మీ ఇల్లే నందనవనం

తొలకరి పలకరించనుంది. ఈ సారి మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇంటి ప్రాంగణంలో మొక్కలు పెంచుకోవాలని అనుకుంటున్నవారు ఇప్పటి నుంచి అందుకు సన్నద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. పెరట్లో, మేడపైన, బాల్కనీల్లో నచ్చిన అలంకరణ మొక్కలు, కూరగాయలు, ఆకు కూరలను పెంచుకోవచ్చు.

Updated : 04 Jun 2022 04:03 IST

ఈనాడు, హైదరాబాద్‌

తొలకరి పలకరించనుంది. ఈ సారి మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇంటి ప్రాంగణంలో మొక్కలు పెంచుకోవాలని అనుకుంటున్నవారు ఇప్పటి నుంచి అందుకు సన్నద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. పెరట్లో, మేడపైన, బాల్కనీల్లో నచ్చిన అలంకరణ మొక్కలు, కూరగాయలు, ఆకు కూరలను పెంచుకోవచ్చు. వానాకాలం ముగిసే నాటికి పచ్చందాలు స్వాగతం పలుకుతాయి. బాల్కనీలు, కిటికీల వద్ద పెంచుకోవడం ద్వారా చల్లగాలి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు.

సిటీలో వ్యక్తిగత నివాసాలతో పాటూ బహుళ అంతస్తులు ఆవాసాల్లోనూ పెద్ద సంఖ్యలో జనాలు ఉంటున్నారు. వీరు అపార్ట్‌మెంట్‌ వరండాలో, బాల్కనీలో అందమైన కుండీలలో చిన్నచిన్న మొక్కలను పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది. మెట్లు దిగే దగ్గర కుండీలు ఏర్పాటు చేసుకోవచ్చు. వేలాడదీసే కుండీలతో హైబ్రీడ్‌ మొక్కలు బాగుంటాయి. మనీ ప్లాంట్స్‌, సన్నజాతి తీగలతో అల్లుకునేవి అందంగా చూడముచ్చటగా ఉంటాయి.

అలంకరణ, పూల మొక్కలు
ఇంటి పెరట్లో మొక్కలను పెంచుకోవాలని అనుకున్నప్పుడు ఫలాలనిచ్చే రకాలు, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఔషధ గుణాలున్న మొక్కలు, చక్కని పరిమళాన్ని వెదజల్లేవి,  చూపరులకు కనువిందు చేసే పూల మొక్కలు, గాలిని శుభ్రపరిచేవి, ఇంటికి శోభనిచ్చేవి ఇలా ఎన్నో ఉన్నాయి.

* పెరట్లో మందారం, మల్లె, సంపంగి, బ్రహ్మకమలం పూల మొక్కలతోపాటు కొబ్బరి, పనస, దానిమ్మ, నారింజ తదితర చెట్లు పెంచుకోవచ్చు. గులాబీలను పదుల సంఖ్యలో పెంచుకోవచ్చు. చామంతుల తోట వేసుకోవచ్చు.

* ఇంటి ముందు ఖాళీ స్థలం ఎక్కువ ఉన్నట్లయితే నిటారుగా పెరిగే అశోక చెట్లు నీడనిస్తూ ఇంటి అందాన్ని ఇనుమడింప చేస్తాయి. గాలులను, బయటినుంచి వచ్చే దుమ్ముధూళిని అడ్డుకుంటాయి.

* ఇళ్లలోనూ కొబ్బరిచెట్లు పెంచుకోవడం మేలు. తక్కవ స్థలంలో నిటారుగా పెరుగుతాయి. గాలులను అడ్డుకుంటాయి.

కళకళలాడేలా... ఒక్కో రకం పూలు ఒక్కో కాలంలో పూస్తుంటాయి. దీనికి అనుగుణంగా మేడపైన స్థలాన్ని విభజించి చామంతుల తోట, గులాబీ వనం పెంచుకోవచ్చు. వర్షాకాలం వస్తే హైబిస్కస్‌ రకాలు.. జనవరి వరకు చామంతులు పూస్తే.. ఆ తర్వాత ఫిబ్రవరి వరకు గులాబీలు వస్తాయి. పెతోనియా, వెర్బెనా ఏప్రిల్‌ చివరి వరకు పూస్తాయి. ఇలా ఏడాది పొడవునా మేడపైన తోట కళకళలాడుతూ ఉండేలా పెంచుకోవచ్చు. 

ముందు జాగ్రత్తగా..
ఇంటిపైన తోట ఏర్పాటు చేసుకునే వారు మొక్కలకు పోసే నీరు కుండీల్లోంచి కారి బయటకు వస్తుంది. స్లాబులోకి లీకేజీలకు అవకాశం ఉంటుంది. అందుకే మేడపైన గార్డెన్‌ ఏర్పాటుకు ముందే స్లాబ్‌ను వాటర్‌ ఫ్రూప్‌ చేయించుకోవాలి. కొత్త ఇళ్లు కట్టుకునేవారు నిర్మాణ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు. పాత ఇంటిని ఇంజినీర్లతో పరిశీలించి జాగ్రత్తలు తీసుకున్నాక మొక్కల పెంపకాన్ని చేపట్టాలి. స్లాబ్‌పై భారం పడకుండా తేలిగ్గా ఉండే ప్లాస్టిక్‌ కుండీల్లో వీటిని పెంచుకోవచ్చు.

రుచికరంగా...
ఇంటి పెరట్లో స్థలం ఉంటే వంటింటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవడం ద్వారా రసాయనాలు లేని..సేంద్రియ ఎరువులతో పండిన పంటతో వంటింటి రుచులు మరింత ఘుమఘుమ లాడించవచ్చు. పురుగుమందుల అవశేషాలు లేని ఇంటి పంటతో కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఖర్చును ఆదా చేయవచ్చు.

* టమాటా ధర మార్కెట్లో భగ్గుమంటోంది. వానా కాలంలోనూ టమాటా నారు వేసుకోవచ్చు.

* వంకాయ.. ఏడాది పొడవునా పండే కూరగాయల్లో ఇదొకటి. మార్కెట్లో దొరికే వాటిని పెంచుకోవచ్చు. నారు సైతం విక్రయిస్తున్నారు.
* బెండ వానాకాలంలో నాటుకునేందుకు అనువైంది. పలురకాల విత్తనాలు మార్కెట్లో దొరుకుతున్నాయి.

* మిర్చి.. ఏడాది పొడవునా వంటల్లో ఉపయోగించే మిరపను సంవత్సరం పొడవునా ఇంట్లోనే సాగు చేసుకోవచ్చు. సంకరజాతి రకాలు ఉన్నాయి.

* క్యాప్సికం.. ఇంట్లో కూర వండుకునేందుకే కాకుండా సలాడ్స్‌లోనూ ఉపయోగిస్తుంటారు. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు కాయలిచ్చే రకాలు ఉన్నాయి.

* ఇంట్లోనే కుండీల్లో కొత్తిమీరను పెంచుకోవచ్చు.
* అల్లం చిన్న వేరు భాగాన్ని ఒకసారి నాటుకుంటే చాలు. వారం రోజుల్లో కొత్త రెమ్మలు, వేర్ల వృద్ధి కనిపిస్తుంది. దీంట్లోంచి అవసరమైనప్పుడల్లా కొంత సేకరించుకుని ఇంట్లో వాడుకోవచ్చు.

* ఉల్లికాడలను కుండీలో నాటుకోవచ్చు. అవసరమైనప్పుడల్లా కాడలు కత్తిరించుకుని వినియోగించుకోవచ్చు.
* ఇంట్లోనే క్యాబేజీని సైతం పెంచుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని