గూళ్లు.. ఊళ్లయ్యాయి

గేటెడ్‌ కమ్యూనిటీల్లో మొదట్లో వంద రెండు వందల ఫ్లాట్లు ఉండేవి. ఐదు అంతస్తుల్లో కట్టేవారు. తర్వాత ఐదు వందల నుంచి వెయ్యి నివాసాలకు పెరిగాయి. ఎత్తు సైతం పది నుంచి పదిహేను అంతస్తులకు పెరిగింది. చూస్తుండగా ఒక కమ్యూనిటీలో వెయ్యి

Published : 11 Jun 2022 04:48 IST

2వేల యూనిట్లకు తగ్గేదేలే అంటున్న నిర్మాణ సంస్థలు

ఈనాడు, హైదరాబాద్‌

గేటెడ్‌ కమ్యూనిటీల్లో మొదట్లో వంద రెండు వందల ఫ్లాట్లు ఉండేవి. ఐదు అంతస్తుల్లో కట్టేవారు. తర్వాత ఐదు వందల నుంచి వెయ్యి నివాసాలకు పెరిగాయి. ఎత్తు సైతం పది నుంచి పదిహేను అంతస్తులకు పెరిగింది. చూస్తుండగా ఒక కమ్యూనిటీలో వెయ్యి నుంచి రెండువేల ఫ్లాట్లు వచ్చేశాయి.. నివాసాల అంతస్తులు సైతం 20 నుంచి 30కి పెరిగాయి. ఇక ఇప్పుడు వస్తున్నవన్నీ ఆకాశహర్మ్యాలే. 30 నుంచి 45 అంతస్తుల వరకు ఎత్తుకు వెళుతున్నారు. వీటిలో రెండు వేల నుంచి గరిష్ఠంగా 4వేల వరకు ఫ్లాట్లను కడుతున్నారు. ఒక్కోటి పది నుంచి పాతిక ఎకరాల విస్తీర్ణంలో కడుతున్న ఈ ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తున్నాయి. గూళ్లు కాస్తా ఊళ్లవుతున్నాయి.  రాజధాని హైదరాబాద్‌లో నిర్మాణ సంస్థలు పోటీపడి మరీ ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులు చేపడుతున్నాయి. సిటీ నుంచి దూరంగా విస్తరించేందుకు అవకాశం ఉన్నా.. నిటారుగా చుక్కలను తాకేలా ఎత్తైన అపార్ట్‌మెంట్లను కట్టేందుకే ఆసక్తి చూపిస్తున్నాయి. రెండువేల ఫ్లాట్ల పైన నిర్మిస్తున్న పలు గేటెడ్‌ కమ్యూనిటీల పనులు పురోగతిలో ఉండగా.. మరికొన్ని ఇప్పుడే మొదలెట్టాయి. కొవిడ్‌ కంటే ముందే మొదలెట్టిన ప్రాజెక్టుల్లో దశలవారీగా కొనుగోలుదారులకు ఫ్లాట్లను అప్పగిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో ఈతరహా ప్రాజెక్టులు ఎక్కువ ఉండగా.. సిటీలోని ఇతర ప్రాంతాల్లో ఒకటి రెండు చొప్పున వస్తున్నాయి. కొనుగోలుదారుల నుంచి వీటికి స్పందన సానుకూలంగా ఉందని బిల్డర్లు అంటున్నారు.

కార్యాలయాలకు చేరువలో..

పెద్ద సంఖ్యలో ఫ్లాట్లు కడుతున్న అపార్ట్‌మెంట్లు అన్నీ కూడా కార్యాలయాల పక్కనే ఉంటున్నాయి. చుట్టుపక్కల ఆఫీసులు.. మధ్యలో నివాసాలు అన్నట్లుగా కడుతున్నారు. పని ప్రదేశానికి నడుచుకుంటూ సైతం వెళ్లొచ్చు. మాదాపూర్‌, నార్సింగి, నానక్‌రాంగూడ, ఖాజాగూడ, గచ్చిబౌలి, కోకాపేట, గండిపేట, తెల్లాపూర్‌, నల్లగండ్ల, ఉప్పల్‌లో కార్యాలయాలు, వాటి పక్కన నివాసాలు నిర్మాణంలో ఉన్నాయి.
టౌన్‌షిప్పులు  : వేల మంది ఒకేచోట నివాసం ఉండేలా కడుతున్నారు కాబట్టి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. గేటు దాటి బయటికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా మినీ థియేటర్లతో సహా వంద వరకు సౌకర్యాలను కల్పిస్తున్నారు. క్లినిక్‌లు సైతం అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల్లో టౌన్‌షిప్పులుగా అభివృద్ధి చేస్తున్నారు. అదే ప్రాంతంలో మాల్స్‌, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నారు. తెల్లాపూర్‌ నుంచే ఈ పోకడ మొదలైంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని