లేకుండా చక్కగా ఉంది కదూ..! దీన్ని ఆర్‌ అండ్‌ బీ శాఖ లేదా  పంచాయతీరాజ్‌ శాఖ అధికారులో వేశారని అనుకోకండి..! ఇది ఓ స్థిరాస్తి వ్యాపారి నిర్మించిన మార్గం.

Published : 21 May 2022 02:53 IST

శివారుల్లో తారురోడ్లు వేస్తున్న రియల్‌ వ్యాపారులు

భూముల ధరలు పెంచేలా నయా పోకడ

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, మొయినాబాద్‌

ఈ రోడ్డు చూడండి.. ఒక్క గుంత లేకుండా చక్కగా ఉంది కదూ..! దీన్ని ఆర్‌ అండ్‌ బీ శాఖ లేదా  పంచాయతీరాజ్‌ శాఖ అధికారులో వేశారని అనుకోకండి..! ఇది ఓ స్థిరాస్తి వ్యాపారి నిర్మించిన మార్గం. శంషాబాద్‌ మండలం కాచారం-సుల్తాన్‌పల్లి మధ్య గొలుసు రోడ్డు ఉంది. ఈ దారి గుంతలమయంగా మారి.. రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలతో నిండిపోయింది. ఓ రియల్‌ వ్యాపారి ఇక్కడ 19 ఎకరాలను కొనుగోలు చేసి వెంచర్‌ వేయాలని భావించారు. భూమిని అమ్ముకునేందుకు సుల్తాన్‌పల్లి వెళ్లే మార్గాన్ని ఇలా తారు రోడ్డుగా మార్చడంతో గ్రామస్థులకు ఎంతో మేలు జరుగుతోంది. కిలోమీటరు దూరానికి రూ.25లక్షల మేరకు వెచ్చించారు.

భూముల క్రయవిక్రయాలు.. ధరల పెరుగుదలకు  శివారుల్లో స్థిరాస్తి వ్యాపారులు కొత్త వ్యూహాలు అనుసరిస్తున్నారు. రోడ్డు సరిగాలేని చోట  పొలాలను తక్కువ ధరకు కొని.. బీటీ దారులు వేస్తున్నారు. తాము కొనుగోలు చేసిన భూములకు రేట్లు పెరగడంతోపాటు స్థానికుల రాకపోకలకు ఇక్కట్లు తొలగుతున్నాయి. శివారుల్లో ఈ తరహా వ్యవహారం జోరుగా సాగుతోంది. రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో భూములకు డిమాండ్‌ ఉంది. ఎకరా రూ.కోట్లలో పలుకుతోంది. మట్టి రోడ్లు, పొలం బాటలు ఉన్న చోట్ల పొలాలు కాస్త తక్కువ ధరకు లభిస్తుంటాయి.  అలాంటివి కొనుగోలు చేస్తున్నారు. ఏకమొత్తంలో 20-30 ఎకరాల మేర సేకరిస్తున్నారు. మట్టి రోడ్డుకంటే.. తారు రోడ్డు ఉంటే భూములకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. తిరిగి విక్రయించే ముందుగానే రోడ్లు వేసి ధరలకు రెక్కలు తొడుగుతున్నారు.


నగర శివారులోని చేవెళ్ల రేగడి ఘనాపూర్‌ నుంచి పూడూరు మండలం చిట్టెంపల్లికి మూడు కిలోమీటర్లు ఉంటుంది. పొలం బాట ఉండటతో నడిచి వెళ్లేందుకు వీల్లేకుండా ఉండేది. ఇక్కడ రోడ్డు నిర్మించాలని స్థానికులు, రైతులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. భూముల క్రయవిక్రయాల విషయంలోనూ స్తబ్ధత నెలకొంది. ఇక్కడ భూములు కొనుగోలు చేసిన రియల్‌ వ్యాపారులు మట్టిదారిని తారు రోడ్డుగా మార్చారు. ఇందుకు రూ.30 లక్షల మేరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. రోడ్డు వేసిన వారం రోజులకే భూముల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి.


స్థానికులకు ఉపయుక్తం
గ్రామాల్లో తారు రోడ్లు వేయాలని స్థానికులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా.. పరిపాలన అనుమతులు, నిధులు మంజూరు అయ్యేసరికి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. ఈలోగా స్థిరాస్తి వ్యాపారులు అగ్రిమెంట్‌ తీసుకున్న భూములను విక్రయించేందుకు తారు రోడ్లు నిర్మిస్తున్నారు. పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ శాఖలతో సంబంధం లేకుండా వ్యాపారులే రోడ్లు వేస్తుండటంతో స్థానికుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.

అదనపు లాభం ఖాయం
మట్టిరోడ్డు ఉంటే కొనుగోలు చేసిన ధర కంటే ఎకరాకు అదనంగా రూ.10లక్షల లాభం వస్తుండగా.. బీటీ రోడ్డు వేస్తే రూ.25లక్షలు పెరుగుతోందని చెబుతున్నారు. కొన్ని రోజులుగా స్థిరాస్తి వ్యాపారం స్తబ్దుగా మారినా.. ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. జీవో నం.111 ఎత్తివేయడంతో ఆ ప్రాంతంలో పొలాలకు మంచి ధర పలుకుతోంది. ఫామ్‌ల్యాండ్స్‌కు అధిక డిమాండ్‌ కనిపిస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని