ఆహ్లాదానికో ఇల్లు..!

చుట్టూ పచ్చని పరిసరాలు.. మనసుకు హాయిగొలిపే వాతావరణం.. పని ఒత్తిడి నుంచి పెద్దలకు ఉపశమనం.. పిల్లలకు ప్రకృతిలో కాలక్షేపం.. సిటీలోని రణగొణ ధ్వనులకు దూరంగా.. సిటీ బయట ప్రశాంతంగా ఉండే వారాంతపు ఇళ్లవైపు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు.

Updated : 18 Jun 2022 07:27 IST

శివార్లలో పెరుగుతున్న వీకెండ్‌ హోమ్‌ ప్రాజెక్ట్‌లు
ఈనాడు, హైదరాబాద్‌

చుట్టూ పచ్చని పరిసరాలు.. మనసుకు హాయిగొలిపే వాతావరణం.. పని ఒత్తిడి నుంచి పెద్దలకు ఉపశమనం.. పిల్లలకు ప్రకృతిలో కాలక్షేపం.. సిటీలోని రణగొణ ధ్వనులకు దూరంగా.. సిటీ బయట ప్రశాంతంగా ఉండే వారాంతపు ఇళ్లవైపు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కల ఈ తరహా వీకెండ్‌ హోమ్స్‌ను చేపడుతున్నాయి.
వృత్తి, ఉద్యోగరీత్యా కాంక్రీట్‌ జంగిల్‌లాంటి నగరంలో ఉంటున్నవారు వారాంతంలో కుటుంబంతో సరదాగా గడపాలనుకుంటున్నారు. సొంతూర్లలో ఇళ్లు, పొలాలు ఉన్నవారు తరచూ అక్కడికి వెళ్లి వస్తుంటే.. లేనివారు సిటీకి దగ్గరలో ఫామ్‌ల్యాండ్స్‌, రిసార్ట్స్‌, వీకెండ్‌హోమ్స్‌ వెంచర్లలో స్థలాలు కొని ఇళ్లు కట్టుకుని ఉండేందుకు ఇష్టపడుతున్నారు.

నివాసం ఉండేలా..
నగరంలో ఫామ్‌ల్యాండ్‌ ప్రాజెక్ట్‌లు ఎంతోకాలంగా ఉన్నాయి. ఫామ్‌హౌస్‌ కట్టుకోవచ్చు అని వీటిలో కొంటున్నా.. నివాసయోగ్యంగా ఉంటున్నవి తక్కువే. కొన్నవారు సైతం అప్పుడప్పుడు వెళ్లి చూసుకుని రావడం తప్ప పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. పూలు, పండ్ల మొక్కలను మాత్రం పెంచుతున్నారు. కొన్నిచోట్ల సామూహిక వ్యవసాయం చేపట్టి వచ్చిన ఫలాలను యాజమానులకు పంచుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఉండాలనుకుంటే క్లబ్‌హౌసే శరణ్యం అవుతోంది. రిసార్టుల్లో అంటే భయభయంగా గడపాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ రెండింటి కలయికగా వీకెండ్‌ హోమ్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. శివార్లలో విల్లాలు ఖరీదు కావడంతో మరింతదూరంలో వారాంతపు నివాసాలను కొంటున్నారు.

ఎక్కువ మంది కట్టుకునేలా..
ప్రాంతీయ వలయ రహదారి వస్తుండటంతో ప్రస్తుతం ఎక్కువగా వీకెండ్‌ హోమ్స్‌ ఇక్కడ వస్తున్నాయి. శంకర్‌పల్లి, చెవేళ్ల, వికారాబాద్‌, జహీరాబాద్‌, సాగర్‌ రహదారి, శ్రీశైలం, బెంగళూరు, యాదాద్రి, మేడ్చల్‌ వైపు వస్తున్నాయి. స్థలాలు విక్రయించి వాటిలోనే వీకెండ్‌ హోమ్‌ కట్టిచ్చి ఇస్తున్నారు. మొత్తం ప్లాటింగ్‌లో ఇళ్లు కట్టుకుని వారాంతంలో అక్కడ ఉండటానికి ఇష్టపడేవారికే విక్రయిస్తున్నారు. ఎప్పుడు వెళ్లినా కమ్యూనిటీలో కొన్ని కుటుంబాలు నివాసం ఉంటాయి కాబట్టి ధైర్యంగా అక్కడ ఉండొచ్చు అనే భావనలో కొనుగోలుదారులు ఉన్నారు.
కుటీరాలుగా..
వారాంతపు నివాసాలను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డిజైన్‌ చేయిస్తున్నారు. పాత రోజుల్లో ఊర్లలో మాదిరి మండవ ఇళ్లు, కేరళలో మాదిరి ఆవాసాలను నిర్మిస్తున్నారు. కలప ఇళ్లను కడుతున్నారు. సిటీలో అపార్ట్‌మెంట్లలో నాలుగు గోడల మధ్య ఫ్లాట్‌లలో ఉంటున్నవారిని ఈ తరహా కుటీరాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రెండు వందల గజాల నుంచి వెయ్యి గజాలు, పావు, అర్ధ, ఎకరం విస్తీర్ణంలో వీకెండ్‌ హోమ్స్‌ను కొందరు సొంతంగా నిర్మించుకుంటుండగా.. కొన్ని ప్రాజెక్టుల్లో ఏకరూపత కోసం డెవలపర్లే కట్టి ఇస్తున్నారు. వంద నుంచి రెండు వందల గజాల విస్తీర్ణం వరకే ఇంటిని పరిమితం చేసి.. మిగతా స్థలంలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మన సంస్కృతిని ప్రతిబింబించేలా కొన్నిచోట్ల వారాంతపు నివాసాలు కడుతుంటే.. మరికొన్నిచోట్ల విదేశాల్లో మాదిరి వీకెండ్‌హోమ్స్‌ను కడుతున్నారు.

పెట్టుబడిగానూ..      
తమ కలల వారాంతపు విడిదితోపాటు పెట్టుబడిగానూ ఉంటుందని వీకెండ్‌ హోమ్స్‌పై కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే సిటీలో ఇళ్లు ఉన్నవారు రిటైర్డ్‌ అయ్యాక గడిపేందుకు, పిల్లల భవిష్యత్తు కోసం వీటిని కొనుగోలు చేస్తున్నారు.
సకల సౌకర్యాలు...
వారాంతంలో ఇంటికి వచ్చినవారికి సకల సౌకర్యాలు కమ్యూనిటీలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కులతోపాటు ఈతకొలను, క్లబ్‌హౌస్‌, ఇండోర్‌, అవుట్‌డోర్‌ క్రీడా వసతులు, రెస్టారెంట్‌, కామన్‌కిచెన్‌ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రీమియం ప్రాజెక్టుల్లో మరిన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. అక్కడే పెళ్లి వేడుకలు, పార్టీలు చేసుకునే విధంగా సదుపాయాలు ఉంటున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని