అక్కడ అభివృద్ధికి ఎంతకాలం పడుతుంది?

84 గ్రామాలు.. 1.32 లక్షల ఎకరాలు..  538 చ.కి.మీ. పరిధి.. రెండున్నర దశాబ్దాల పాటు కొనసాగిన జీవో 111 ఆంక్షల ఎత్తివేతతో అభివృద్ధి ఇక పరుగులేనా? ఇక్కడున్న పరిధిలో పదో వంతు మాత్రమే ఉన్న

Published : 04 Jun 2022 03:25 IST

ఈనాడు, హైదరాబాద్‌

84 గ్రామాలు.. 1.32 లక్షల ఎకరాలు..  538 చ.కి.మీ. పరిధి.. రెండున్నర దశాబ్దాల పాటు కొనసాగిన జీవో 111 ఆంక్షల ఎత్తివేతతో అభివృద్ధి ఇక పరుగులేనా? ఇక్కడున్న పరిధిలో పదో వంతు మాత్రమే ఉన్న ఐటీ కారిడార్‌ అభివృద్ధికి పాతికేళ్లు పట్టింది. 90వ దశకంలో పురుడు పోసుకున్న మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాలు ప్రస్తుతం ఆకాశహర్మ్యాలు, అద్దాల మేడలతో సరికొత్త సైబరాబాద్‌ నగరంగా వెలుగొందుతున్నాయి. ఇందుకు చాలా రకాల పరిస్థితులు దోహదం చేశాయి. మరి ఇప్పుడున్న హైదరాబాద్‌ నగర పరిధి స్థాయిలో ఉన్న జీవో 111 పరిధిలో అభివృద్ధికి  ఎన్నేళ్లు పడుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదని నిర్మాణ రంగ ప్రతినిధులు అంటున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలకు చేరువగా ఉన్న గ్రామాల్లో సైతం ప్రగతికి పదేళ్లు పడుతుందని చెబుతున్నారు.

పాత జీవో ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం కొత్తజీవో 69 జారీ చేసింది. మార్గదర్శకాలు రూపొందించేందుకు కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది.  అదే సమయంలో నగరానికి సరికొత్త బృహత్తర ప్రణాళికను 18 నెలల్లో తీసుకురాబోతున్నట్లు సర్కారు ప్రకటించింది. ఇందులోనే జీవో 111 పరిధి సైతం ఉండబోతుందని పర్యావరణహితంగా ఉంటుందని మాత్రమే ప్రభుత్వం చెప్పింది.  ఆంక్షల ఎత్తివేతతో భూముల విలువలు చాలాచోట్ల రెట్టింపు అయ్యాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతులు.. అవసరాలరీత్యా భూములను విక్రయిస్తున్నారు. మున్ముందు ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలతో ఇక్కడ భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు రంగంలోకి దిగాయి. 

ప్రాజెక్టులు వచ్చేందుకు..
మార్గదర్శకాలు వచ్చి, మాస్టర్‌ప్లాన్‌ రూపుదిద్దుకుని అందుకు అనుగుణంగా తొలి ప్రాజెక్ట్‌ వచ్చేందుకు ఎంతలేదన్నా ఏడేళ్లు పడుతుందని రియల్టర్లు అంటున్నారు. వాణిజ్య కార్యకలాపాలైన మాల్స్‌, స్టార్‌ హోటల్స్‌ వచ్చేందుకు పదేళ్లు పడుతుందని చెబుతున్నారు. అది కూడా ప్రభుత్వం ప్రకటించే జోనింగ్‌ను బట్టి ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువమంది ఏకో జోన్‌గా, ఇప్పుడున్న నగరానికి మరింత ఆకర్షణ తెచ్చేదిగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం సైతం మౌలిక వసతుల కల్పనపై పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదంతా దశలవారీగా కొనసాగుతుంది.


పది నుంచి ఇరవై ఏళ్లు పడుతుంది
- జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ బిల్డర్స్‌ అసోసియేషన్‌

మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ప్లాటింగ్‌ 1993 ప్రాంతంలో మొదలైంది. ఈ ప్రాంతం సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌గా అభివృద్ధి చెందడానికి 20 ఏళ్లు పట్టింది. ఇప్పటికీ కోకాపేట, నార్సింగి, నానక్‌రాంగూడలో మాల్స్‌ లేవు. అన్నిరకాల మౌలిక వసతులు ఒకేసారి కల్పించడం సాధ్యం కాదు. జీవో 111 పరిధిలోని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి పది నుంచి ఇరవై ఏళ్లు పడుతుంది. సిటీకి, ఈ ప్రాంతానికి కలిపి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకే రెండేళ్లు పడుతుంది. ఒకవేళ విడిగా తీసుకొచ్చినా కనీసం 9నెలలు పడుతుంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని